Sunday, June 26, 2022

నీతి: క్రోధం వల్ల సాధించేదేమీ ఉండదు. కోపానికి విరుగుడు శాంతమే. శాంతం వహిస్తే, క్రోధాన్ని అవలీలగా జయించవచ్చు.

 పురానీతి!

ఒకనాటి సాయంత్రం శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి వనవిహారానికి వెళ్లారు. కబుర్లాడుకుంటూ వెళుతుండటంతో కాలం తెలియలేదు. చీకటి ముసురుకునే వేళకు ముగ్గురూ ఒక కీకారణ్యంలోకి చేరుకున్నారు. ముందుకు సాగడానికైనా, వెనక్కు మళ్లడానికైనా ఏ మాత్రం అనువుకాని సమయం. ఇక చేసేదేమీ లేక ఆ రాత్రికి ఎలాగోలా కీకారణ్యంలోనే గడపాలని నిశ్చయించుకున్నారు.అడవిలో ముగ్గురూ ఒకేసారి ఆదమరచి నిద్రపోవడం క్షేమం కాదని, అందువల్ల ఇద్దరు నిద్రిస్తున్నప్పుడు మిగిలిన వారు కాపలా ఉండాలని, ఇలా వంతుల వారీగా మేలుకొని కాపలా ఉంటూ రాత్రి పొద్దుపుచ్చాలని అనుకున్నారు. ముందుగా శ్రీకృష్ణుడు, బలరాముడు ఒక చెట్టు కింద నిద్రకు ఉపక్రమించారు. సాత్యకి వారికి కాపలాగా మేలుకొని ఉన్నాడు. ఒళ్లంతా కళ్లు చేసుకుని, చుట్టూ గస్తీ తిరగసాగాడు.అంతలోనే ఒక రాక్షసుడు కృష్ణ బలరాముల వైపు వడివడిగా రావడం కనిపించింది. సాత్యకి వెంటనే ఆ రాక్షసుడిని అడ్డగించాడు. రాక్షసుడు సాత్యకిపై దాడికి దిగాడు. సాత్యకి క్రోధావేశాలతో తన గదాయుధంతో అతడిని ఎదుర్కొన్నాడు. సాత్యకిలో క్రోధం మొదలైన మరుక్షణమే రాక్షసుడి శరీరం రెట్టింపైంది. సాత్యకికి కోపం మరింత పెరిగింది. రాక్షసుడి శరీరం కూడా పెరిగింది. సాత్యకి కోపం చల్లారకపోగా, అంతకంతకూ పెరగడంతో రాక్షసుడి శరీరం విపరీతంగా పెరిగింది.రాక్షసుడి శరీరం ముందు సాత్యకి ఆటబొమ్మలా కనిపించసాగాడు. రాక్షసుడు సాత్యకిని ఎత్తిపట్టుకుని, గిరగిరా తిప్పి కింద పడేసి వెళ్లిపోయాడు. గాయాలపాలైన సాత్యకి కొద్దిసేపటికి శక్తి కూడదీసుకుని తెప్పరిల్లాడు. అదే సమయానికి మేలుకున్న బలరాముడు ఇక తాను కాపలాగా ఉంటానని చెప్పి, సాత్యకిని నిద్రపొమ్మన్నాడు.రాక్షసుడితో పోరులో అలసి సొలసిన సాత్యకి నెమ్మదిగా చెట్టు కిందకు చేరుకుని, ఆదమరచి నిద్రలోకి జారుకున్నాడు. బలరాముడు అటూ ఇటూ తిరుగుతూ కాపలా కాయసాగాడు. సాత్యకికి ఎదురైన రాక్షసుడే బలరాముడికీ ఎదురయ్యాడు. యుద్ధానికి కవ్వించాడు. బలరాముడు అసలే ప్రథమకోపి.కట్టలు తెంచుకున్న కోపంతో తన హలాయుధాన్ని ఎత్తి రాక్షసుడిపై దాడి చేశాడు. రాక్షసుడు వికటాట్టహాసం చేస్తూ తన శరీరాన్ని పెంచాడు. బలరాముడి కోపం మరింత పెరిగింది. బలరాముడి కోపంతో పాటే రాక్షసుడి శరీరం పెరుగుతూ రాసాగింది. చివరకు భీకరాకారం దాల్చిన రాక్షసుడు బలరాముడిని కూడా మట్టికరిపించి, వెనుదిరిగాడు.