Monday, June 27, 2022

ఋషులు తపశ్శక్తితో దర్శించి, ఏర్పర్చిన ఆచారాల వెనుక దాగివున్న విజ్ఞానాన్ని అర్థంచేసుకోలేకా అవన్నీ 'చాదస్తం' అని వెక్కిరించేవారికి ఈ వ్యాసం

 ఋషులు తపశ్శక్తితో దర్శించి, ఏర్పర్చిన ఆచారాల వెనుక దాగివున్న విజ్ఞానాన్ని అర్థంచేసుకోలేకా అవన్నీ 'చాదస్తం' అని వెక్కిరించేవారికి ఈ వ్యాసం ఒక గుణపాఠం.....


“లాభాల్లోకల్లా గొప్ప లాభం ఏమిటి?" అని యక్షుడు ప్రశ్నిస్తే "ఆరోగ్యం" అని సమాధానమిచ్చాడు ధర్మరాజు.

అనారోగ్యం, దరిద్రం - లేకపోవడమే గొప్పజీవితం... అని పెద్దల మాట. అటువంటి జీవితాన్ని ఆశిచడం, దానికోసం సాధన చేయడంలో ఏ దోషమూ లేదు.

ఎంత ప్రయత్నించినా మన చేతిలో లేనివి కొన్ని ఎలాగూ ఉంటాయి. మన నియంత్రణకందని స్థితిగతులు, ఎలా ఉన్నా మనం జాగ్రత్తపడి బాగు చేసుకోగలిగేవి చాలా ఉంటాయి.

మన చేతుల్లో ఉన్నవి చాలా ఉన్నాయి. వాటిని సాధించగలిగితే జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు. చేయి దాటిన వాటి విషయంలో 'ప్రారబ్ధం' అని సర్దిపెట్టుకోవచ్చు.

'ఆరోగ్యం' అంటే కేవలం దేహసంబంధమైనదిగా కాక, మనస్సంబంధి కూడా అని గ్రహించాలి. శరీర సంబంధమైన 'వ్యాధి'కీ, మనసుకి చెందిన 'ఆధి'కీ అనుబంధం కూడా ఉంది. ఒక దాని ప్రభావం మరొక దానిపై ఉండితీరుతుంది.

విచక్షణ, విజ్ఞానం, ఉద్రేకాల్ని నిగ్రహించడం వంటివి మానసిక స్వస్థతకి ముఖ్యం. సరియైన ఆహారవిహారాలు, ఆచారవ్యవహారాలు దైహిక స్వాస్థ్యానికి ప్రధానం.

ఈ రెండింటికీ తగిన నియమబద్ధ జీవనం ప్రధాన సాధన. ఆ విధమైన జీవన విధానాలనే మన ధర్మం బోధించింది. ధార్మికమైన జీవన విధానంలో మనల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నడిపే సూత్రాలు ఇమిడి ఉన్నాయి.

అన్ని విధాలా స్వస్థత కలవాడు ఆధ్యాత్మికంగా ఔన్నత్యాన్ని సాధించగలడు.

● సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, ఎక్కువసేపు రాత్రి మెలకువగా ఉండకుండా నిద్రపోవడం... మొదటి మెట్టుగా నిర్ధారించారు మనవాళ్ళు. పగటి నిద్రను శాస్త్రం మంచి అలవాటుగా ఒప్పుకోలేదు.

● మన పూజల్లో, అనుష్ఠానాల్లోనే పద్మాసనం, అర్థ పద్మాసనం, ప్రాణాయామం లాంటి యోగ వ్యాయామ పద్ధతులను నిబద్ధించారు.

● పెద్దలు నిర్ధారించిన మంత్రజపాలు, స్తోత్రానుష్ఠానాలు కూడా మనలో సానుకూల స్పందనలను ఏర్పరచే శక్తి గలవేనవి - వైజ్ఞానిక శోధనలు కూడా ఋజువు చేస్తున్నాయి.

● రాగద్వేషాలను నిగ్రహించుకోవడం, వైరాగ్యం, ఆశల తీవ్రతని నియంత్రించడం వంటి వేదాంత దృక్పథం మానసిక సమతుల్యానికి మార్గం.

● సాత్వికమై, నియమం కలిగిన, సకాల భోజనం - శాస్త్రం నిర్ధేశించింది. భోజనాల నడిమి చిరుతిళ్లను, రాజసతామసాహారాలను నిషేధించింది. ఇవన్నీ ఆయురారోగ్యాలను పెంచే విధానాలు.

● శరీరాల, పరిసరాల పరిశుభ్రతను 'శౌచం' పేరుతో నియమించింది శాస్త్రం. ఇవన్నీ మనశరీరాలను దృఢంగా, శాంతంగా, నిబ్బరంగా ఉంచగలిగే పద్ధతులు.

● ఆహార విషయంలో మనవాళ్ళు పెట్టిన నియమాలు అన్నీ యిన్నీ కాదు. అవన్నీ విజ్ఞానానికి విరుద్ధాలు కావు. లోతుగా ఆలోచించలేక, క్రమశిక్షణను అంగీకరించలేని అలసత్వంతో వాటిని 'చాదస్తాలు' అని కొట్టి పారేయడం మన ప్రగతికే అవరోధం.

"మనిషికి నూరేళ్ళ ఆయువును శాస్త్రం పేర్కొంది. కానీ అందరూ అన్ని ఏళ్ళు బ్రతకడం లేదు. కారణమేమిటి? " అని ధర్మరాజు ప్రశ్నించాడు.

"అనాచారం, దురాచారమే అల్పాయువుకీ, అనారోగ్యానికి హేతువులు" అని భీష్ముడు వివరించాడు.

రోగ నివారణ కంటే, రోగం రాకుండా నియంత్రణ చాలా మేలు అని సూక్తి. ప్రాచీన పద్ధతుల్లో నియమబద్ధమైన జీవితం గడిపిన, గడుపుతున్న ఆచారవంతుల జీవితాల్ని పరిశీలిస్తే ఈ విషయం అర్థమౌతుంది.

వీటన్నిటికీ తోడు 'నేను స్వస్థుడిగా ఉన్నాను. నేను దేన్నైనా సాధించగలను' అనే సకారాత్మక ఆలోచనాధోరణి కలవారు, నిత్యం క్రియాశీలంగా ఉంటూ చైతన్యవంతమైన జీవితం గడిపేవారు. ఆయురారోగ్యాలను సాధించడమే కాక, నిత్యోత్సాహులై స్ఫూర్తివంతమైన వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా నిలుపగలరు. సార్థక జీవనులు కాగలరు.

నిత్య జీవన వ్యవహారంలో ఎన్నో కార్యకలాపాలు, మానసిక స్థితులు ఉంటాయి. వేటికి ఎంత ప్రాధాన్యమివ్వాలో తెలుసుకోగలిగే సంయమన స్థితి ధార్మిక జీవన గతిలో స్వాభావికంగా ఏర్పడుతుంది. ఇదే సుఖజీవన సోపానం.

[ పూజ్య గురువుగారు - ''బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు" రచించిన వ్యాసం.]


ఓం నమో నారాయణాయ🙏


🌷🕉🌷

No comments:

Post a Comment