Tuesday, October 25, 2022

అసలైన ఆభరణం

 అసలైన ఆభరణం 
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈

💫 ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని, నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను అదుపులో  ఉంచుకోగలిగితే మన జీవితం అదుపు తప్పకుండా ఉంటుంది. నాలుకను అదుపు చేసుకోగల  విద్య తెలిస్తే, అనేక విద్యలు అవలీలగా ఒంటపడతాయి.

💫 నోటిని అదుపులో  పెట్టుకుని అందరితో మర్యాదగా మాట్లాడుతూ, పద్ధతిగా నడుచుకుంటూ ఉంటే  ఎక్కడైనా, ఎప్పుడైనా మంచే జరుగుతుంది.

💫 చెట్టు సారం పండులో వ్యక్తమైనట్లుగా, మనిషి సారం అతడి మాటలో తొంగి చూస్తూ ఉంటుంది. మంగళకరమైన మాట తీరు మనిషి సంస్కారానికి గీటురాయి.

💫 మనిషికి నిజమైన అలంకారం అతడి మాట తీరే. ‘వాగ్భూషణమొక్కటే  మనిషికి సుభూషణం’ అన్నాడు భర్తృహరి. 

💫 సంభాషణం -  మిత భాషణం, హిత భాషణం, స్మిత  భాషణం, ప్రియ భాషణం, పూర్వ భాషణం, సత్య భాషణం అయినప్పుడు - అంతకన్నా భూషణం  మరొకటి లేదు.

💫 ‘మితంగా,  హితంగా మాట్లాడాలి. మనిషికి గౌరవం తెచ్చేవి ఇవే’ అనేవారు గాంధీజీ.

💫 ఎప్పుడూ  నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుతూ ఉండాలి. మధుర భాషణం వల్ల మర్యాద లభిస్తుంది.  

✅ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది కదా. ప్రియంగా మాట్లాడాలి.

💫 ఎదుటి వారిని  ముందుగా మనమే పలకరించడం పూర్వ భాషణం.

💫 రాముడు స్మిత పూర్వ భాషి - మాట కన్నా  ముందు ఆయన చిరునవ్వు ఎదుటివారిని పలకరించేది.

💫 సత్యమే సర్వోన్నతమైంది కనుక నిర్భయంగా సత్యాన్ని పలుకు. ఆ సత్యాన్ని ప్రేమగా, నేర్పుగా చెప్పాలి. మర్యాదగా, హుందాగా మాట్లాడాలి.

💫 ఆలోచించకుండా మాట్లాడటం, గురి చూడకుండా బాణం వేయడం లాంటిది. మాట్లాడిన  తరవాత ఆలోచించాల్సిన అవసరం రాకూడదు. కాబట్టి ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి.  

💫 ‘తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు’ అన్నారు స్వామి వివేకానంద.

💫 ఎవరైతే తమ  మాటలవల్ల, చేతల వల్ల ఇతరులకు బాధ కలిగించకుండా ఉంటారో వారే ఉత్తములు.

💫 ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఆదరణ పూర్వకంగా చెప్పే మాటలకు ఆచరణ  ఎక్కువ.

💫 ఆకట్టుకునేలా మాట్లాడటం ఓ కళ. అయితే ఆ మాటలను ఎప్పుడు  మొదలుపెట్టాలో, ఎప్పుడు ఆపాలో తెలియడం మరీ గొప్ప కళ. 

💫 మాటలే మంత్రాలు,  చెట్లే ఔషధాలు. మాటలు చాలా పదునైనవి కనుక జాగ్రత్తగా వాడాలి, బలమైనవి కనుక  సున్నితంగా వాడాలి, ఖరీదైనవి కనుక పొదుపుగా వాడాలి.

💫 మాట్లాడటం అందరూ  చేస్తారు. అయితే అందరిలాగా కేవలం నోటితో మాట్లాడితే సరిపోదు. మరింత  ప్రభావాన్వితంగా ఉండాలంటే మనసుతో, శరీరంతో మాట్లాడాలి.

💫 మాటే  సంపదలకు, మానవ సంబంధాలకు మూలం. 
మాటే స్నేహితుల్ని సంపాదించి పెడుతుంది, శత్రువుల్నీ తయారు చేస్తుంది. 

💫 నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు  ధన్యుడు. అలాంటివారికి శత్రువులే ఉండరు. 

💫 మాటలు గాయపరచగలవు, అదే గాయాన్ని  నయం చేయనూగలవు. సరైన మాటతీరు - చంపడానికి వచ్చిన శత్రువు మనసునైనా  మార్చగలదు.

💫 మాటల మధ్యలో సందర్భానుసారంగా సామెతలు, లోకోక్తులు వాడితే  పాయసంలో జీడిపప్పులా మరింత మధురంగా, వినసొంపుగా అనిపిస్తుంది. సంభాషణ సరస  చతురత కలిగి ఉండాలి. తిడుతూనే నవ్వించే హాస్య కుశలత కలిగి ఉండాలి.

💫 ఎవరితో, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. ఈ విషయంలో రామాయణంలో  నాయకుడైన మర్యాదా పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు, సుందరకాండకు నాయకుడైన  సుందరమూర్తి హనుమంతుడు మనకు ఆదర్శం కావాలి.

💫 మనిషికి భావ వ్యక్తీకరణ  గొప్ప ఆస్తి. ఏం చెప్పారనేదానిక న్నా ఎలా చెప్పారనే దాన్నిబట్టి భావప్రసరణ  మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. 

💫 భావవ్యక్తీకరణ ఎంత గొప్పగా ఉంటే ఫలితం అంత  మహత్తరంగా ఉంటుంది!


సేకరణ: 
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫

No comments:

Post a Comment