Wednesday, October 28, 2020

ధ్యానం ద్వారా మనసును పవిత్రంగా మార్చుకోవచ్చునా !?

ధ్యానం ద్వారా మనసును పవిత్రంగా మార్చుకోవచ్చునా !?

"ధ్యానం అంటే మిగిలిన విషయాలను ఆలోచనలో నుండి తీసేయ్యడం. ఏకాగ్రత అంటే ఒక విషయంపై మనసు నిలపటం. ధ్యానం పేరుతో ఒక విషయంపై మనం మనసు నిలిపే ప్రయత్నం చేస్తున్నాం. అంటే మిగిలిన ఆలోచనలన్నింటినీ రాకుండా చేయడం. అయితే ఇష్టమైన విషయాల్లో మనసు ఇప్పటికే దీన్ని సహజంగా చేస్తూనే ఉంది. కాకపోతే ఇప్పుడు ఇష్టపడే విషయాలకన్నా ఉన్నతమైన, పవిత్రమైన వాటిమీద మనసు లగ్నం చేయాలనేది మన ప్రయత్నం. దాని ద్వారా మనసును ఉన్నతంగా, పవిత్రంగా చేయాలన్నది మన ఆలోచన. కానీ మన మనసు ఇప్పటికే ఎంతో పవిత్రంగా ఉంది. అది ఆత్మయొక్క కిరణం. దానికి ఏ అపవిత్రత లేదు. పవిత్ర, అపవిత్ర జీవనంలోనే ఉన్నాయి. కాబట్టి మనం కోరుకున్న పవిత్రమైన మనసు కావాలంటే, మన జీవనాన్ని పవిత్రంగా మార్చుకోవాలి. అలాగే అనేక పనులు, ఆలోచనలతో మనసుగా మారిన ఆత్మ అప్పటికే సిద్ధంగా ఉంది. "ఆలోచనలు, పనులను సంస్కరించుకోవటమే" మనం చేయాల్సింది. ఆత్మకిరణమైన మనసును మనం మంచిగా మార్చేదేమీ ఉండదు

"నేను, నా మనసు ఒకటేనా వేర్వేరా ? ఆధ్యాత్మిక సాధన ఎందుకు అంత కఠినతరంగా ఉంటోంది !?"

మనం 'నేను' అని చెప్తున్నదే మనసు. మనలోని ద్వంద్వ ప్రవృత్తివల్లనే ఆధ్యాత్మిక సాధన గంభీరమైన విషయంగా కనిపిస్తుంది. ఆత్మ లేదా దైవం అనేది మనకు దూరంగా ఉన్న వస్తువుగా భావించి, దాన్ని తెలుసుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. మనకు తెలియని ఆత్మ, దైవం విషయంలోనే కాదు, మనకు నిత్యం అనుభవంలోనే ఉన్న మనసు విషయంలో కూడా మనం అలాగే ఆలోచిస్తాము. ఏదైనా ఒక పని చేయాలనిపించగానే చేసేస్తాం. అక్కడ నా మనసు చెప్తుంది కాబట్టి నేను చేస్తున్నాను అని అనుకోము. చేసిన పనిని ఎవరైనా తప్పు పడితే అప్పుడు మాత్రం 'ఎందుకో నా మనసు నన్ను అలా ప్రేరేపించిందని' చెప్తాం. అనుభవించేటప్పుడు మనమే మనసుగా ఉంటూ, విశ్లేషించేటప్పుడు మాత్రం మనసును మన నుండి వేరుచేసి ఆలోచిస్తాం. మనం 'నేను' అని చెప్తున్నదే మనసు. మనసులేని వ్యక్తికి మాటలు, క్రియలు ఉండవు. మనసంటూ ఒకటి లేకుండా తాను ఉండటం కుదరదు. కానీ ఆలోచనల్లో కూడా అదే జరుగుతుంది. ఆధ్యాత్మిక సాధన సాగాలంటే మనకున్న ఈ ద్వంద్వ వైఖరిని విడనాడాలి !


"మనసును చేజిక్కించు కోవాలి అంటారు, చేజిక్కించు కునేది కూడా మనసే కాదా !?"

ఆలోచనలో ఉంటే దాన్ని మనసని, ఆలోచన లైనప్పుడు ఆత్మ అని అంటున్నాం. రూపంలేని ఆత్మను ధ్యానించలేం కనుక అనుభవంలో ఉన్న మనసును చేజిక్కించుకోమని భగవాన్ శ్రీరమణమహర్షి చెప్పారు. మనసును చేజిక్కించు కోవటమంటే దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవటం. ఆలోచనలతో ఉన్నప్పుడు, లేనప్పుడు ఉన్నది ఒక్కటే మనసు. ఆత్మ, మనసు దాని పేరు మారింది గానీ స్వరూపం మారలేదు. ఇది తెలుసుకునేందుకే ధ్యానం అవసరం. అయితే ధ్యానంతో మనసును బాగు చేసేది ఏమీ ఉండదు. మనసే ఆలోచన, మాటలు, చేతల రూపంలో వ్యక్తమవుతుంది. అంతకుమించి మనసుకు మరొక ఉనికి లేదు. మనసును సంస్కరించడం అంటే ఆలోచన, మాటలు, చేతలను సంస్కరించడమే ! అది జీవనంలోనే చేసుకోవాలి గాని ధ్యాన ప్రక్రియతో చేసుకునేది కాదు. మనసుకు ఉన్న పవిత్రత, శాంతిని ధ్యానం తెలియజేస్తుందే గాని ఆయా ప్రక్రియల వల్ల 'పవిత్రత-శాంతి' సమకూరడం లేదని తెలుసుకోవాలి !*_

Source - Whatsapp Message

No comments:

Post a Comment