*విచక్షణా జ్ఞానం*
*మానవులు పుట్టుకతోనే ‘ఇది కావాలి, అది వద్దు!’ అనే రాగద్వేషములతో పుడుతున్నారు. వీటి వ్యామోహములో పడి మానవుడు తన విచక్షణా జ్ఞానము కోల్పోతున్నాడు. అజ్ఞానములో పడిపోతున్నాడు. రాగద్వేషాల వలన కలిగే సుఖములను దు:ఖములను అనుభవిస్తున్నాడు.
*మానవులకు పుట్టుకతోనే రాగద్వేషములు, ఇష్టాఇష్టాలు, సుఖదు:ఖాలు సంక్రమిస్తాయి. ఇవి అన్నీ ప్రకృతిలో ఉన్న సత్వ, రజస్, తమో గుణముల సమ్మేళనమే. ఇవి అన్నీ చేరి ఆత్మకు, మనసుకు మధ్య అడ్డుగోడలా నిలుస్తాయి. దానినే వ్యామోహము, మాయ, అజ్ఞానము, తెలియని తనము అంటారు. ఆ కారణం చేత మానవులు తమ జీవితమంతా ఈ ద్వంద్వాలలో పడి కొట్టుకుంటూ, తమలో ఉన్న ఆత్మస్వరూపమును గురించి తెలుసుకోలేక పోతున్నారు. తమలో ఉన్న ఆత్మానందాన్ని విడిచిపెట్టి, సుఖం కోసం, ఆనందం కోసం బయట వెతుక్కుంటూ ఉంటారు.
*సామాన్య మానవుడు ధనంలో, ఆస్తిలో, బంధువులలో, పరాయి స్త్రీలసంగమంలో, పదవిలో, ఇలా రకరకాలుగా బయట ఉన్న ఆనందం కొరకు నిరంతరం వెతుకుతూనే ఉంటాడు. వాటి కోసం నానాపాట్లు పడుతుంటాడు. సుఖం కోసం పరుగు! దు:ఖాన్నుండి తప్పించుకోడానికి పరుగు!పదవి కోసం పరుగు..! నిరంతరం పరుగెడుతూనే ఉంటాడు. ఈ పరుగులో పడి పరమాత్మను తెలుసుకోలేక పోతున్నాడు. దీనినే “ద్వన్ద్వమోహేన" అంటే ద్వంద్వాల వల్ల కలిగే మోహం. ఇది సామాన్యమైన మోహం కాదు. దట్టమైన మోహం. ఈ మోహానికి తగ్గట్టు అన్నీ నేనే చేస్తున్నాను అనే అహంకారం ఒకటి. దీనితో పాటు లెక్కలేనన్ని కోరికలు. వాటిని తీర్చుకోడానికి అడ్డమైన పనులు చేయడం. అవితీరకపోతే కోపం, ద్వేషం, పగ! మనసు అల్లకల్లోలం కావడం. అటువంటప్పుడు ఎలా ఏకాగ్రత కలుగుతుంది? ఏకాగ్రత లేనిదే ధ్యానం కుదరదు. ధ్యానం చేస్తేనే కానీ ఆత్మస్వరూపం అర్థం కాదు. కాబట్టి చూచిందల్లా నాదవ్వాలి అనే ఇచ్ఛను, కోరికలను వదిలిపెట్టాలి.
*దీని తరువాత వచ్చేది ద్వేషము. తనకు ఇష్టం లేని వస్తువుల మీద, మనుషుల మీద ద్వేషం పెంచుకోవడం. ఆ ద్వేషం కోపంగా మారుతుంది. ఆ కోపంతో కలిగే విషపరిణామాలు మనం చెప్పుకున్నాము. కోపం వలన సమ్మోహము, దానివలన స్మృతి విభ్రమం కలుగుతుంది. దాని వలన బుద్ధినాశనం అవుతుంది. తుదకు జరిగేది సర్వనాశనం.
*అందుకే ‘ఇచ్ఛాద్వేషములు అనే ద్వంద్వములను వదులుకోవాలి!’ అని పరమాత్మ చెప్పాడు. ఇవన్నీ కూడా పుట్టుకతోనే వస్తాయి. మధ్యలోరావు. పూర్వజన్మ సంస్కారం వలన వస్తాయి. వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి కానీ వాటి వ్యామోహంలో పడి పోకూడదు. వివేకం పెంపొందించుకోవాలి.
No comments:
Post a Comment