అనేకత్వం నుంచి ఏకత్వంలోకి
మనం ఈ లోకంలోకి ఎందుకొచ్చామని ప్రశ్నించుకుంటే- ఎవరినుంచీ ఏ మార్గంలోనూ సమాధానం దొరకదు... ఒక్క ఆధ్యాత్మిక మార్గంలో తప్ఫ జీవితం రూపంలో లభ్యమైన ఇంత అమూల్యమైన ప్రయాణాన్ని ఇంత అర్థంలేని, ఇంత చవిలేని, ఇంత నిరర్థకమైన గమ్యం కోసమే చేశామని అర్థమై, వచ్చిన దారివైపు, ఆ చివర మొదలు పెట్టిన స్థానంవైపు చూస్తే- ఎంత అనాలోచితంగా, ఇంత అలవోకగా చేశామేమిటని... మన అజ్ఞానానికి మనమే సిగ్గుపడతాం.
ఒక పనిని లేదా కార్యాన్ని చేయాలనుకున్నప్పుడు తగినదాన్ని ఎన్నుకునే అవకాశం చాలావరకు మనకుంది. అల్లాటప్పా పని కాకుండా అమూల్యమైనదాన్ని, మన శ్రమకు తగిన ఫలితం ఇవ్వగలిగేదాన్ని ఎన్నుకోవాలి. మానవ జన్మ మనం ఎన్నుకున్నది కాకపోయినా (నిజానికి లోతుగా ఆలోచిస్తే అది మనం ఎన్నుకున్నదే. కర్మ ఫలాల ఫలితంగా)- దాన్ని ఎలా జీవించాలనే విషయం, దేనికి ఉపయోగించుకోవాలనే విషయం, నిర్ణయం మన మేధా పరిధిలోనే ఉంది. అంత మంచి వెసులుబాటును మనం సవ్యంగా వినియోగించుకోలేకపోతే మనకంటే మూర్ఖులు మరెవరూ ఉండరు.
ఈ లోకంలో లాభనష్టాలు, గెలుపోటముల ప్రసక్తి లేనిది కేవలం ఆధ్యాత్మిక రంగం మాత్రమే. ఒకే ఒక సంకల్పం, ఏకసూత్రం... స్వస్థానాన్ని, శాశ్వత ధామాన్ని చేరుకోవడం. పరమాత్మ పాదాల చెంత నిర్వికల్ప విశ్రాంతిని, శాశ్వత ఉపశాంతిని పొందడం. మార్గం ఒకటే అయినా మార్గమధ్యాన్ని నిరాటంకం, కంటకరహితం చేసుకోవలసి ఉంది. మలుపులు, మారు మార్గాంతరాలు లేకపోయినా మన మనసు చేసిన మార్గ నిర్దేశాన్ని అనుసరిస్తూనే మన అడుగు వేయబోయే మన ముందరి భాగాన్ని ప్రయాణ సౌలభ్యంగా మలచుకోవలసి ఉంది. దాని ఉద్దేశం- రేపటి ప్రయాణికులకు సానుకూలం చేయడం కూడా అయిఉండాలి. ప్రతి మానవ ప్రయత్నానికీ అందరి శ్రేయస్సు కూడా లక్ష్యమై ఉండాలి. ఇదే మానవ జీవన ప్రయాణ ఉద్దేశం, భగవన్నిర్దేశం కూడా.
