Thursday, November 19, 2020

ఎరుకతో ధ్యానం

🌸ఎరుకతో ధ్యానం🌸

మనిషి ఉనికి ఆత్మశక్తిపై ఆధారపడి ఉంది. అది ఉన్నందుకే ‘నేను ఉన్నాను’ అని మనిషి భావించగలుగుతున్నాడు ఇతరులతో ఉన్నప్పుడు ‘నేను’ అనే మాట పలుకుతాడు. సర్వకార్యాలు నిర్వర్తించగలుగుతాడు.

‘విలువలతో చక్కగా జీవించే మనిషికి ఉనికి మొదటిస్థానం, హృదయం రెండోస్థానం, మనసు మూడోస్థానంలో ఉంటాయి’ అని ప్రసిద్ధ తత్వవేత్త ఓషో అనేవారు. హృదయం స్పందిస్తుంది. మనసు ప్రతిస్పందిస్తుంది. ఉనికి గమనిస్తుంది. కేవలం ‘గమనించడం’ మాత్రమే తెలిసిన ఏకైక గుణం ఉనికిది. ‘గమనించడం’ అంటే చూడటమే! కాని, చూడటంకన్నా ‘గమనించడం’ ఉన్నతమైంది. ‘గమనించడంలో- చూడటం, వినడం రెండూ ఉంటాయి’ అని అనేవారు ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి!

పశుపక్ష్యాదులు ఎప్పుడూ గమనింపుతో జీవిస్తాయి. అందుకనే అవి ఎరుకతో ఉంటాయి. ఫలితంగా, రాబోయే ప్రమాదాలను ముందుగానే పసిగట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతాయి. ఎన్నో తెలివితేటలున్న మనిషి మాత్రం ప్రమాదాల బారిన పడుతుంటాడు. కారణం, అనవసరమైన ఆలోచనల వలలో అతడు చిక్కుకోవడంవల్లే! అంటే, పరధ్యానంలో పడటమన్నమాట.

ప్రస్తుత క్షణాల్లో ఉండకుండా గతానికి సంబంధించిన ఆలోచనలతో గడపడమే పరధ్యానమంటే! మనిషి పరధ్యానంలో ఉంటే ఎరుక తప్పుతాడు. అప్పుడు సమస్యలు కాకుల్లా వచ్చి అతడిపై వాలతాయి. మనిషి ఆలోచనలతో ఉన్నంతవరకు, మనసు బయట సంచరిస్తూ ఉంటుంది. అదే మనిషి ఒక పనిలో నిమగ్నమైతే ఆ వెంటనే మనసు నిశ్చలమవుతుంది. అప్పుడది లోపలికి చూస్తుంది. చేపట్టిన పనికి కావాల్సిన జ్ఞానం అంతశ్చేతనలో నుంచి తీసి ఇస్తుంది.

మనసు సముద్రగర్భం వంటిది. సముద్రం లోపల అప్పుడప్పుడూ హిమ ఖండాలు(ఐస్‌బర్గ్స్‌) తయారవుతాయి. అవి పర్వతాల్లా పరచుకొని పెరుగుతాయి. పైకిమాత్రం కొనతేలి చిన్న మంచుముక్కలా కనబడతాయి. వాటిని సరిగ్గా గమనించకపోతే సముద్ర ప్రయాణికులు ఆపదల్లో చిక్కుకున్నట్లే! మనిషికి వచ్చే వ్యాధులూ హిమ ఖండాల్లా మనసు లోతుల్లో ప్రాణం పోసుకుంటాయి. తదుపరి మనసులోపలే పర్వతాల్లా పెద్దగా అవుతాయి. ఆ తరవాత శరీరాన్ని తాకుతాయి. అంటే, ముదిరిన తరవాత వ్యాధి బయటపడటమన్న మాట! అప్పుడుగాని మనిషి తనకు జబ్బు చేసిందని గ్రహించడు. ఇలా ఎందుకు జరుగుతుంది? మానసిక స్థిరత్వం లేకపోవడం వల్లే! ఎప్పుడైతే మనసు నిలకడగా ఉండదో అప్పుడు ఎరుక ఉండదు. ఎరుక లేనప్పుడు తన ఉనికిపట్ల స్పృహ ఉండదు. అంటే తనతోతాను ఉండనప్పుడు, తన శరీరం లోపల ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉండటం అన్నమాట!

రాత్రిపూట ఇంట్లో హఠాత్తుగా దీపాలు ఆరిపోతే ఏమవుతుంది? ఆ చిమ్మచీకట్లో ఎవరికీ ఏమీ కనపడదు. అప్పటివరకూ ఏవేవో పనులు చేసుకుంటున్న మనసు ఆ క్షణంలో నిశ్శబ్ధమై పోతుంది. అప్పుడు మనిషి ఉనికి అతడి స్పృహలోకి వస్తుంది. ఎరుక మేల్కొంటుంది. చీకట్లో కొవ్వొత్తి కోసం చేసే వెతుకులాటలో గమనింపు సహకరిస్తుంది. ఇదంతా ధ్యానమే! అందువల్లే ‘ధ్యాన సాధనలో గమనించడమే ప్రధానం’ అంటారు తత్వవేత్తలు!

మనిషి ఏ పనిచేసినా, చివరలో ఒక ఫలితం కచ్చితంగా వస్తుంది. అది ప్రకృతి సూత్రం! ఒక అంకురం మట్టిలో నాటితే అది పెరిగి పెద్దదవుతుంది. పువ్వులు, ఫలాలు ఇస్తుంది. కనీసం రెండు ఆకులైనా ఇస్తుంది. ఏదీ ఇవ్వలేదంటే అసలక్కడ మొక్కే నాటలేదు, లేదా నాటిన మొక్కను బాగా చూసుకోలేదని నిర్ధారించుకోవచ్చు.

ధ్యానసాధనలో సాధకుడు కరుణామూర్తిగా మారాలి. ప్రేమికుడై పోవాలి. ఆనందపరవశుడు కావాలి. కొత్తగా నాటిన మొక్కకు పువ్వు పూసినట్లుగా, ధ్యానం చేసేవారికి ఒకరోజు ప్రేమ వికసించాలి. అలా జరగకపోతే ధ్యానంలో ఏదో లోపం ఉందని భావించాలి. గమనింపు- రెప్పలేని ‘కన్ను’ లాంటిది. మనసు- ఆ కంటికి ‘రెప్ప’వంటిది. రెప్ప తెరిస్తేనే చూడటం ఆరంభమవుతుంది. అప్పుడు ‘ఆనందం’ మనిషి సొంతమవుతుంది.

Source - Whatsapp Message

No comments:

Post a Comment