Tuesday, October 27, 2020

సుఖ దుఃఖములు

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 57 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సుఖ దుఃఖములు 🌻

మానవులు సామాన్యముగా తనకు దుఃఖము‌ కలుగకుండవలెననియు, సుఖము‌ కలుగవలెననియు అభిప్రాయపడుదురు. దానిని అనుసరించి‌ ప్రయత్నములు, పనులు చేయుచుందురు.

ప్రణాళికలు, పన్నుగడలు, తీర్పులు దానిని అనుసరించియే చేయుదురు. అన్ని పనులకును, అన్ని ప్రయత్నములకును, ఆదర్శములకును, ఆశయములకును పునాదిలో ఉండు అభిప్రాయము ఒక్కటే. దుఃఖములు, బాధలు తమకు‌ కలుగకూడదనియు, సుఖము కలుగవలెననియు.

ఈ అభిప్రాయమే విషకీటకము‌ వలె‌ పనిచేసి దుఃఖములలో పడద్రోయుచుండును.

ఈ అభిప్రాయము నందు లోభము, స్వార్థము, ఇమిడి ఉండుటయే దీనికి కారణము. తుదకు పాపకార్యములు మాని పుణ్యకార్యములు చేయువారిలో కూడా చాలమందికి ఇదియే అభిప్రాయముండును.

పాపకార్యములు మానుట వలన దుష్కర్మ నశించుననియు, పుణ్యకార్యములు చేయుట వలన పుణ్యఫలము పెరుగుననియు పేరాశ వేదించుచుండును. వీరిని కూడా తమ కర్మఫలములు బంధించును. శుభాశుభఫల సమ్మిశ్రమముగా జీవితము జరుగుచుండును.

ఒకనాడు ఏడ్చుట, ఒకనాడు నవ్వుటగా సంసార సాగరపు తరంగ డోలికలపై జీవితము మునిగి తేలుచుండును. మోక్షమును‌ కోరిన‌ వారిలో కూడా చాలా మంది ఈ పేరాశతోనే ప్రవర్తింతురు.

మిగిలిన అజ్ఞాన జీవులకు కలుగుచున్న దుఃఖములు తమకు కలుగరాదనియు, ప్రపంచము నందలి కర్మ ఫలము తమకు అంటకుండ అతీతులై ఈ దుఃఖమయ ప్రపంచమును‌ చూచుచుండవలెననియు వారు భావింతురు.

జనన మరణములకు అతీతులై శాశ్వత లోకమున‌ ఉండి సుఖించుచుండవలెనని పేరాశతో మోక్ష ధర్మమును అవలంబించువారు కలరు. ఇది అన్నిటిని మించిన‌ స్వార్థము కనుక వారు నిత్య‌నరకమున పడుచుందురు.

ఇంతకాలము నిస్వార్థముగా జీవించుట‌ వలన లోకము మనలను ఏమి గుర్తించినది? అని దుర్భుద్ధి‌ పుట్టును. దానితో మరల అసుర ప్రవృత్తి ప్రారంభమగును. వీరెవ్వరును మోక్షస్థితిని పొందలేరు.

తమ కర్తవ్యము‌ను గుర్తించి, తమ ఆశ్రితులపై తమకు గల బాధ్యతను భగవంతుని కార్యముగా సమర్పణ బుద్ధితో సంతోషముగా ఆదరించు వారొక్కరే మోక్షమునకు అర్హులు. వారిదే భగవంతుని సామ్రాజ్యము!...

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

Source - Whatsapp Message

No comments:

Post a Comment