ఒక మహావృక్షం నాజూకు తీగల అల్లికను ఆహ్వానిస్తుంది. పూలు పూయనిస్తుంది. ఒక చీమల పుట్ట పాముల వసతికి అంగీకరిస్తుంది. ఒక కాకి కోకిల పిల్లకు పొత్తిలి పరుస్తుంది. ప్రకృతి సదా సర్వదా ‘పరోపకార ప్రకృతి’తోనే తన ఉనికిని పరిపూర్ణం చేసుకుంటుంది... అదీ అత్యంత సహజంగా. మనిషి ఎందుకు అసహజ జీవనాన్ని ఎన్నుకున్నాడు? అనుక్షణం ప్రకృతితోనే జీవిస్తూ, ప్రకృతి సహకారాన్నే పొందుతూ ప్రయోజనాల విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఏకమాత్రంగా, ఏకసూత్రంగా, కళ్లు మూసుకుని ఆ అంధకార సహకారంతో తానొక్కడినే అనే భ్రమను తనకు తానే కల్పించుకుని స్వార్థంతో జీవిస్తున్నాడు. నిజానికి తాను ఆత్మనని తెలుసుకునేవరకు- తాను ఒక్కడు కాదు, అనేకం, అనేకానేకం. తాను ఆత్మనని గ్రహించిన క్షణమైతే... ప్రతి అణువూ తానే. శ్రీరామకృష్ణులు అలాంటి ఆత్మభావంతో లయమైనప్పుడే పరమహంస కాగలిగారు. అయితే ముందుగా అనేకత్వాన్ని అంగీకరించి సాధనా పూర్వక క్రమ పరిణామంలో, అనేకత్వాన్ని ఏకత్వ స్థాయిలోకి మలచుకున్నప్పుడు, మమేకమైనప్పుడు మాత్రమే అటువంటి అనుభూతి, పరివర్తన, స్థితి... సుసాద్యం.
పరమవిశ్రాంతి
ధ్యాస మీద ధ్యాస - సనాతన మార్గం.
ధ్యాస మీద ధ్యాస అంటే?
దయచేసి అర్థం వివరించగలరు గురూజీ...
* * *
ద్రష్ట మీద దృష్టి పెట్టడం.
గమనించేవాణ్ణి గమనించడం.
సాక్షికి సాక్షిగా ఉండడం.
ఎరుకను ఎరిగి ఉండడం.
ధ్యానించేవాణ్ణి ధ్యానించడం.
* * *
అది ఎలా సాధ్యం? అని ఒకరడిగారు...
* * *
గురువుకు అనుభవం కాదు...
అనుభవమే గురువు...
అనుభవమే భాషిస్తుంది...
ఆ భాషణం శిష్యునికి అనుభవంగా ప్రకటమౌతుంది....
వినడం-అనుభవం ఏకకాలంలో జరుగుతుంది శిష్యునికి....
* * *
ఉపనిషత్ ఋషులు ఎక్కడా...
నీతిని బోధించలేదు...
సాధనలు చెప్పలేదు...
ఆ కేవలజ్ఞానంతోనే...
మాటలతోనే...
ఆత్మసాక్షాత్కారాన్ని కలుగజేశారు...
* * *
ఒకడు ఫోన్ చేసి-
ఆత్మవిచారణను తెలియజేసే మంచిగ్రంథాలు లిస్ట్ ఇవ్వండి...తెప్పించుకుంటాను... అన్నాడు...
* * *
పుస్తకాలన్నీ ప్రక్కనబెట్టి...
నీలోపలికెళ్లిపో....అన్నాను.
* * *
ఆత్మవిచారణ అంటే ఇదేనా?
అక్కడ నేనెవడను? అని ప్రశ్నించుకోవాలా?
* * *
కాదు...
(నేనుగాక)నీవెవడవు? అని నిన్ను ఆత్మ విచారిస్తుంది...
అదే ఆత్మవిచారణ.
ఆత్మ చేసే విచారణే ఆత్మవిచారణ.
నీకు ఉనికే లేదని తెలుసుకోవడమే...
ఆత్మవిచారణాఫలం.
అదే శరణాగతి.
అదే పరమవిశ్రాంతి.
* * *
విశ్రాంతిలో నీవుంటావు...
పరమవిశ్రాంతిలో నీవుండవు...
పరమవిశ్రాంతే ఉంటుంది.
No comments:
Post a Comment