Wednesday, March 23, 2022

యద్భావం తద్భవతి

" యద్భావం తద్భవతి "


పూర్వం ఒక ఊళ్ళో ఒక పేరుమోసిన జమిందారు ఉండేవాడు ఆయన గర్విష్టి, పొగరుబోతు.


ఒకసారి ఆయన యధాప్రకారంగా శివుని ఆలయానికి వెళ్ళాడు. అక్కడొక సన్యాసి కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. తానూ కూడా వెళ్ళి అతని పక్కన కూర్చుని ధ్యానం చేసాడు.


ధ్యానానంతరం ఆ సన్యాసిని,జమిందారు "నేను ధ్యానం చేసేటప్పుడు ఎలా కనిపించాను?" అని అడిగాడు.


"శివునిల కనిపించారు " అని చెప్పి, " మరి నేనెలా కనిపించాను?" అని అడిగాడు సన్యాసి.


"పెంట కుప్పలా కనిపించారు " అన్నాడు జమిందారు   అతిశయంగా.

ఆ మాటలకి సన్యాసి చిరునవ్వు నవ్వాడు.


ఊహించని ఆ పరిణామానికి విస్తుపోయిన జామిందారు " మీకు కోపం రాలేదా?" అని అడిగాడు.


"కోపమెందుకు? మన మనసు ఎలా వుంటే ఎదుటివారు అలా కనిపిస్తారు. నా మనసు నిండా శివుడు నిండి వున్నాడు కాబట్టి నువ్వు నాకు శివునిలా కనిపించావు, నీ మనసు నిండా పెంట వుంది కాబట్టి నీకు నేను పెంటకుప్పలా కనిపించాను" అని వివరించాడు సన్యాసి. 


దానితో జామిందారు ముఖం చిన్నబోయింది.


ధర్మ నీతి

ఈ సంఘటన ద్వారా మనం గమనించాల్సిన ధర్మం, నీతి ఏమి అనగా...

"యద్భావం తద్భవతి" అని వేదంలో చెప్పినదానికి ఇది చక్కని సరియైన ఉదాహరణంగా చెప్పుకోవచ్చు.


మన మనసు దేనితోనైతే నిండి ఉందొ... అది భయంతోనా, అసూయతోనా, ధైర్యంతోనా, ఆధ్యాత్మిక వైరాగ్యంతోనా అనే దానితోనే మన చూపు, మన ఆలోచనలు, మన చేతలు ఆధారపడి ఉంటాయని అర్ధం అవుతుంది.


ఒకరిపై ఒకరు అసూయలతో, ద్వేషాలతో మనం మన జీవితాన్నే పూర్తిగా వ్యర్థం చేసుకుంటున్నాము. 


అందుకు మనం ఎదుటివారికంటే ముందు మన మనసును తెలుసుకొని, ఆ మనసు దేనితో నిండి ఉందో కనుక్కోని సరిదిద్దుకున్నప్పుడు మన జీవితం సార్ధకతమవుతుంది.


 అందుకు మన పురాణాల్లో " సర్వం ఆ పరమేశ్వరుడి శక్తి నిండి వుంది, నీలో కూడా ఆ శక్తే ఉన్నది. నీవు ఆ శక్తినే చూడాలి, అంతేకాని ఆ శక్తిని నీలోను, బయటి ప్రపంచంలోను వేరు వేరుగా చూడకూడదు అనే ఉద్దేశ్యంతో సనాతనంగా ఒక ప్రణాళికతో బాల్యం నుండి ధర్మ బోధనలు గురు ముఖంగా నేర్పింపబడేవి. 


అందువల్ల పూర్వ కాలంలోని ప్రజలు ధర్మంగా జీవించారు, కానీ ఇప్పుడున్న కాలంలో అలాంటి ధర్మ బోధనలు ఏవి..? ఎక్కడ బోధించబడుతున్నాయి..? ధర్మం అనే పదం ఒకటి ఉందనే సంగతి కూడా ఇప్పటి కొంతమంది పిల్లలికి తెలియదు. అలా అయితే వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది. ఆలోచించండి....


ఈ పోటీ యుగంలో ఇవి అవసరం లేదు అని, పోటీతత్వమే ఊపిరిగా సాగుతున్న బోధనలు మారాలి. అంతవరకు కనీస బాధ్యతగా తమ తల్లిదండ్రులే ఈ ధర్మ బోధనలు తమ తమ పిల్లలకు బోధింపబడే విధంగానైనా చూడండి మీ పిల్లల భవిష్యత్తు కోసం. 


*మీ శ్రేయోభిలాషి 

సేకరణ

No comments:

Post a Comment