Saturday, August 20, 2022

రమణ గీత. అది హృదయ విద్య. మనోనిగ్రహం, భక్తి, విచారణ మొదలైన అంశాలతో కూడిని గ్రంథమది. అది ఒక విధమైన యోగశాస్త్రం. సాధకునికి సంశయ నివృత్తి కలిగిస్తుంది. భక్తునికి ఉపశమనం కలిగిస్తుంది.

 1915 . చాతుర్మాసంలో ఒక రోజున భగవాన్ చుట్టూ ఎందరో కూర్చుని ఉన్నారు. జగదీశశాస్త్రులు కలం, కాగితం తీసుకుని దీర్ఘాలోచనలో పడ్డారు. వారిని చూసి “ఏమిటి ఆలోచిస్తు న్నారు?' అని భగవాన్ అడిగితే, “ఒక శ్లోకం రాయాలను కుంటున్నాను. మొదటి పాదం మాత్రమే స్పురించి ఆగిపోయింది. దాన్ని పూరించలేకుండా వున్నాను,” అంటూ ఆ కాగితాన్ని భగవాన్ చేతికి ఇచ్చారు. ఆ పాదం “హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం...”. దాన్ని భగవాన్....

*శ్లో॥ హృదయ కుహర మధ్యే, కేవలం బ్రహ్మ మాత్రం! హ్యహ మహ మితి, సాక్షాదాత్మ రూపేణభాతి! హృది విశమనసాస్వమ్ చిన్వతా, మజ్జతావా పవన చలన రోధా దాత్మ నిష్టోభవత్వం”*

అని పూరించారు.

*దాని తాత్పర్యం :-*

హృదయమను గుహ యొక్క మధ్యమున కేవలము బ్రహ్మము "నేను - నేను" అని ప్రత్యక్షముగా, ఆత్మ రూపముగా ప్రకాశించుచున్నది. ఆత్మ గురించి వెదకుట చేతనో, తన యందు మునుగుట చేతనో లేక ప్రాణవృత్తి నిరోధం వల్లనో మనస్సుచే హృదయమున ప్రవేశించిన, నీవు, ఆత్మ యందు నిలకడ కలవాడవు అగుదువు. 

భగవాన్ రాసిన ఈ శ్లోకంలో అన్ని కాలాల్లో మహర్షులందరి దివ్యబోధలూ ఓ మూసలో కరిగించి పోసినట్లు ఇమిడి వున్నాయి. దాని అర్థం, హృదయకుహర మధ్య గుహలో పరబ్రహ్మ ప్రకాశిస్తూ వుంటారు. అదే ఆత్మ. అంటే, ఆధ్యాత్మిక హృదయమే “ఆత్మ” అని తెలుసుకోవడమే ఆత్మ స్థితి.

నిరంతరం ఆత్మ స్పురణతో వుండి, దాని స్వభావాన్ని పరిశీలించడమే, భగవాన్ సూచించిన సాధనామార్గం. ద్వంద్వా తీతమైన ఆత్మయే ఆయన లక్ష్యం. అందుకే భగవాన్ తరచు అనేవారు, "ఆత్మను విస్మరించి అన్నీ తెలుసుకోవడం అజ్ఞానం, “నేను” అనేది తెలుసుకుంటే, తక్కినవన్నీ పోతాయి.” అని.

“ఆత్మను తెలుసుకునే విధం, ఆత్మగా వుండటం. అదే జ్ఞాని స్థితి. అంటే, బంధ హేతువైన దేహాత్మ బుద్ధిని వీడి, మనసు ఆత్మను గుర్తించడం. ఆ బంధం, “నే నెవడను?” అను విచారణ వల్ల, తొలగి పోతుంది,” అన్నారు.

1917 జూలైలో ఒకరోజున నాయనా, ఇంకా కొంతమంది భక్తులు భగవాన్ దగ్గర కూర్చున్నారు. మాటల్లో నాయన తనకు తెలిసిన సమాచారం చెప్పారు. “నేను “మండసాయం" లో వున్నప్పుడు రామనాథ బ్రహ్మచారి వచ్చి, "హృదయ కుహర మధ్యే...” అను శ్లోక అవతరణ గురించి, జరిగిన సంగతంతా వివరంగా చెప్పారు." అని.

