Thursday, April 23, 2020

రాహు కేతువులు

🌚 రాహు కేతువులు 🌚



మన దేవాలయాలలో నవగ్రహాలలోని రాహు, కేతువులకు ప్రత్యేక సన్నిధులు వుండడం చాలా అరుదు. అలావున్నా ఒకే సన్నిధిలో విడి విడిగా దర్శనమిస్తారు. ఆవిధంగా
రాహు, కేతువులకు ప్రత్యేక
సన్నిధులు వున్న దేవాలయాలు తమిళనాడు లో
శీర్కాళిలోని, నాగేశ్వరముడైయార్ ఆలయం.
రాహు దోష నివారణాలయంగా
చెప్పబడే దీనికి శిరపురం, బ్రహ్మపురం, వేణుపురం,
పుగళి, వెంగురు‌‌, దోణిపురం,
పుందరాయ్, పురవం, చణ్బై
కాళీపురం, కొచ్చైవం,
కళుమలం అని అనేక పేర్లు వున్నాయి.
రాహు, కేతువులు ఈ ఆలయంలో కొలువైయున్న పరమేశ్వరుని ప్రార్ధించి నవగ్రహ పదవి పొందారు.

దేవతలు , దానవులు
పాలకడలిని చిలికి అందు లభించిన అమృతాన్ని మహావిష్ణువు
జగన్మోహినీ రూపంలో ,
దేవతలకి మాత్రమే పంచగా, ఆ సమయంలో , మోహిని
రూప లావణ్యాలను చూసి
మైమరచి పోయిన దానవులు అమృతం సంగతి వదిలేశారు.

అదే సమయంలో , స్వర్భాను అనే దానవుడు (సింహిక పుత్రుడైనందున
సింహికేయన్ అనే పేరు వున్నది) మాత్రం ఏ చాంచల్యం లేకుండా మనోనిగ్రహంతో
వున్నాడు. దేవతలకు మాత్రమే అమృతం పంచబడడం చూసి , తను కూడా ఒక దేవత రూపంలో
సూర్య చంద్రుల మధ్య నిలబడి దేవామృతాన్ని స్వీకరించాడు. అది గ్రహించిన
సూర్య చంద్రులు, జగన్మోహిని రూపంలో వున్న మహావిష్ణువు కి కనుసైగ చేశారు. మహావిష్ణువు తన చేతిలో వున్న గరిటతో దేవత రూపంలో వున్న దానవుని తలమీద గట్టిగా ఒక దెబ్బ వేశాడు. ఆ దెబ్బకి దానవుని తల తెగి శిరపురం
అని పిలవబడిన యీనాటి
శీర్కాళిలోను , దేహం మాత్రం
సెంపాంబిన్ కుడియిల్ అనే
చోట పడ్డాయి. అమృతము
తాగినందున ఆ దానవుడు మరణించలేదు. తల వేరుగా , మొండెము వేరుగా వుండే సర్పాకృతిని పొందాడు.

ఈ సర్పరూపంలోని రెండు భాగాలు వాయువుని మాత్రం శ్వాసిస్తూ, పరమశివుని
గూర్చి తీవ్రంగా తపస్సు చేశాయి. వారి తపస్సు కి మెచ్చిన పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై
వృషభవాహనారూఢుడై
ప్రత్యక్ష మైనాడు.
అప్పుడు ఆ సర్పాకృతులు
పరమేశ్వరుని , సంజ్ఞలచే తమకీ దుర్గతి పట్టించిన
సూర్య, చంద్రులను మ్రింగి వేసే శక్తిని ప్రసాదించమని
ముల్లోకాలని పట్టుకొని ఆడించే శక్తిని తమకు అనుగ్రహించమని, వేడుకున్నారు.

