Saturday, June 18, 2022

భగవంతుడు చెడుని సృష్టించాడా?

 *🍁భగవంతుడు చెడుని సృష్టించాడా?🍁*


✍️ మురళీ మోహన్


👌ఒక విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసరుగారు పరమ నాస్తికుడు. అంతవరకూ ఫర్వాలేదు కానీ ఆయన వీలయినప్పుడల్లా తన తరగతి గదుల్లో భగవంతుని గురించి ఎగతాళిగా మాట్లాడుతూ ఉండేవారు. అలాగే ఓ రోజు దేవుడి గురంచి కాసేపు విద్యార్థులను ఆటపట్టిద్దామనుకుంటూ తరగతిలోకి ప్రవేశించారు ప్రొఫెసరుగారు…

‘ఈ ప్రపంచంలో ప్రతిదానినీ భగవంతుడే సృష్టించాడని మీరనుకుంటున్నారా?’ అంటూ విద్యార్థులను సూటిగా అడిగారు ప్రొఫెసరుగారు.

‘ఓ! ఆ విషయంలో మాకెలాంటి అనుమానమూ లేదు!’ అని బదులిచ్చారు ఆస్తికులైన కొందరు విద్యార్థులు.

‘మీరు చెప్పినదాని మీద మీరు నిలబడతారా?’ అని మళ్లీ ప్రశ్నించారు ప్రొఫెసరుగారు.

‘తప్పకుండా!’ అన్నారు విద్యార్థులు.

‘అయితే మీరన్న మాట ప్రకారం భగవంతుడు పరమ దుర్మార్గుడై ఉండాలి. ఎందుకంటే మీ మాటల ప్రకారం అతను ఈ లోకంలోని చెడునీ, స్వార్థాన్నీ కూడా సృష్టించి ఉండాలి కదా! అంచేత దేవుడు దుర్మార్గుడన్నమాటే’ అనేశారు.

ప్రొఫెసరుగారి మాటలకి ఏం జవాబు చెప్పాలో విద్యార్థులకి అర్థం కాలేదు. తరగతి మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఇంతలో ఓ విద్యార్థి లేచి ‘ప్రొఫెసరుగారూ మీరు మమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు కదా! మేం కూడా మిమ్మల్ని ఓ ప్రశ్న అడగవచ్చా!’ అని అడిగాడు.

‘తప్పకుండా’ అన్నారు ప్రొఫెసరుగారు నిర్భయంగా.

‘మీ దృష్టిలో చలి అనేది ఉందా?’ అని అడిగాడు సిగ్గుపడుతూ.

‘ఏం నీకెప్పుడూ చలి వేయలేదా’ అని ఎగతాళి చేస్తూ ‘ఈ ప్రపంచంలో వేడి ఉంటే చలి కూడా ఉన్నట్లే కదా!’ అన్నారు.

‘కానీ భౌతికశాస్త్రం రీత్యా వేడి లేకపోవడమే చలి. అంతేకానీ చలి ప్రత్యేకించి ఉండదు. ఎంత వేడిగా ఉందని కొలుస్తారు కానీ ఎంత చల్లగా ఉందో కొలవరు కదా! వేడి తగ్గుతున్న కొద్దీ దాన్నే చలిగా భావిస్తాము. సరే. ఇప్పుడు ఇంకో ప్రశ్నని అడుగుతాను. మీ దృష్టిలో చీకటి ఉందా!’ అన్నాడు విద్యార్థి.

అప్పటికే విద్యార్థి మాటలో ప్రొఫెసర్‌గారికి కాస్త ఇబ్బందిగా ఉంది. అయినా మాటలు కూడగట్టుకుని ‘తప్పకుండా! చీకటి లేకపోవడమేంటి. రాత్రి అయితే చీకటి ఎలా ఉంటుందో చూడవచ్చు కదా!’ అన్నారు.

‘ప్రొఫెసర్! మీ విజ్ఞానం ప్రకారం చీకటి అనేది ప్రత్యేకంగా ఉండదు. వెలుతురు లేకపోవడమే చీకటి. ఆ వెలుతురిని రకరకాలుగా పరిశోధించవచ్చు. అందులోంచి వెలువడే సప్తవర్ణాలను చూడవచ్చు. చూడటం అన్నదే వెలుతురుతో సాధ్యమవుతుంది. అది లేకపోవడమే చీకటి.’ అన్నాడు.

ప్రొఫెసర్ గారికి ఈ వాదన ఎక్కడికి వెళ్తుందో అర్థం కాలేదు. అప్పుడు అడిగాడు విద్యార్థి…. ‘సర్‌! ఇప్పుడు చెప్పండి. ఈ ప్రపంచంలో చెడు ఉందా!’ అని

‘లేకపోవడం ఏంటి! పొద్దున్నే లేచిన దగ్గర్నుంచీ ఎన్ని ఘోరాలు చూడటం లేదు. ఎన్ని దారుణాల గురించి చదవడం లేదు. ఇవన్నీ చెడుకి మరో రూపం కాక ఇంకేంటి!’ అని అన్నారు ఆవేశంగా.

‘అయ్యా! మీరన్నట్లు చెడు ప్రత్యేకించి ఉండదు. మంచితనం, విచక్షణ, సహనం లోపించడమే దుర్మార్గం. ఎలాగైతే వేడి లేకపోవడాన్ని చల్లదనం అనీ, వెలుగు లేకపోవడాన్నీ చీకటి అనీ అంటామో… మంచితనం లేకపోవడమే చెడు. భగవంతుడు చెడుని సృష్టించలేదు. ఆయన కరుణనీ, ప్రేమనీ సృష్టించాడు. మనలో అవి లోపించినప్పుడే దుర్మార్గం ప్రాణం పోసుకుంటుంది! ఇప్పుడు చెప్పండి భగవంతుడు దుర్మార్గుడా?’ అని అడిగాడు.

దానికి ప్రొఫెసరుగారి దగ్గర ఎలాంటి జవాబూ లేకపోయింది.

No comments:

Post a Comment