ఆ తర్వాత నాయన ఆ శ్లోకాన్ని ఆధారంగా తీసుకుని గొప్ప వ్యాఖ్య రాశారు. అదే “రమణగీత” భగవాన్ భక్తులకూ, అనుచరులకూ ఇచ్చిన సమాధానాల సారమే రమణ గీత. అది హృదయ విద్య. మనోనిగ్రహం, భక్తి, విచారణ మొదలైన అంశాలతో కూడిని గ్రంథమది. అది ఒక విధమైన యోగశాస్త్రం. సాధకునికి సంశయ నివృత్తి కలిగిస్తుంది. భక్తునికి ఉపశమనం కలిగిస్తుంది. రమణగీతలో నాయన భగవాన్ తత్వాన్ని గొప్పగా వర్ణించారు.  

మనిషంటే “దేహం, మనసు, ఆత్మ" అనే మూడింటి కలయిక, అందు ఆత్మే శక్తి. ఆ శక్తికి దేహం, మనసు ఉపాదులు. చైతన్య వంతమైన, అక్షయమైన, శాశ్వతమైన మార్పు చెందని ఆ శక్తిని తెలుసుకునేందుకు అనేక సాధనా మార్గాలు చెప్పారు. శుద్ధచైతన్యం,
మొదట కాంతిని ప్రసరింప జేసి, ఆపైన అహమింగా రూపొంది, దేహంగా, ప్రపంచంగా విస్తరిల్లుతుంది. అంటే, శుద్ధ చైతన్యవంత మైన ఆత్మనుంచి, చుట్టూ పరిధులు ఏర్పరచుకున్న మరో చైతన్య క్షేత్రం-మనసు, పుడుతుంది. అందుచేత మనసుకీ ఆత్మకి భేదం లేదు. మనసు అంతర్ముఖమైతే, ఆత్మ బహిర్ముఖమైతే, అహం, అవుతుంది. కాని, ఆత్మ లేకుండా మనసు నిలవలేదు.

ఏమీలేని చిదాకాశమైన మూలం నుంచి లేచిన మనసు' మొదట కాంతివలె వుంటుంది. కాని, అది జడమైన దేహంతో కూడి, “ఇది నేను, అది నేను", అంటుంది. అదే దేహాత్మబుద్ధి. అంటే, మనలోని సహజమైన, విచిత్రమైన, శక్తే, మనసు. దాన్నే జీవుడు లేక సూక్ష్మశరీరం లేక అహం అంటారు. ఆ మనసు “ప్రాణ" సహాయంతో దేహానికి కదలికను ఇస్తుంది. తాను చక్రవర్తివలె దేహేంద్రియాల చేత ఇష్టంవచ్చినట్లు పనులు చేయించుకుంటుంది.

మనసు తన సహజమైన, స్వతసిద్ధమైన చాంచల్యం, చాపల్యం, దురాశవల్ల సదా బైట చెడతిరిగి, దేహేంద్రియాల ద్వారా నిరం తరం ఏదో ఒక విషయాన్ని పోగుజేస్తూనే వుంటుంది. ఏదో ఒక సంగతిని గ్రహిస్తూనే వుంటుంది. తత్ఫలితంగా సుఖ దుఃఖాల్ని అనుభవిస్తుంది. అది దాని నిరంతర కర్మ. మనసు లేకపోతే, ఇంద్రియాలు స్వతంత్రంగా పనిచేయలేవు.

మనసు విషయాల్ని గ్రహించే సమయంలో "ఆశ" ప్రవేశిస్తుంది. ఆ ఆశ, బలే తిండిపోతు దాని తిండికి అంతులేదు. అది తిని, తిని, తెగ బలుస్తుంది. అవిద్య, కల్పన, మూఢత్వం వల్ల ఆ ఆశ, బాగా పెరుగుతుంది. ఆ ఆశను క్రోధం, లోభం అనుసరిస్తాయి. ఎంతకీ తృప్తి, సుఖం, శాంతి లేక జీవితాన్ని దుఃఖమయం చేస్తుంది. క్రమంగా మనసు దుష్ట స్వభావం కలదిగా తయారవుతుంది.

