Sunday, November 22, 2020

మంచి విచారణ

మంచి విచారణ
🕉🌞🌏🌙🌟🚩

సంసారంలో ఉంటున్నప్పటికినీ అప్పుడప్పుడు ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి ఆవాసం చేయండి. తీరిక చిక్కినప్పుడు ఏకాంతంలో కనీసం ఒక్కరోజైనా భగవత్చ్చింతన చేయండి.


భగవంతుడి కోసం విలపిస్తే, అదికూడా మంచిదే. లోకులు భార్యాబిడ్డలకై కడివెడు కన్నీరు కారుస్తారు.కానీ భగవంతుడి కోసం ఎవరు విలపించరు...


ఈ సంసారంలో ఉంటూ అనేక కర్మలలో చిక్కువడి సాధకుడు మనస్సును స్థిరపరుచుకోవడంలో ప్రథమ దశలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కోవలసి ఉంటుంది..


సంసార సాగరంలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరు మొసళ్ళు ఉన్నాయి. ఒంటికి పసుపు రాసుకొని, ఆ తర్వాత నీళ్లలో దిగితే ఆ మొసళ్ల భయం ఉండదు.


వివేకా వైరాగ్యాలే ఆ పసుపు. భగవంతుడొక్కడే సత్యం, నిత్యం. తక్కినదంతా కేవలం మూన్నాళ్ళ ముచ్చెటే !.


ఈ ఎరుకే వివేకం. భగవంతుడి పట్ల తీవ్ర అనురాగాన్ని అలవర్చుకోండి. భగవంతుడికై ప్రేమను అనుభూతం చేసుకోండి. ఆయనవైపు ఆకర్షితులు కండి.


మనసులతో పెంచుకునే బంధం బాధలకు గురిచేస్తుంది. భగవంతునితో పెంచుకునే బంధం ఆనందాన్ని పెంచుతుంది.ఈ ప్రపంచంలో మన భాద్యతలను నిర్వర్తిస్తూ ఉండాలి. కానీ హృదయాంతరాళంలో మన బంధం భగవంతునితోనే ముడి పడి ఉండాలి. అప్పుడు మనః శ్శాంతికి ఎలాంటి భంగం కలగదు.


మానవుడు భోగాలకు బానిస. విషయసుఖాలను అనుభవించాలనే వాంఛ స్వార్థానికి సంకేతం. భోగాలకోసం వెంపర్లాడేవాడు తోటి వారి సుఖసంతోషాలను పట్టించుకోడు.


ఎప్పుడూ తన సౌఖ్యం, తన స్వార్థమే లక్ష్యంగా జీవిస్తాడు. అలాంటి వాడికి తనలో ఉన్నా చైతన్యమే ఇతరులలో కూడా ఉందన్న ఆలోచన రానే రాదు.


ప్రాపంచిక భోగాల్లో మునిగి ఉన్నా మనస్సుకు మంచి విచారాలు, సాధుసంగమం అనే వేడి తగిలినప్పుడే ఆ భోగవాంఛలు ఎండిపోతాయి..


మన ఇచ్చానుసారం అన్నీ జరగాలి అని అనుకున్నంతకాలం శాంతిలభించడం కల్ల.


ఎప్పుడైతే భగవంతుని ఇచ్చానుసారమే అన్ని జరుగుతున్నాయి అనే భావనతో కర్తవ్యాలను నిర్వర్తిస్తామో....అప్పుడు మాత్రమే నిజమైన సంతృప్తి, శాంతి లభిస్తాయి.


సర్వేజనాః సుఖినోభవంతు.

🕉🌞🌏🌙🌟🚩

Source - Whatsapp Message

No comments:

Post a Comment