సూర్య చంద్రులు మీకు శతృవులు కావచ్చు , కాని
వారు సకలలోకాలను, ఒక్క నిముషం కనుమూయకుండా కాపాడుతున్నారు. వారు లేకపోతే సమస్తమూ స్థభించిపోతుంది. అందువలన అమావాస్య , పౌర్ణమి రోజుల లో మాత్రం మీరు వారి మీద అధికారం చెలాయించ వచ్చును, సంవత్సరానికి
ఒకటి రెండు రోజులు మాత్రం
కొంతసమయం (గ్రహణం)
మాత్రం వారిని పట్టి పీడించి
తరువాత సూర్య, చంద్రులను
వదలి వేసేలా పరమశివుడు వరాలను
అనుగ్రహించాడు.
పరమేశ్వరుని అనుగ్రహంతో
అసురుని శిరోభాగము రాహువు గానూ , దేహ భాగము కేతువుగానూ మారి అంతదాకా వున్న ఏడు గ్రహాలతో కలసి
నవగ్రహ స్ధానాలని పొందేలాగ
ఈశ్వరుడు వారికి వరములు అనుగ్రహించాడు.

ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు నాగేశ్వరముడైయారు అనే
పేరుతోను, అమ్మవారు
పున్నాగవల్లి గాను
అనుగ్రహం కటాక్షిస్తున్నారు.

శీర్కాళిలో వున్న
నాగేశ్వరముడైయార్ ఆలయ రాజగోపురం మూడు అంతస్థులతోవుంటుంది.

ప్రవేశ ద్వారం దాటి లోపలకు ప్రవేశించగానే
దక్షిణాది శిల్పకళా నైపుణ్యం వుట్టిపడేలా ఒక అందమైన
ముఖమండపం వుంటుంది.
అర్ధమండపం తరువాత
గర్భగుడి వుంటాయి.
మూలవిరాట్ గా నాగేశ్వరముడైయారు
లింగ రూపంలో దర్శనమిస్తాడు.
అమ్మవారు పున్నాగవల్లి దక్షిణా ముఖంగా
ప్రత్యేక సన్నిధిలో అనుగ్రహిస్తూంటుంది.
ఆవరణలో దక్షిణామూర్తి ,
ప్రాకారంలో మాణిక్య వినాయకుడు, దేవయాని సమేత కుమారస్వామీ , చండికేశ్వరుడు, సూర్యుడు
మరియు భైరవుడు,
దక్షిణ దిశలో వళ్ళీదేవి ,
ఆ వళ్ళికి అనుగ్రహమిచ్చిన
వినాయకుడు వున్నారు.

ఈ ఆలయంలో, దుర్గకి, నవగ్రహాలకి ఆగమశాస్త్రానుసారం వుండవలసిన
సన్నిధులు లేవు. శనిగ్రహానికి
రాహువు మిత్రుడు కావడం వలన శని సతీ సమేతంగా , రాహువు సన్నిధిలో దర్శనమివ్వడం ఒక విశేషం.

ఇంద్రునిచే నిర్మించబడిన సుందర ఉద్యానవనాన్ని కాపాడడానికి
వినాయకుడు కాకి రూపంలో వచ్చి అగస్త్య మహర్షి యొక్క కమండలాన్ని
త్రోసివేసినందున అందులోని పుణ్యజలం కళుమల నదిగా
రూపొంది , యీ ఆలయ తీర్ధమైనది. యీ నది ఆలయానికి పడమట దిశలో
ప్రవహిస్తున్నది.

శీర్కాళి నాగేశ్వరునికి నిత్యం ఆలయంలో నాలుగు
కాలాల పూజలు జరుగుతాయి.
ఆదివారం, రాహు కాల సమయంలో
పరమేశ్వరునికి, అమ్మవారికి,
రాహువుకి పాలాభిషేకాలు
జరుగుతాయి.
జాతకాలలో రాహు, కేతు
దోషం వున్న వ్యక్తులు
రాహు, కేతు సన్నిధులకు వచ్చి
ఎడమ ప్రక్కనుండి తొమ్మిది సార్లు కుడిప్రక్కనుండి మూడు సార్లు అడుగులో అడుగు వేసుకుంటూ ప్రదక్షిణలు
చేస్తారు. ఈ విధంగా విడవకుండా పదకొండు వారాలపాటు భక్తి శ్రధ్ధలతో ప్రదక్షిణలు చేస్తే రాహు దోషం
నివారించబడుతుందని భక్తులు ధృఢంగా విశ్వసిస్తారు.

No comments:

Post a Comment