Friday, August 12, 2022

శరీరము రథము లాంటిది. రథములో కూర్చున్న వ్యక్తి ఆత్మ. సారధి బుద్ది. కళ్లెములు మనస్సు అనగా మన ఆలోచనలు. గుర్రాలు మన పంచేంద్రియాలు.... చంచలాత్మకం మన:, నిర్ణయాత్మికా బుద్ది,చింతనాత్మకం చిత్తం, అహంకారం

 శరీరము రథము లాంటిది. రథములో కూర్చున్న వ్యక్తి ఆత్మ. సారధి బుద్ది. కళ్లెములు మనస్సు అనగా మన ఆలోచనలు. గుర్రాలు మన పంచేంద్రియాలు. 

 రథం సరిగా నడవాలంటే సారధి సరిగా తోలాలి. అలాగే మనము సరైన మార్గంలో ప్రయాణించాలంటే మన బుద్ది మంచి నిర్ణయాలు తీసుకొని ఆలోచనల్ని సరిగా సరైన మార్గంలో పెట్టాలి. జ్ఞానేంద్రియాలైన "చర్మము,కన్ను, ముక్కు, నోరు,చెవి" లను వాటి ఇష్టం వచ్చినట్టు వెళ్లనీయకుండా కంట్రోల్ చేయాలి. చిన్నపిల్లలు మారాంచేసినట్టు మంచి చెడు ఆలోచించకుండా ఇంద్రియాలు అందమైనటువంటివన్నీ తమకే కావాలని కోరుకొంటాయి. చంచలమైన మనస్సులోకూడా ఇంద్రియాల ఇష్టాలకు తగినట్టుగానే ఆలోచనలు వస్తాయి.

కానీ రథసారథి అయిన బుద్ది నిర్ణయాలు తీసుకునే స్వభావము కలిగినది. మరియు మంచియేదో చెడు ఏదో వివేచనా శక్తి కిలిగినది. కాబట్టి అటువంటి బుద్ది మనస్సనే పగ్గాలను లాగుతూ సన్మార్గం లొనే గుర్రాలనే ఇంద్రియాలను నడిపించాలి. అప్పుడే మోక్షమనే గమ్యం చేరతాడు రథంలోని ఆత్మ అనే పురుషుడు.గుర్రాలను ఇష్టంవచ్చినట్లు పోనీయగూడదు.రథం రోడ్డు దిగి బోల్తాపడుతుంది. ఇంద్రియాలు చెప్పినట్లు బుద్ధి వినకూడదు. బుద్ది చెప్పినట్లుగానే ఇంద్రియాలు పనిచేయాలి.ఇది మానవ ప్రయత్నం వల్ల కాదు.అందుకే మనం భగవంతుని మనకు సద్బుద్ధిని ప్రసాదించమని ప్రతిరోజూ ప్రార్థించాలి. ఆయనే మన 

మనస్సును బుద్దిని సరైన మార్గంలో పెట్టగలడు.(మనస్సుకు అదిచేసే పనులనుబట్టి దానికి నాలుగు పేర్లు ఉన్నవి. అవి - మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం .1.చంచలాత్మకం మన:

  అంటే

మనస్సులో మంచిచెడులు నదీ ప్రవాహం లాగా నిరంతరం ఆలోచనల ప్రవాహం వస్తూనే ఉంటుంది.

2.నిర్ణయాత్మికా బుద్ది : 

నిర్ణయాలు తీసుకునే మనస్సును బుద్ది అని అంటారు.అందుకే మనపెద్దలు చిన్నవాళ్ళు ఎవరైనా చెడ్డపనులు చేసినప్పుడు ఒరే బుద్దిలేనివాడా అని తిడుతుంటారు.

3.చింతనాత్మకం చిత్తం. జరిగిపోయిన దుస్సంఘటనలను గుర్తుచేసుకుంటూ బాధపడేది.

4.అహంకారం. నేనే గొప్ప. నేనే మొనగాడ్ని. అనే గర్వముతోవున్న మనస్సును అహంకారం అని అంటారు.) అందుకే మనస్సనే పుష్పాన్ని భగవంతుని పాదపద్మముల చెంత ఉంచి నీవే దిక్కు అని శరణు వేడుకొంటే ఇక మనల్ని తల్లిదండ్రుల వలె రాత్రిపగలు తప్పక కాపాడతాడు. బిడ్డ ఏడుస్తుంటే తల్లి రాకుండా ఉంటుందా .

No comments:

Post a Comment