నేటి జీవిత సత్యం.
ఆ రోజుల్లో కొందరు గృహస్తులు భిక్షువుల్ని చూసి, వారికి లభిస్తున్న గౌరవాన్ని చూసి, తామూ భిక్షువులుగా మారేవారు. కానీ అక్కడి క్రమశిక్షణ నియమావళి, నైతిక జీవనంలో ఇమడలేక, మోహాన్ని, రాగాన్నీ వదిలించుకోలేక తిరిగి భిక్షుజీవనాన్ని వదిలి పెట్టేవారు. ఇలాంటివారి గురించి బుద్ధుడు చెప్పిన గొప్ప సందేశం ఇది. నీటిలో దిగేవాడికి నాలుగు భయాలు ఉంటాయి. మొదటిది, తరంగ భయం. తరంగం మనిషిని వెనక్కి పడేస్తుంది.
ముందుకు పోనీయదు. అలాగే మనస్సులోని అహంకారం కూడా అలాగే వెనక్కి పడదోస్తుంది. ఇతను నాకు చెప్పేవాడు. నాకంటే వయస్సులో చిన్నవాడు. నాకంటే వెనుక వచ్చినవాడు అనే అకుశల భావన అహంకారాన్ని ప్రేరేపించి జలతరంగంలా మనిషిని వెనక్కి నెట్టేస్తుంది. అలాగే.... నీటిలో ఉండే మొసళ్ళ భయం. ఇది చాపల్యానికి చెందిన అకుశల కర్మ. నీటిలో కనిపించని మొసలి వచ్చి, వడిసి పట్టి లోనికి లాగేస్తుంది. ఈ చాపల్యం కూడా అలాగే లాగేస్తుంది.
అంతకుముందు తిన్నది ఇప్పుడు తినకూడదు. తాగింది తాగకూడదు. కానీ ఆ రుచి చపలత మనిషిని మొసలి పట్టు పట్టి వెనక్కి లాగేస్తుంది. అందుకే ఇది మకర భయం. ఇక మూడోభయం సుడిగుండ భయం. సుడిగుండం వేగంగా తనలోకి లాక్కు పోయి, గిరగిరా తిప్పేసి ముంచేస్తుంది. అలాగే గతంలో అనుభవించిన విలాసవంతమైన జీవితం తాలూకు సౌకర్యాలన్నీ మనల్ని సుడిగుండంలా చుట్టుముడతాయి.
నాలుగో భయం సొరచేప భయం. మనిషిని పట్టి కత్తిరించి సొరచేప ఎలా మింగేస్తుందో కామం కూడా అలాగే మింగేస్తుంది. అలంకరణలు, అందచందాలను చూసి అదుపు తప్పిన భిక్షువు చివరికి ఎందుకూ కొరగాకుండా పోతాడు. ఈ కామరాగాన్ని అదుపుచేయని వ్యక్తి కూడా మింగివేయబడతాడు. అంటే పూర్తిగా ఉనికినే కోల్పోతాడు.ఆదర్శ మార్గంతో నడిచే వ్యక్తికి అపాయాన్ని కలిగిస్తాయి నాలుగు భయాలు. అందుకే ఈ నాలుగింటి పట్ల భయంతో ఉండాలి.వాటికి చిక్కుపడకుండా ఉండాలి. అందుకు జాగరూకత కలిగి ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తి చిరకీర్తిని పొందుతాడు. పరిపూర్ణుడవుతాడు. చివరికంటూ ఆదర్శమూర్తిగా మిగులుతాడు.ధార్మికుడు తప్పనిసరిగా తన జీవితంలో ఊహించుకోవాల్సిన నాలుగు భయాలు ఇవి. వీటిని జయించినవాడు అసలైన యోధుడు. తనను తాను జయించుకున్న జితేంద్రియుడు….
సేకరణ. మానస సరోవరం 👏
No comments:
Post a Comment