Wednesday, October 26, 2022

ఓ ఉత్తమ ప్రజ్ఞాశాలి,!

 ఓ ఉత్తమ ప్రజ్ఞాశాలి,! 

ఊహాతీతము, అద్వితీయము అగు మాయకు సాధ్యము కానిది ఏమి కలదు? 

పిండము - దేహము - మొదలుకొని బ్రహ్మాండము వరకు గల విశ్వము యొక్క సృష్టిని గురించి చెప్పెదను; వినుము.

చిదాకాశరూపమగు జీవాత్మ యందు ఆలోచనల రూపంలో ఉన్న ఇదంవృత్తి యను విక్షేపశక్తి కోట్ల కొలది వాసనలను కల్పించును. 

వాసనల చేత కలతపడిన జీవుడు చిదాకాశ రూపమగు తన ఆత్మను శరీరము మొదలగు అనేక రూపములు గలదానిగా దర్శించును. 

చేతులు కాళ్లు మొదలగు అవయవములు గల ఈ శరీరము నాది, నేను ఈ తండ్రికి కొడుకును, నాకు ఇన్ని ఏండ్లున్నవి అని జీవుడు భావించును; 
మరియు వీరు నాకు ఇంపైన బంధువులు, ఇది నా అందమైన ఇల్లు. ఆమె ఈమెయే. అతడు ఇతడే. నేను, నీవు, ఇది, అది మంచి - చెడులు సుఖ- దుఃఖములు, బంధ-మోక్షములు, 
జాతివర్ణ - ఆశ్రమాదులు, దేవతలు - పశుపక్షాదులు, నరులు మొదలగువారు, మంచివారు, చెడ్డవారు, మధ్యములు, భోక్త, భోగము, భోగ్యవస్తు సముదాయము, లోకములు, కోట్లకొలది బ్రహ్మాండములు - ఇట్టి అసత్య భావనలు జీవుని ఆత్మయందు భాసించును.

మనశ్చలనము చేత కలిగిన వాసనలు నానా రూపములలో ఉండును; 

సహజముగా నిర్వికారుడగు జీవుడు నిద్రించి భ్రాంతి వలన వాసనలకు వశుడయి లోకములను (జాగ్రదావస్థలో) చూచు విధముగా అనేక విధములగు దేహములను చూచును.

ఓం తత్ సత్

No comments:

Post a Comment