ఇంతలోగా తనవంతు కాపలా కాయడానికి శ్రీకృష్ణుడు మేలుకున్నాడు. ఇంకా తెల్లారలేదు కదా, ఓ కునుకు తీయమన్నాడు బలరాముడిని. రాక్షసుడి ధాటికి ఒళ్లు హూనమైన బలరాముడు నెమ్మదిగా చెట్టుకిందకు చేరుకుని నడుం వాల్చాడు. వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. శ్రీకృష్ణుడు అటూ ఇటూ కలియదిరుగుతూ కాపలా కాయసాగాడు. కొద్దిసేపటికి సాత్యకిని, బలరాముడిని మట్టికరిపించిన రాక్షసుడు శ్రీకృష్ణుడి ఎదుటికి వచ్చాడు. యుద్ధం చేయమంటూ కవ్వించాడు.శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ సై అన్నాడు. రాక్షసుడు కృష్ణుడి మీదకు లంఘించాడు. కృష్ణుడు ఒడుపుగా తప్పించుకున్నాడు. ప్రశాంతంగా అతడి వైపు చూసి మల్లయుద్ధానికి చెయ్యి కలిపాడు. రాక్షసుడి శరీరం సగానికి సగం తగ్గిపోయింది. అతడు ఎంతగా కవ్విస్తున్నా, కృష్ణుడు చెక్కుచెదరని చిరునవ్వుతో అతడిని ఎదుర్కోసాగాడు.శ్రీకృష్ణుడు ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తున్న కొద్దీ రాక్షసుడి శరీరం అంతకంతకూ తగ్గిపోసాగింది. చివరకు గుప్పిట్లో పట్టేంత చిన్నగా తయారయ్యాడు ఆ రాక్షసుడు. శ్రీకృష్ణుడు ఆ రాక్షసుడిని అరచేత పట్టుకుని, తన ఉత్తరీయం అంచుకు మూటలా కట్టేశాడు. కొద్దిసేపటికి తెల్లవారింది. అడవిలో పక్షుల కిలకిలలు మొదలయ్యాయి.సాత్యకి, బలరాముడు మేలుకున్నారు. తమ దగ్గరే ఉన్న కృష్ణుడిని చూశారు. తమ ఒంటి మీద ఉన్న గాయాలను చూసుకున్నారు. రాత్రి తమకు కనిపించిన రాక్షసుడి గురించి చెప్పారు. ‘అలాంటి రాక్షసుడు నీకు కనిపించలేదా?’ అని అడిగారు. వీడేనా ఆ రాక్షసుడు’ అంటూ తన ఉత్తరీయం అంచున కట్టిన మూటను విప్పాడు కృష్ణుడు. అందులోంచి బయటపడ్డాడు గుప్పెండంత పరిమాణంలో ఉన్న రాక్షసుడు.బలరాముడు, సాత్యకి ఆశ్చర్యపోయారు. ‘నిన్న మాకు కనిపించింది వీడే. అయితే, అప్పుడు బాగా పెద్దగా ఉన్నాడు. కోపంగా అతడితో పోరు సాగించే కొద్దీ మరింతగా పెరిగిపోసాగాడు’ అని చెప్పారు. ‘ఈ రాక్షసుడు మూర్తీభవించిన క్రోధం. క్రోధానికి విరుగుడు క్రోధం కాదు, శాంతం. మీరిద్దరూ కోపంతో రెచ్చిపోయి తలపడ్డారు. అందుకే ఇతడి చేతుల్లో పరాజితులయ్యారు’ అని చెప్పాడు కృష్ణుడు. అప్పుడు జ్ఞానోదయమైంది సాత్యకీ బలరాములకు.


నీతి: క్రోధం వల్ల సాధించేదేమీ ఉండదు. కోపానికి విరుగుడు శాంతమే. శాంతం వహిస్తే, క్రోధాన్ని అవలీలగా జయించవచ్చు.

సేకరణ:-

No comments:

Post a Comment