Thursday, April 27, 2023

సత్కర్మ నీతిసూత్రం

 *సత్కర్మ నీతిసూత్రం*

మనసు చిత్రమైంది. అప్రమత్తంగా లేనప్పుడు ఆలోచనలను వక్రమార్గం పట్టిస్తుంది. దృఢ సంకల్పంతో కఠోర తపస్సులో నిమగ్నమైన విశ్వామిత్రుడిని సైతం చలింపజేసి పక్కదారి పట్టించింది.

ఈ సృష్టిలో ఎలా జన్మించాం. ప్రాణమంటే ఏమిటి, ఎలా శరీరంగా రూపొందుతుంది? ఏ విధంగా మాయమై దేహాన్ని కట్టెగా మారుస్తుంది? ఇవన్నీ మానవజాతికి అంతుపట్టని ప్రశ్నలు. వీటికి సమాధానాలు పొందాలని యోగులు, మేధావులు, సాధకులు యుగయుగాల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మనకు తెలియని, అనుభవంలోకి రాని జనన మరణాలకన్నా ముఖ్యమైంది. తెలుసుకోవలసింది. మనసును గురించి జీవించినంత కాలం ఇది మనతోటే, మనలోనే ఉన్నట్టు ఉంటుంది. కాని, గాలిలాగా అదృశ్య సర్వవ్యాపి. ఉనికి లేని మనసును, దాని ఆగమ్య ప్రవాహాన్ని కని పెట్టే సాధనం లేదు. నడిపే ఇంధనం ఏమిటో తెలియదు.. తనను మించినవాడు లేడని తొడలు కొట్టి, బిరుదులు తగిలించుకుని, సవాలు
చేసే వాళ్లను క్షణంలో పిపీలికాలను చేస్తుంది. తాడిదన్నే వాడుంటే, తలదన్నే
వాడుంటాడన్న సామెత
అలాపుట్టిందే

మేధకు పదును పెట్టి ఎంత సాధించినా, ఎన్ని పరికరాలు కనిపెట్టినా ప్రకృతి వైపరీత్యాలను అరికట్టలేం. మరణానికి కారణాన్ని తెలుసుకోగలమే తప్ప, మరణాన్ని జయించలేం

రావణాసురుడు పాలించడానికి సుందర స్వర్ణమయ లంక ఉంది. తోడబుట్టినవారు పాలనలో తోడుగా ఉన్నారు. కోరుకొన్నది క్షణంలో అమర్చే సేవాగణం ఉంది. ఒకానొక క్షణంలో రావణుడి మనసు తక్కెడ ధర్మం తప్పింది. అరాచకాన్ని అడ్డుకోలేని నిష్కల్మషమైన మనసు విభీషణుడి రూపంలో లంకను చాటింది. ఒకే ఒక తప్పు

లంకేశుణ్ణ్ని, పరివారాన్ని, లంకను నామరూపాలు లేకుండా చేసింది. సోదరికి పుట్టే బుడతడు తన మరణానికి కారకుడన్న మాయకు గురై కంసుడు శిశువులందర్నీ మట్టు పెట్టి చివరికి ఏమి సాధించాడు. అష్టమగర్భ సంతు శ్రీకృష్ణుడు రానే వచ్చాడు. పిడిగుద్దులతో, ముష్టిపూతాలతో కంసుణ్ని మట్టి కరిపించాడు.

మనిషి ధర్మబద్ధంగా జీవించాలని, నీతిని అంటిపెట్టుకుని ఉండాలని శాస్త్రాల్లో చెప్పేది మనసును కోతి కాకుండా నియంత్రించడానికి. మానవజన్మకు మహోపకారంలా పూర్వులు వేదాలను వాటి అనుబంధ ఉపనిషత్తులను గురుపరంపరగా అందించారు. సనాతన సంస్కృతిని, సంప్రదాయబద్ధ జీవిత విధానాలను రూపొందించారు. ధనానికి, అధికారానికి బానిస కాకుండా, పంకంలోని తామరలా, తామరాకు మీద నీటి బొట్టులా ఉంటూ మానవజ్యోతిగా వెలుగొందాలన్నది సత్కర్మ్య నీతిసూత్రం.

పూవు ముళ్లు తేడాను మంచి చెడు భేదాన్ని మనసు గ్రహించగలదు. అయినా ఏమీ తెలియనట్టే మనిషిని మాయాగాలానికి చిక్కుకునే చేపలా చేస్తుంది. ఊపిరి సంపక గిలగిల్లాడుతుంటే పశ్చాత్తాప పడేలా సముదాయిస్తుంది..

ఏ దేశమేగినా ఎందుకాలిడినా మనసులు వాటి మాయలు మామూలే.. మనిషి జనన మరణాల మధ్య జీవితమనే వారధి ఉంటుంది. దాని పొడవు ఎంతనేది తెలియదు. అలాంటప్పుడు మనసు పరిధిని తగ్గించుకుంటూ, బుద్ధి వైశాల్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగిపోవడమే మానవజన్మ ఉత్తమత్వం.

వంతెన చిట్టచివరన ఉన్న దేవుడు ఎదురుచూసేది, చెయ్యందించేది అలాంటి జీవాత్మలకే అన్నది మోక్ష సిద్దాంతం
- ప్రతాప వెంకట సుబ్బారాయుడు…..

No comments:

Post a Comment