Sunday, December 6, 2020

ఒకరి కష్టాలు తక్కువ ఒకరి కష్టాలు ఎక్కువ అని అనుకోవటం మూర్ఖత్వం.

7-11-20

నేటి కథ

ఎవరి కష్టాలు వారివి
( ఎవడి గోల వాడిది)

సాధారణంగా మనలో ప్రతి ఒక్కరికీ ఒక అభిప్రాయం ఉంటుంది-తమకు ఉన్న కష్టాలే ఎక్కువ బాధాకరమని తక్కిన వారి కష్టాలు ఇంతగా బాధించేవి కావని . ఈ అంశంపై ఒక మంచి కథ సమర్పిస్తున్నాను.

పూర్వము ఒకానొక ఊరిలో ఒక పెద్ద దనికుడు ఉండేవాడు. ఇంద్ర భవంతి లాంటి ఇంట్లో ఎందరో నౌకర్ల సేవలతో దర్జాగా నివసిస్తున్నాడు... ఆ ఇంటి పక్కనే ఒక పూరి గుడిసె లో ఒక పేదవాడు నివసిస్తున్నాడు. అతను కాయకష్టం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

దనికుడికి ఒక అలవాటు ఉంది . తన భవంతి బాల్కనీలో కూర్చుని , పక్కన ఉన్న
గుడిసె లో పేద వాడు ఏం చేస్తున్నాడు అని గమనిస్తూ ఉండేవాడు. అదే రీతిగా ఆ పేదవాడు కూడా తన గుడిసె కప్పు చిల్లుల్లో నుండి చూస్తూ ధనికుడు ఏం చేస్తున్నాడు అని గమనిస్తూ ఉండేవాడు . ఇరువురికీ వారి వారి వారి సమస్యలు ఉన్నాయి, వాళ్ల వాళ్ల సౌకర్యాలూ ఉన్నాయి.

ఇలా ఉండగా ఒక సాధువు ఆ వూరికి వచ్చాడు, మొట్టమొదట ధనికుడి ఇంటికి వెళ్ళాడు. ధనికుడు ఆ సాధువుకు అతిధి సత్కారాలు చేసి -"స్వామి నాదొక కోరిక తీర్చాలి" అని ప్రార్థించాడు ..
సాధువు : ఏమి నాయనా నీ కోరిక ?
ధనికుడు: స్వామీ, నాకు బాగా తినాలి అన్న తపన ఉంది . కానీ ఏమీ తిన లేని పరిస్థితిలో ఉన్నాను . ఆ కోరిక తీర్చాలి తమరు.
సా: ఎలా తీర్చాలి?
ధ: స్వామీ, నా శరీరంలో సర్వ రోగాలు ఉన్నాయి . ఏమి తిన్నా సమస్య వస్తుంది. అందువల్ల మా ఇంటి పక్కన గుడిసె లో ఉన్న ఆ కష్టజీవి శరీరం నాకిప్పిస్తే వాడి శరీరంలో ప్రవేశించి నాకు కావాల్సినవన్నీ తినేస్తాను.

సా: ఆ విధంగా చేయటం నాకు సాధ్యమే కానీ నిన్ను నా శరీరంలో ప్రవేశపెట్టాలంటే
వాడి అనుమతి కూడా కావాలి కదా . కొంచెం సమయము ఆగు. నేను వెళ్లి కనుక్కొని వస్తాను.

ఆ విధంగా సాధువు పేదవాడి ఇంటికి వచ్చాడు . పేదవాడు కూడా తన శక్తిమేరకు సాధువుకు మర్యాద చేసి ఆయన మాట్లాడే లోపలే "స్వామీ, నాది ఒక కోరిక "అని అడిగాడు .
సా: ఏమి నాయనా నీ కోరిక?
పేదవాడు: స్వామి నాకు ఎన్నో తినాలని చాలా ఆశగా ఉంది, కానీ నా దుర్భరమైన ఆర్థిక పరిస్థితి కారణంగా నేను ఏమి తినలేక పోతున్నాను . కాబట్టి నా కోరికను తీర్చండి.
సా: ఎలా తీర్చ మంటావు?
పే: మా ఇంటి పక్కన ఒక ధనికుడు ఉన్నాడు. ఆయనకు లేనిదేదీ లేదు , ఏమి కావాలన్నా తెప్పించుకో గలడు. ఆయన శరీరం లోనికి నన్ను ప్రవేశం పెట్టినట్లయితే ఆ శరీరం లోనికి వెళ్లి నాకు కావలసింది అంతా తిని కోరిక తీర్చుకుంటాను.

