Monday, November 16, 2020

సచ్చిదానందం

తినడం, పనిచేయడం, నిద్రపోవడం... మనిషే కాదు- జంతువులూ చేస్తాయి. ఆహారం కోసం తిమింగిలం లాంటి సముద్ర జీవులు వందలు, వేల మైళ్ల దూరం ప్రయాణం చేస్తాయి. అడవి జంతువులు ఆహారం కోసం వేటలో ఒక్కోసారి ప్రాణాలే కోల్పోతాయి. జీవులు బతకడం, బతికి ఉండటం కోసం ఒక యుద్ధమే చేస్తాయి.
మనిషి అందరికీ భిన్నమైనవాడు. మనిషిలో దివ్యత్వం ఉంది. అది కంటికి కనబడకుండా ఉంది. నిక్కచ్చిగా చెప్పాలంటే- అనుభవానికి మాత్రమే తెలుస్తుంది.
మొదటిది, మనిషిని కదిలించే చైతన్యం. మనిషిని సుఖస్థితిలో ఉంచే ఆనందం. ఇవే పరమావధిగా నిలిచే జీవనసత్యం. వీటిని కలిపి వేదాంత పరిభాషలో సత్తు, చిత్తు, ఆనందం అంటారు. వెరసి సచ్చిదానందం అని పేరు.
ఈ సచ్చిదానందం గొడుగు కిందకు సర్వజీవులూ వస్తాయి. ఇవి మనిషికి తప్ప ఏ ఇతర జీవికైనా అనుభవంలో ఉన్నా- జ్ఞానంలోకి రావు.
సచ్చిదానందంలో మునిగి తేలుతున్నాడు ఆ మహానుభావుడు అంటారు. సచ్చిదానందం ఉంటే ఆహారం అక్కరలేదా? సచ్చిదానందం మనసుకు ఆహారం. శరీరానికి ఆకలి తీర్చేది సాధారణ భోజనం. మనసు ఆకలిని తీర్చగలిగేది సచ్చిదా నందమే!
మనిషి తన తల్లిదండ్రులు పెట్టిన పేరు మరిచిపోయినా, దైవం తనకు ప్రసాదించిన సహజదశ అయిన సచ్చిదానంద స్థితిని మరిచి పోకూడదు.
చైతన్యం లేకపోతే మనిషి చనిపోయాడంటారు. ఆనందం లేకపోతే మనసు చనిపోయిం దంటారు. సత్యమే లేకపోతే శూన్యంలో పడి కొట్టుకుంటున్నాడంటారు.
తాను ఎప్పుడూ సచ్చిదానంద స్వరూపమేనని తెలుసుకున్న తరవాత అతడిలోని దివ్యత్వం బయటకు వస్తుంది. లోకానికి అతడు పూజ్యనీయుడు అవుతాడు అంటారు స్వామి వివేకానంద.
పక్షికి, పాముకు, గొర్రెకు సత్యం గురించి తెలియదు. చైతన్య ఆనందాల గురించి అనుభవంలో ఉండవచ్చు. కాని వాటికి ఆ జ్ఞానం ఉండదు. అయినా అవి సచ్చిదానందం కారణంగానే బతుకుతున్నాయి. సచ్చిదానందం లేకుండా ప్రకృతి లేదు. ప్రపంచం లేదు. సచ్చిదానందమే విశ్వ సహజరూపం.
మనిషిలో సత్యం ఉంది. మనిషి సత్యం కాడు. మనిషిలో చైతన్యం ఉంది. మనిషి చైతన్యం కాడు. మనిషిలో ఆనందం ఉంది. మనిషి ఆనందం కాడు.
ఆధ్యాత్మిక ప్రయాణం మొత్తం పూర్తి చేసిన తరవాత మనిషి తాను తెలుసుకున్నది ఈ సత్య, చైతన్య, ఆనందం అనే మూడు విషయాలే. సచ్చిదానంద స్వరూపుడైన దైవాన్ని కొలుస్తూ, తానుకూడా సచ్చిదానందంలో ఒక భాగమని మనిషి గ్రహిస్తాడు. గ్రహించాలి.
నిజానికి సచ్చిదానందం పేరుతో ఉన్న మూడూ ఒకటే. వాటిని కలిపి ఉపనిషత్తులు ‘సత్యం’ అని చెబుతున్నాయి. ఆ సత్యాన్ని మనిషి గ్రహించాలి. సత్యం అనే చెట్టుకు మొలిచిన రెండు కొమ్మల్లాంటివి చైతన్య ఆనందాలు.
వీటి గురించి తెలుసుకోకపోతే మనిషి జీవించలేడా, తెలుసుకునే తీరాలా అంటే- తెలుసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అజ్ఞానమయమైన జీవితాలు వెయ్యింటిని గడపవచ్చు. వాటిని అంతం చేసే జ్ఞాన జీవితం కావాలంటే సచ్చిదానందం గురించి తెలుసుకుని, అనుభూతి చెంది దివ్యమైన మానవుడనిపించుకోవాలి. ఆ లక్ష్యం సాధించడానికే మనం ఈ భూమ్మీద ఉన్నాం!(ఈనాడు అంతర్యామి)
✍🏻ఆనందసాయి స్వామి

Source - Whatsapp Message

No comments:

Post a Comment