Saturday, October 29, 2022

మంచి మనస్సుతో ఆలోచించే ప్రతివారిలో దేవుడు కొలువై ఉన్నాడని చెప్పవచ్చు.

 అంతరాత్మలోనే పరమాత్మ                                                                                   మనం వెతికే దేవుడు, మనం చూడాలనుకుంటున్న దేవుడు, మనం పూజలు చేస్తున్న దేవుడు కేవలం దేవాలయాల్లో మాత్రమే కాక నీలో, నాలో, ప్రతి అణువులో, దయార్ద్ర హృదయం కల ప్రతివారిలో, నలుగురికి మేలు చేయాలనే సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరిలో ఆ దేవుడు ఉన్నాడు. అందుకే దేహానికి మించిన దేవాలయం లేదు. అంతరాత్మకు మించిన దేవుడు లేడు. నిస్సహాయునికి చేసే సేవలో పరమాత్ముడుంటాడు. మన వేద విజ్ఞానం చాలా గొప్పదని చెప్పవచ్చు. మన వేద ప్రబోధం చాలా విశిష్టమయినది. వేదాలు తరగని సంపదలు. వేదం అంటే కేవలం మంత్రాలే కాదు. వేదాలు ఏ ఒక్కరి సొత్తు కాదు. వేదాలవల్ల జ్ఞానం కలుగుతోంది. సర్వజనహితం కోసం, సర్వజీవుల సముద్ధరణ కోసం ఆ భగవంతుడిచ్చిన జ్ఞానం. వేదం సమస్త హిందూ కులబంధువుల ఆస్తిగా చెప్పవచ్చు. దేహమే దేవాలయమని చెప్పడం ఏ మతానికి సాధ్యం కాదు.

మనకున్న నాల్గు వేదాలు:
ప్రజ్ఞానం బ్రహ్మ - ఋగ్వేదం చెబుతుంది
అహం బ్రహ్మాన్ని - యజుర్వేదం చెబుతుంది
తత్త్వమసి - సాదవేదం చెబుతుంది

ఆయామాత్మా బ్రహ్మ - అధర్వణవేదం చెబుతుంది.
వేదం అంటే ప్రబోధం. అజ్ఞానం నుండి సుజ్ఞానానికి, చీకటి నుండి వెలుతురులోకి నడిపించే దివ్యచైతన్యం. 

జననం నుండి మరణందాకా ఎలా జీవించాలో వేదం చెబుతుంది. మనిషికి సుఖాన్ని ఇచ్చేది మనస్సు. డబ్బు ఎంతమాత్రం కాదు. అన్నింటికి మనస్సే కారణమవుతుంది. మనం చూస్తున్న, వింటున్న ఈ భూమండలమంతటా ఆ పరమాత్మ ఉన్నాడు.

 అంతం లేనటువంటి నాశనం కాని సృష్టిస్థితి లయకారకుడయిన ఆ పరమాత్మను తప్పక ధ్యానించాల్సిందేమరి. ఆ లయకారునికి కంఠమునకు క్రిందిభాగాన, నాభికి పనె్నండు అడుగులపై హృదయ కమలం వుంటుంది. ఆ హృదయ కమలం అనంతమయిన ప్రకాశంతో వుంటుంది. ఇదియే పరబ్రహ్మము. ఆ కమలములో తమ్మి మొగ్గవంటి హృదయం వుంటుంది. ఇది క్రిందికి వేలాడుతూ వుంటుంది. దీనిలోనే సర్వజగత్తు ప్రతిష్ఠించబడి ఉంటుంది. సుషుమ్ననాడికి మధ్యగా ఉన్నటువంటి దీని హృదయకాంతులు నలువైపులా ప్రసరిస్తూ ఉంటాయి. శరీరం చలించడానికి ఇదే మూలకారణం.

 దీనికి మధ్యలో ఉన్న హృదయకమలంలో జఠరం వద్ద ఈ ప్రకాశవంతమైన కాంతి ప్రభావం శరీరం మొత్తం వ్యాపించి దేహాన్ని ఎల్లప్పుడూ వేడిగా ఉంచుతుంది. ఈ వేడివల్లనే మనస్సు (బుద్ధి) పనిచేస్తుంది. మనిషి తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసి శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకు సరఫరా చేస్తుంది.

ఈ తమ్మిమొగ్గవంటి హృదయంలో వరిముల్లు అంతటి పరిమాణంలో గల మెరుపుతీగ వంటి పసుపుపచ్చని రంగుగల దివ్యమైన కాంతి, అణుసమానమై వర్ణించడానికి వీలులేనంతగా ప్రకాశిస్తూ ఉంటుంది. చూడలేనటువంటి ఈ దివ్యకాంతికి మధ్యన పరమాత్మ ఉంటాడు. దీనినే ‘‘పరంజ్యోతి’’ అంటారు. ఈ పరమాత్మయే బ్రహ్మ! శివుడు! విష్ణువు! ఇంద్రుడు! ఇలాంటి పరమాత్మ నాశనం లేనటువంటిది. చాలా ఉన్నతమయినది. స్వయం ప్రకాశం కలదని చెప్పవచ్చు. ప్రణవ స్వరూపమయిన పరబ్రహ్మ ఈ హృదయంలోనే ఉంటాడు. శక్తికిమూలం ఇదే.

అందుకే ఋగ్వేదం ప్రజ్ఞానమే బ్రహ్మ అని చెబుతుంది. యజుర్వేదం చెప్పే అహం బ్రహ్మస్మికి కూడా అర్థం ఇదే. తత్త్వమసి (తత్+త్వం+అసి) నీవే ఆ పరబ్రహ్మవంటున్నది సామవేదం.

 ఆయామాత్మా బ్రహ్మ అంటున్న అధర్వణార్థం కూడా ఇదేనని చెప్పవచ్చు.

 ఈ ఆత్మయే బ్రహ్మ. మనిషి దేహంలోనే దేవుడు ఉన్నాడు. 

మంచి మనస్సుతో ఆలోచించే ప్రతివారిలో దేవుడు కొలువై ఉన్నాడని చెప్పవచ్చు.

💐💐💐💐💐💐💐💐

No comments:

Post a Comment