ఇంకేం ఇద్దరు కోరికలు సమానంగా ఉన్నాయి.. సాధువుకు పని సులభం అయింది. ఇద్దరు ఆత్మలను కుండ మార్పిడి చేస్తే సరి. సాధువు ఆ విధంగా నిర్ణయించుకొని ఇద్దరితో విడివిడిగా ఇలా అన్నాడు.
"ఒక్క రాత్రికి మీ ఆత్మలను నేను ఒకరికొకరికి మార్పు చేస్తాను . తెల్లవారిన తర్వాత మీ అనుభవాల ననుసరించి కొనసాగిద్దామా లేదా అని నిర్ణయించు కుందాము" అని. ఈ ప్రణాళికకు ఇద్దరూ అంగీకరించారు. ఆ విధంగా సాధువుకు ఇద్దరి ఆత్మలు మార్చి వేసినాడు. ఇద్దరూ ఆనంద పడ్డారు.

పేదవాడు ధనికుని శరీరంలోకి వచ్చిన వెనువెంటనే సేవకుడిని పిలిచి "ఒరేయ్ ఆకలిగా ఉంది బంగారు కంచం లో అన్ని వడ్డించండి " అని అన్నాడు.. సేవకులు అలాగే వడ్డించారు . కానీ కంచం లో పదార్థాలు చూడగానే పేదవాడికి ఒక రకంగా అనిపించింది. అయినా తినటానికి ఉపక్రమించి ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. చాలా చప్పగా ఉంది. " ఒరేయ్ ఓయ్ ఏంట్రా చప్పిడి కూడా పెట్టారు నాకు "అని అన్నాడు పేదవాడు. దానికి సేవకులు" అయ్యా తమరు ఉప్పు తినకూడదు " అని అన్నారు. "ఎందుకు ?" అన్నాడు పేదవాడు.. సమాధానంగా సేవకులు "అయ్యా తమకు రక్తపోటు ఉన్నది. అందువల్ల మీరు ఉప్పు తినరాదు" అని అన్నారు.. "సర్లే ఏదైనా కారంగా పెట్టండి రా " అని అడిగాడు పేదవాడు. దానికి సమాధానంగా సేవకులు-" అయ్యా తమరు కారం తినకూడదు తమరి కడుపులో పుండ్లు ఉన్నవి" అని అన్నారు..."పోనీలే తీయగా తింటాను . ఏవైనా తీపి పదార్థాలు తీసుకొనిరండి " అని అన్నాడు పేదవాడు.. దానికి సేవకులు -"అయ్యా నీకు తీపి పట్టదండి . మీకు మధుమేహ వ్యాధి ఉంది ." అని అన్నారు.. పాపం పేదవాడు చేసేదేమీలేక ఆ చప్పడి కూడా తినలేక తిని అక్కడి నుండి నిష్క్రమించి శయన మందిరానికి వెళ్ళాడు.. అక్కడ హంసతూలికా తల్పం చూడగానే పేదవాడికి పట్టరాని ఆనందం కలిగింది. ఆ మెత్తని పరుపు మీద పడుకునేందుకు ఉపక్రమించాడు. అలా శరీరం వాల్చాడో లేదో భరించలేనంత నడుము నొప్పి మొదలైంది. వెంటనే సేవకులని పిలిచి అడిగాడు -"ఏమిటి ఇలా ఉంది పరుపు " అని . అందుకు సేవకులు -" అయ్యా ఆ పరుపు లో తప్పులేదు . మీ నడుము లోనే లోపం ఉంది. ఆ పరుపును మీరు చూస్తూ ఉంటారు. కానీ నేల మీద పడుకొంటారు, కాబట్టి ఈరోజు కూడా ఇలాగే కానిచ్చేయండి " అని అన్నారు.
పాపం పేదవాడు ఏమి చేయలేక కిందనే పడుకున్నాడు , ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ.

