Monday, November 16, 2020

ఆధ్యాత్మిక సుఖం!

🌸ఆధ్యాత్మిక సుఖం!🌸

రామనాథపురం రాజావారు ఒకసారి రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. ఆ సమయంలో భగవాన్‌ వంట గదిలో ఏదో పనిచేస్తూ ఉన్నారు. రాజావారు వచ్చిన విషయం మహర్షికి చెప్పినా, పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత హాల్లోకి వచ్చిన భగవాన్‌కు రాజావారు దణ్నం పెట్టి.. తిరుగుప్రయాణమయ్యారు. ఆయనతో పాటు బయటకు వెళ్లిన ఆశ్రమ పెద్ద దండపాణిస్వామి.. ఆశ్రమంలోని వసతులలేమి, ఆశ్రమ నిర్వహణకు కావాల్సిన ధనం లేకపోవడం గురించి రాజావారికి వివరించారు. ఈ విషయం తెలిసిన మహర్షి దండపాణిస్వామితో ఇలా అన్నారు.. ‘‘నువ్వు రాజావారిని చెడగొట్టావు. ఆయనకు పెద్దరాజ భవనం, బోలెడు ధనం, వాటి వల్ల లభించే సుఖాలు ఉన్నాయి. అయినా ఇంకేదో అసంతృప్తితో ఆనందం కోసం ఆశ్రమానికి వచ్చాడు. నీ సమస్యలు చెప్పి ఆయనను బిచ్చం అడిగావు’’ అన్నారు.
సుఖం అనేది డబ్బులో, వసతుల్లో మాత్రమే ఉందనుకొనేవాళ్లే సమాజంలో ఎక్కువ. ఏసీ గదుల్లో కూర్చోబెట్టి ధ్యానం చేయించే బాపతు ఆధ్యాత్మిక లోకానికి ఇది అర్థం కాదు. దండ, కమండలాలు మాత్రమే ధరించి కాలినడకన ఆసేతుహిమాచలం పర్యటించిన ఆదిశంకరుల అద్వైత జ్ఞానం ఎంతమందికిఅర్థం అవుతుంది? గోచిపాత ధరించి.. మహా సామ్రాజ్యాధినేతకు దిశా నిర్దేశం చేసిన సమర్థ రామదాసు ఆధ్యాత్మిక శక్తి విలువను గ్రహించే వారు ఎందరు? డబ్బులను మట్టి పెళ్లల్ని ఒకేసారి నీళ్లల్లో విసిరేసి వస్తుసమత్వం సాధించిన శ్రీరామకృష్ణుల సాధన ఎందరిని కదిలిస్తుంది?

🌹యథావ్యాళ గళస్థో పి భేకో దంశానపేక్షతే

తథా కాలాహినా గ్రస్తో జీవో భోగా నశాశ్వతాన్‌

పాము నోటిలో ఉన్నా కూడా.. కప్ప ఈగల్ని తినేందుకు వెతుకుతూనే ఉంటుంది. అలాగే కాలం అనే పెద్ద పాము నోట్లో కరచుకొని ఉన్నా జీవులు క్షణిక భోగాలకు అర్రులు చాస్తూనే ఉంటారు అని చెప్పింది శాస్త్రం. జీవుల వెతుకులాట ఎన్నో బంధాలకు, బాధలకు కారణం అవుతున్నది. వయసు మళ్లి, ఎముకలు కుళ్లే దశలోనూ.. ఈ వ్యామోహం నశించక అధికారం, డబ్బు, పెత్తనం కోసం అర్రులు చాచేవారి సంఖ్యే ఎక్కువ. దైవధ్యానం, ఆత్మవిచారణ వల్ల మాత్రమే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలా కాకుండా మొండిగా ఆ బాటలోనే నడిచేవారిని రోగాలు  చుట్టుముడుతున్నాయి. ‘‘బాగా చదువు. లేకపోతే డబ్బు సంపాదించలేవు’’ అని మన బిడ్డల్ని అందరం ప్రోత్సహిస్తున్నాం. కానీ.. నిజమైన సంతోషం డబ్బులో ఉందా? లేదు. గాఢమైన కోరికలు ఉన్న ప్రతివారూ దుఃఖంలో ఉన్నట్లే. కోరికలు దుఃఖానికి మూలకారణాలు. తీరితే సంతోషం. తీరకపోతే దుఃఖం. ధనం, అధికారం మాత్రమే మనల్ని సుఖంగా ఉంచగలవనుకుంటే.. ప్రపంచ ధనవంతులు, ప్రపంచ విజేతలు తప్ప ఈ లోకంలో ఎవరూ సుఖంగా ఉండలేరు. అలాంటి సంతోషాల వెంబడే దుఃఖం కూడా ఉంటుంది. ఇది తెలుసుకొని అవసరం లేనివాటిని వదలిపెట్టడమే పారమార్థికత. ఏనాడైతే అహంకారం, ఈర్ష్య, పనికిరాని కోరికలు, మమకారం, కోపం, పగ మన నుండి మాయం అవుతాయో అప్పుడు వాటి భస్మం నుండి పుట్టే అగ్నిజ్వాలల వెలుగే మనకు సుఖాన్ని ఇస్తుంది. అదే ఆధ్యాత్మిక సుఖం.

Source - Whatsapp Message

No comments:

Post a Comment