Sunday, June 19, 2022

మనిషి చేయవలసిన పనులు

మనిషి చేయవలసిన పనులు
💞 మనిషి సదా మంచి ఆలోచనలు చేయాలి. మంచినే సంకల్పించాలి. మంచినే ఆచరించాలి అన్నది వేదాలు చెప్పిన నీతి నియమావళి.
💕 ఏది సంకల్పిస్తే అదే జరుగుతుందన్న భావనకు శాస్త్రీయ ఆధారం లేకపోయినా మంచి ఆలోచన చేయాలన్న స్మృతులు, శ్రుతులు, పురాణాలు, ఇతిహాసాల ప్రబోధకు ఆచరణ సాధ్యమైన ప్రాధాన్యం ఉంది.
💓 చిన్న పిల్లలను ‘శతమానం భవతి’ అంటూ దీవిస్తాం. వారికి సదా మంచి జరగాలని ఆశిస్తాం. 💕 పదేపదే చేసే ఆలోచన సంకల్పాన్ని ధరిస్తుంది. అలాంటి సంకల్పాలు మనల్ని కర్తవ్యోన్ముఖులను చేస్తాయి. సంకల్పం బలపడినప్పుడు కర్మలు చేస్తాం. పునరావృతమయ్యే ఆలోచనలకు అంతబలం ఉంటుంది కాబట్టి మంచి ఆలోచనలు చేయాలనే వాదానికి ప్రాముఖ్యం ఉంది.
💝 దుఃఖ సమయంలో ప్రజలు దైవాన్ని ఆశ్రయించి అనుగ్రహం కోరతారు. పూర్వ కర్మల ఫలితంగా కష్టాలు నిర్ధారణ అయినవైతే, దైవప్రార్థన వల్ల కర్మ ఫలితం తొలగుతుందా అన్న సందేహం సాధకులకు కలుగుతుంది. మనసారా ప్రార్థనలు చేస్తే దైవానుగ్రహం లభిస్తుందని దుష్కర్మలు దగ్ధమై వాటి పరిణామాలు అనుకూలంగా మారతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. పెద్దల దీవెనలు శుభప్రదమని, వారి వాత్సల్య భావానికి పిన్నల జీవితాలను ఆనందదాయకం చేసే శక్తి ఉందనే విషయం అనుభవైకవేద్యం.
💖 జీవుల ఆనందం కోసమే భగవంతుడు సమస్త జగత్తును సృజించాడు. అందుకు కారణం ఆయన ఆనంద స్వరూపుడు కావడమే.
💓 కష్టాలు వాటిల్లవచ్చనే భయంతో మానవుడు ఆనంద క్షణాలకు దూరం కాకూడదు. సదా మంచి జరగాలనే భావనలో ఆశావహ స్వరూపం ఉంది. పెద్దలు, పిన్నల మంచి కోరుతూ అందించే మంగళాశాసనమే ఆశీర్వచనం.
❤️ విశ్వకల్యాణం కోరి పవిత్ర క్షేత్రాల్లో జరిపే క్రతువులు మానవాళికి చల్లని దీవెనలు అందిస్తాయి. క్షేత్రదర్శనం వల్ల భక్తుల హృదయాల్లో మంగళకరమైన భావనలు ఆవిర్భవిస్తాయి.
💝 సాటివారికి మంచి జరగాలనే ప్రతి తలంపూ ఓ చల్లని దీవెనే. ఒకరికి మేలు జరగాలన్న ఆలోచనలకు పవిత్రమైన పునాది ఉంటుంది. అలాంటి తలంపులు సదా పరిమళంతో గుబాళిస్తాయి. ప్రతికూల ఆలోచనలు చేసినవారికి మానసికమైన నష్టం కలుగుతుంది. మంచి ఆలోచనలతో సాకారమైన కార్యంవల్ల అందరూ లాభం పొందుతారు.
💞 మంచి ఆలోచనలు వాక్‌ రూపాలై దీవెనలుగా సత్‌ పురుషుల నోటి నుంచి వెలువడతాయి. నమస్కరించడానికి కూడా మనసొప్పక “హి”, “హాయ్”ల వంటి పనికిమాలిన పదాలను పెద్దలముందు వాడుతున్న వాళ్లకు ఆశీర్వాదములందడం కల్ల.
💝 నమస్కార సంస్కారాన్ని మరచి తమ తమ గురువుల ప్రతినిధులమని తెలిపేలాగున “నమో భగవతే వాసుదేవాయ”, “జై శ్రీమన్నారాయణ” లనుపయోగిస్తున్నారు కొందరు. ఇది తప్పు అనడం లేదు. నమస్కారానికి ప్రత్యామ్నాయమే లేదు కదా. నమస్కారం చేస్తూ దానికి అనుబంధం చేయాలని అంటున్నాను.
💝 తమ అమ్మాయి పెళ్లి తర్వాత వధూవరులను “పెద్దవాళ్లకు పాదాభివందనం చేసుకుని రండి” అని పురమాయించారు తలిదండ్రులు.“పెద్దవాళ్లెవరూ కనిపించట్లేదు”అని అమ్మాయి మిన్నకుంది. ఈ మనస్తత్వానికి నిర్వచనమే లేదు కదా…!
💝 ”దైవం మానవ రూపేణా” అని శాస్త్రవచనం. భగవదాశీస్సులు పెద్దవాళ్ల ద్వారా, గురువుల ద్వారా మనకు చేరుతాయని అందరూ గమనించి సంస్కారవంతులై తమ తమ జీవితాల్లో తామే వెలుగులను నింపుకోవాలి

సేకరణ

No comments:

Post a Comment