ఇక్కడ ఇలా జరుగుతుండగా, పేదవాడి శరీరంలోకి వెళ్లిన ధనికుడు , ఆ ఇల్లాలిని పిలిచి -" ఆకలవుతుంది ఏమైనా పట్టుకురా" అన్నాడు . అందుకు ఆమె రోజువారీ పెట్టే గంజి తెచ్చింది . ఆ గంజి నోట్లో పెట్టుకుంటే వాంతికి వచ్చింది దనికుడికి . మనసులో ఇదేమిటి ఈ రకమైన తిండి తినడానికా ఈ శరీరం లోకి వచ్చాను అనుకున్నాడు. అనుకుంటూనే -" ఏమిటి ఇలాంటిది పెట్టావు. మంచిది తీసుకురా అన్నాడు ". అందుకామె- "అయ్యోరామా ! ప్రతి రోజు మనము తింటున్నది ఇదే కదా. రోజూ జుర్రుకుంటూ తాగుతావు కదా. ఈ రోజు ఏమైంది నీకు" అని అన్నది. అందుకు ధనికుడు - "సర్లే ఏదైనా తీపి పట్టుకురా " అన్నాడు. అందుకు సమాధానంగా ఆమె -" అలాగే తయారు చేస్తాను. కానీ నువ్వు వెళ్లి కూలి చేసి నాలుగు డబ్బులు తీసుకురా . అప్పుడు నేను వెళ్లి పంచదార కొనుక్కుని వచ్చి పాయసం చేసి పెడతాను. ఇప్పడు ఇంట్లో సొమ్ము ఏమీ లేదు." అని అన్నది.. అలా వారు ఇరువురు గొడవ పడ్డారు. ధనికుడు అత్యంత నిరాశ చెందాడు . సరేలే అని సర్దుకుని ఇప్పటికే ఆలస్యమైంది నిద్ర పోదామని అనుకుని ఇల్లాలితో పరుపు తెమ్మన్నాడు . ఆ ఇల్లాలు వెళ్లి ఒక చింకి చాప తెచ్చింది . చేసేది ఏమీ లేక ఆ చాపమీద నే ఒక రాయిని దిండుగా చేసుకొని పడుకున్నాడు ధనికుడు. కానీ దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. విపరీతమైన బాధ . నిద్ర పట్టలేదు దనికుడికి.
ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ తలవాల్చాడు.

ఆ విధంగా భవంతిలో ధనికుడి శరీరంలోని పేదవాడు, గుడిసెలో పేదవాని శరీరంలో ధనికుడు, ఇరువురు వారి వారి బాధలను అనుభవిస్తూ ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తున్నారు..

మరుసటి రోజు ఉదయం రానే వచ్చింది. ఇద్దరూ పరుగు పరుగున సాధువును కలుసుకొని -" స్వామీ! మాకు అలవాటైన దేదో అదే బాగుంది . మా తప్పు తెలిసి వచ్చింది. మా ఆత్మలను యధాతథంగా పూర్వ శరీరాలకు పరస్పరం మార్చేయండి." అంటూ ప్రాధేయపడ్డారు..

నీతి: ఒకరి కష్టాలు తక్కువ ఒకరి కష్టాలు ఎక్కువ అని అనుకోవటం మూర్ఖత్వం. ఏ కష్టాలైనా స్వీకరిస్తే బాధలు నివృత్తి అవుతాయి...
AVB సూచన :-అతిగా ఆశ పడకండి ,ఉన్నదానితో తృప్తి చెందండి ,సౌకర్యాలతో పాటుగా రోగాలు దరిచేరతాయి అని గమనించండి ,శరీరాన్ని కష్టం చేయనీయండి ,కష్టంలో సుఖం చుడండి ,పక్కవాడిని చూసి వ్యసనపడకండి ,సహాయం చేయటం అలవాటు చేసుకోండి ,మనకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో కృష్ణపరమాత్మ కు తెలుసు అని గమనించండి సర్వం కృష్ణార్పణమస్తు 🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment