Thursday, October 27, 2022

జ్ఞానం ధ్యానంగా మారితే మోక్షం

 జ్ఞానం ధ్యానంగా మారితే మోక్షం

🔹🔸🔹🔸🔹🔸🔹


యతః ప్రవృత్తిర్భూతానాం యేవ సర్వమిదం తతమ్‌
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః


సమస్తమైన సృష్టి ఎవని నుండి జరిగిందో, ఈ చరాచర ప్రపంచంలో ఎవరు వ్యాపించి ఉన్నారో, ఆ పరమాత్మను సాధకుడు స్వకీయ కర్మచే ఆరాధించి, మోక్ష యోగ్యతాభరితమైన జ్ఞాన సిద్ధిని పొందాలంటుంది భగవద్గీత. 

అంటే మన స్వభావానికి (ఏ ప్రలోభాలకు, ఆకర్షణలకు లోనుగాకుండా) లేదా ప్రవృత్తికి తగిన కర్మలను ఆచరిస్తూ, భక్తి భావనతో భగవంతుడిని స్మరిస్తూ, ఆరాధిస్తే, అర్చిస్తే మోక్ష సిద్ధి కలుగుతుందని భావం.

 అర్చించడం అంటే అనుసరించడం లేదా అనుకరించడం. అయితే కర్మలు బంధన కారణాలు. కాబట్టి కర్మాచరణ మోక్షానికి ఎలా మార్గం చూపుతుందనేది అనుమానం. చేయవలసిన కర్మలను చేయవలసిన పద్ధతిలో ఈశ్వరార్పణగా, ఫలితం కోరకుండా, చేసినప్పుడు ముక్తి లభిస్తుందనేది ఆ అనుమానానికి జవాబు. ఫలితంపై ఆశ లేకుండా భగవదర్పితంగా కర్మలను ఆచరించడం వల్ల కర్మాచరణలోని దోషాలు తొలగిపోయి చిత్తశుద్ధి కలుగుతుందనేది కృష్ణపరమాత్మ ఉపదేశం.

సాధకునికి సాధనలో జాత్యంతర వికాసం కలగాలంటే.. సాధకుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలి. కర్మఫలితాన్ని ఈశ్వరార్పితం చేయకుంటే ఆ ఫలితం తన మనసుపై ముద్రగా ఏర్పడి మన ప్రయాణంలో భారంగా మారుతుంది. ఆ ఫలితాన్ని అనుభవించేందుకు మరొక జన్మ అవసరమవుతుంది. ఆ జన్మలో చేసే కర్మల వల్ల ఇంకొక జన్మ.. ఇలా నిరంతరంగా జననమరణ చక్రబంధనంలో ఇరుక్కుపోతాం. 

అయితే కర్మ చేయకుండా మనిషి మనగలడా అంటే లేదనే చెప్పాలి. ఊపిరి తీసుకోవడమూ కర్మయే కాబట్టి ఏ కర్మా చేయకుండా క్షణం కూడా గడవదు. కర్మ ఇలా బంధనాలను ఏర్పరిస్తే.. ఆ బంధనాల నుండి ఎలా బయటపడడం? అంటే.. కర్మ ఫలితాన్ని తనదిగా స్వీకరిస్తే పడే ముద్రలవల్ల మనస్సు మలినమై పరమాత్మను స్ఫష్టంగా చూడలేం, ఆరాధించలేం. ఫలితాన్ని పరమాత్మకే త్యాగం చేయడంవల్ల స్వచ్ఛతను సాధించి ఆ భగవంతునిలో ఐక్యం కాగలుగుతాం.

కర్మ ఫలితాన్ని అనుభవించేందుకు మనకు స్వతంత్రం లేదు కదా మరి కర్మలను ఎంచుకునేందుకు స్వేచ్ఛ ఉన్నదా? .

అంటే ఉన్నదనేదే జవాబు.

 ఎంచుకోవడం రెండు విధాలు. ఇష్టమైన దానిని ఎంచుకోవడం లేదా బుద్ధితో విచారించి, వివేచనతో, విజ్ఞతతో సుగతి ప్రదాయినిని ఎన్నుకోవడం.

 వివేచనతో ఎంచుకొని చేసే కర్మ తపస్సుగా మారి మనసు ప్రకాశవంతమవుతుంది.

 అలాంటి మనసును సహస్రారం వరకూ చేర్చడం పరమాత్మలో లయం కావడంగా చెప్పబడుతుంది. దీనికి జ్ఞానం అవసరమవుతుంది. 

జ్ఞానం అంటే సంపూర్ణంగా, సమగ్రంగా అర్థం చేసుకోవడం. జ్ఞానం ధ్యానంగా మారితే ప్రయాణం సమగ్రమవుతుంది, సంపూర్ణం, సఫలం అవుతుంది. ఆ దిశలో మనందరి ప్రయాణం సఫలం కావాలి.

జై శ్రీమన్నారాయణ🙏🏻

🔹🔸🔹🔸🔹🔹K

No comments:

Post a Comment