Thursday, April 27, 2023

శ్రీ రమణీయం - 29🌹 👌ముక్తి, విచారణ కొత్తగా తెచ్చుకునేవి కావు👌

 [4/26, 10:06] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 29🌹
👌ముక్తి, విచారణ కొత్తగా తెచ్చుకునేవి కావు👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, 
అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️✳️🌻🌻🌻🌻✳️

🌈 29. ముక్తి,విచారణ కొత్తగా తెచ్చుకునేవి కావు 🌹

✳️ మనకి దైవికమైన జ్ఞానం కలిగేకొద్ది తృప్తి వస్తుంది. దైవం అంటే ఏమిటో అనుగ్రహానికి సదాపాత్రులమై ఉండాలంటే మాత్రం మన గుణాలను సంస్కరించుకోవాలి. గురువు యెడల వినయం కేవలం దేహపరమైనది కాదు. గురువు ఆశించినట్లుగా ఉండటమే నిజమైన వినయం. గురువైనా దైవమైనా మననుంచి నమస్కారాలు, పొగడ్తలు, కానుకలు కోరుకోరు. వారికి మన నుండి కావాల్సింది సత్ప్రవర్తన, సదాచారం, సచ్చీలం, సాధన. అవే మనని గురు అనుగ్రహ పాత్రులను చేసేవి. మనలో కోర్కెలు మాత్రమే ఉంటే దైవం కోసం మనం గుడికి వెళ్లాలి. అదే మనలో సద్గుణాలు కూడా ఉంటే దైవమే మనవెంట నడిచి వస్తుంది. గురువు గుణాలను స్వీకరించి అనుసరించడమే సాధకుడి ప్రథమ కర్తవ్యం.

✳️ మనం ముక్తిని కోరుకుంటున్నామంటేనే మనం అప్పటికే ఎందులోనో బందీలమై ఉన్నామని అర్థం. అసలు మనం దేనికి బందీలమో తెలిస్తేకదా విమోచన గురించి తెలిసేది. అది తెలుసుకోవడానికే భగవాన్ సులువైన విచారణ మార్గం చెప్పారు. మనం అన్ని లౌకిక విషయాల్లోనూ విశ్లేషించి మన విచారణను చాటుకుంటాం. కానీ అవసరమైన ఆధ్యాత్మిక సాధనలో మాత్రం దాన్ని విడనాడతాం. విచారణ ద్వారా మన మనసు స్వరూపం మనకి తెలుస్తుంది. అసలు ఉనికే లేని అహంభావన మనని బంధించి ఉంచిందని అప్పుడు అర్థం అవుతుంది. నేను ఆత్మను అన్న సత్యానికి బదులు దేహాన్ని అన్న అహంభావన చేరటమే మన బందీకి కారణం. ఆత్మభావనతో అనంతంగా ఉండాల్సిన అహం మన రూపభావన వల్ల పరిధి ఏర్పరుచుకుని అహంకారంగా మారుతుంది. అదే మన ఆత్మ జ్ఞానానికి అడ్డుగా ఉంది. ఇప్పుడు మనకున్న అహంభావన ఆత్మ భావనగా మారటమే ముక్తి. అందుకు అహంభావనను పెంచే లౌకిక విషయాలపై వైరాగ్యం, ఆత్మభావన పెంచే సాధనపై ఆసక్తి పెరగాలి. ముక్తి స్థితి నిరంతరం మనలో ఉన్నదేనని, కొత్తగా వచ్చేది కాదని భగవాన్ చెప్తున్నారు. అది అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలన్నదే మన సాధన. 

✳️ ముక్తి కొత్తగా వచ్చి చేరేది కాదు. భగవాన్ చూపిన విచారణ మార్గం కూడా మనం కొత్తగా నేర్చుకోవాల్సింది కాదు. అది మనసుకు ఉన్న గుణమే. మనలో గమనింపు అనే లక్షణంగా విచారణ నిరంతరం సాగుతూనే ఉంది. సావధానతతో దాన్నిగుర్తిస్తే చాలు. మనలో ఉనికే ఆత్మగానూ, దాని గమనింపు గుణమే విచారణగానూ ఉంది. ఈరెండింటినీ మనం కొత్తగా సాధించనక్కర్లేదు. తెలుసుకుంటే చాలు.

✳️ మనం నిత్యం ఆనంద స్వరూపులుగా ఉండాలి. బాహ్య వస్తువుల నుండి సంతోషం లభిస్తుందన్న భ్రమలో మన ఆనందాన్ని దూరంచేసుకుంటున్నాం. మనం సంతోషాన్ని, బాధను పట్టించుకుంటున్నాం గానీ వాటిని అనుభవించేది ఎవరని గమనించడం లేదు. భవంతిలో ఉన్నానని చెప్పినా, గుడిసెలో ఉన్నానని చెప్పినా వాటితో నిమిత్తం లేని నువ్వు ఒకడివి ఉన్నావనే కదా అర్థం. అలానే... సంతోషంగా ఉన్నా, దుఃఖంలో ఉన్నా వాటితో నిమిత్తం లేని నీ స్వరూపం ఒకటి ఉండి ఉంటుంది కదా! మనం ఉంటున్నట్లు మనకి తెలుస్తుంది. ఆ తెలిసేది ఏమిటో, ఎక్కడుందో, ఎలా ఉందో మనకి తెలియడం లేదు. మనకి మనం దేహంగానే తెలుస్తున్నాం. ఈ దేహంతో సంబంధం లేకుండా కూడా తెలిసే ఉనికి ఒకటి మనలో ఉంది. దాన్ని తెలుసుకోవడం మన ముందున్న గమ్యం. ఆ తెలిసేదాన్నే మనం నేను, నేను అంటున్నది. 

✳️ ఎకరం నేలలో ఇల్లు కట్టుకున్నా ఎప్పటికప్పుడు మనం నిల్చున్న నేలను మాత్రమే మనం ఉపయోగించుకుంటున్నాం. మిగిలినదంతా ఉన్నదన్న భావనగా ఉందే తప్ప, అప్పటికి ఉపయోగంలో అయితే లేదు కదా!. పెట్టెనిండా బట్టలు ఉన్నా ఒంటి పై ఉన్నవాటిని మాత్రమే మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నాం. ఏడువారాల నగలైనా భావసంతోషాన్ని తప్ప ఒకేసారి అనుభవ సంతోషాన్ని మాత్రం ఇవ్వలేవు. నిన్ను వదలకుండా ఉండేది ఏదీ లేదు. నిన్ను నువ్వు మాత్రమే నిరంతరం అంటిపెట్టుకుని ఉంటావు. అంతకుమించి నీ శరీరంతో సహా ఏదీ నిరంతరం నిన్ను అంటిపెట్టుకుని ఉండటంలేదు. 

✳️ శిశువుగా ఉన్న దేహం, బాల్యంలో ఉన్న దేహం, వృద్ధాప్యంలో ఉన్నదేహం వేరువేరు. ఈ దశలన్నింటిలోనూ నీరూపం మారుతున్నా మారని నువ్వు ఒక్కడివి అలానే ఉన్నావు. ఆ మారని నువ్వే అసలు నీవు. ఆ స్వ స్వరూపం మనకి తెలియాలంటే బాహ్య దృష్టి తగ్గాలి. జీవన అవసరాలేమిటో, అనవసరాలేమిటో గుర్తించి వెంపర్లాట తగ్గించుకోవాలి. ప్రపంచానికి తగిన ప్రాధాన్యత మాత్రమే ఇస్తూ దానితో తదాత్మ్యత తగ్గించుకుంటే బాహ్యస్మృతి తగ్గి మన నిజమైన ఉనికి ఏమిటో మనకి తెలుస్తుంది.

✳️ మన మనసు పరిణామాలను శ్రద్ధగా పరికించడమే విచారణ. అది అప్రయత్నంగా సాగాలి. ప్రయత్న పూర్వకంగా చేసే పనిలో ఫలితంపై ఆసక్తి, తద్వారా మనసుపై ఒత్తిడి ఉంటాయి. మనసు కదలికలను మొండిగా పట్టుబట్టి ఉంచడం విచారణ కాదు. చదరంగం ఆటను బయటి నుండి గమనించే వ్యక్తిలా స్వేచ్ఛగా ఏ కొర్కెలేని గమనింపు కావాలి. మన మనసుపై మనం విశ్లేషణ చేసుకోవాలి. మనసు ఆడే ఆటను గమనించడమే విచారణ. అతి నిర్లిప్తతగానీ, అతి గంభీరతకానీ లేని సమస్థితిలో కొనసాగించే సావధానత వల్ల మనకి విచారణ మార్గం సిద్ధిస్తుంది.
[4/26, 10:06] +91 73963 92086: అది ఆత్మజ్ఞానానికి మార్గం సుగమం చేస్తుంది. ఆత్మజ్ఞానం అనుభవానికి, అవగాహనకు కూడా అతీతమైనది. చంటిపిల్లాడు పెరిగేకొద్ది తన అవయవాల గురించి ప్రత్యేకంగా నేర్చుకోడు. అవే తెలియబడతాయి. ఆత్మజ్ఞానం కూడా అంచెలంచెలుగా అంతే తెలియబడుతుంది. అది కేవలం మన ప్రయత్నంతో మాత్రమే తెలుసుకునేదికాదు. సాధన, ప్రయత్నం మాత్రమే మన వంతు. బావికోసం గుంట తవ్వడం మన పని. భూమిలో ఉన్న నీళ్లు వాటంతట అవే బయటకు పెల్లుబికి వస్తాయి. కిటికి తెరిచి ఉంచితే బయటవీచే గాలి మన ఇంటిలోకి కూడా వస్తుంది. మనం గాలిని ఆహ్వానించలేం కదా! అలానే, ఆపేక్ష లేని సాధన మనకి ఫలాన్నిస్తుంది. నిరంతర విచారణతో సాగే నిత్యసాధనలో నేను దేహంకాదన్న సత్యం అర్థం కావడం పేరు ముక్తి. 

✅ ఆధ్యాత్మిక ప్రయాణంలో సంకల్పం గట్టిగా ఉండాలి గానీ సాధన కఠినంగా ఉండకూడదు.

🙏 సర్వే జనాః సుఖినోభవంతు 🙏

🚩 హిందువునని గర్వించు
🚩 హిందువుగా జీవించు

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️✳️🌻🌻🌻🌻✳️

No comments:

Post a Comment