మనసు విషయాల్లో తగుల్కొన్నప్పుడు కలుషితం అవుతుంది అది అవిషయిగా వున్నప్పుడు నిర్మలంగా వుంటుంది. మనసు తాను గ్రహించే విషయాలు తనకే కొన్ని హితంగా, కొన్ని అహితంగా వుంటాయి. కొన్ని విషయాల్ని చిత్రంలో దాచుకుంటుంది. ఆ విషయాలే సంస్కారాలు. ఆసంస్కారాలు, క్రమంగా జ్ఞాపకాలుగా బైటికి వస్తాయి. ఆ జ్ఞాపకాలతో సుఖం అనుభవించే వీలు ఒక్క స్వప్నావస్థకే వుంది.
మనసు తన మనుగడ కోసం మేధస్సును ప్రభావితం చేసి, ఆలోచనల్ని పుట్టిస్తుంది. ప్రతి ఆలోచన వెనకా, ఒక సామాన్యమైన ఆలోచన వుంటుంది. అది “నేను” అనే మొదటి ఆలోచన. అన్ని ఆలోచనలకు “నేను” అనే మొదటి ఆలోచనే, మాతృక. అంటే తక్కిన ఆలోచనల్ని ఆ “నేనే" ఉత్పత్తి చేస్తుంది.

మెదడు పనిచేయడం వల్ల మెలకువలో, స్వప్నంలో. ఆలోచ నలు కలుగుతాయి. ఆ రెండు అవస్థల్లోనూ ప్రపంచం వుంది. అంటే, ప్రపంచం ఆలోచనాజనితమన్నమాట! గాఢ నిద్రలో ఆలోచనలు లేవు. ఆలోచనలు లేకపోతే, ప్రపంచమూ లేదు. కనుక నిద్రకీ, మెలకువకి భేదం, తలపు మాత్రమే. అందుచేత ఆలోచనలు సహజమైనవి కావు. సహజమైనవి అయితే, అవి ఒక అవస్థలో వుండి, వేరొక అవస్థలో లేకుండా పోవడానికి వీల్లేదు. అవి అన్ని అవస్థల్లోనూ వుండితీరవలెను.

ఇంద్రియ ప్రవృత్తులు తమస్సులో అణగితే, అది గాఢనిద్ర, వెలుగులో అణగితే, అది సమాధి. సుషుప్తి, అనిచ్ఛాపూర్వరం. కావున అది, విజ్ఞానరహితం. సమాధి ఇచ్చాపూర్వక విజ్ఞాన సహిత యోగం.

అనుభవజ్ఞులు మనసును మూడు భాగాలుగా విభజించారు. ‘మనసు, అహంకారం, బుద్ధి' అని. అందు మనసు ఆలోచనామయం,
అహంకారం, సర్వాధికారియై ఆలోచనల్ని అదుపులో పెట్టి, తన ఇష్టం వచ్చినట్లు దేహాన్ని ఉపయోగించు కుంటుంది. బుద్ధికి ఒక గొప్ప గుణం వుంది. అది వివేకంతో చూడ్డం, అహంకారాన్ని అణచి, శాంతపరచడం.

మొదటి ఆలోచన అయిన “నేను”కి, ఒక కేంద్రం వుంది, అది హృదయం. అది రొమ్ముకు మధ్య నున్న “అనాహత చక్రం" కాదు. రక్త ప్రసరణ చేసే గుండెకాదు. అది అసలు భౌతికమే కాదు. అది ఆధ్యాత్మిక హృదయం.

సకల వృత్తులకూ మూలం “నేను” అను వృత్తి. ఆ “నేను” ఎందుండి బయలు దేరునో, ఆ చోటే హృదయస్థానం. అది చాలా పే ముఖ్యమైన కేంద్రం. అదే ఆత్మ. దాన్నించి శక్తీ, కాంతి ప్రసారమై, మెదడుపై పడి, ప్రకాశించి, అద్భుతంగా పని చేస్తుంది. ఆ హృద యంలో- సూక్ష్మ రూపంలో వున్న వాసనలు మెదడులోకి వెళ్ళగా, ప్రతి దశలోనూ మెదడు వాటిని విస్తృత పరుస్తుంది. అంచేత హృదయాన్ని దేహమంతటిగానూ, విశ్వమంతటిగానూ చెప్పవచ్చు. కాని, సాధకునికి సహాయం చేసే నిమిత్తం, హృదయానికో నిర్ణీత మైన చోటు చూపుతారు.

మన సందేహమంతా హృదయం భౌతికమని. హృదయ మంటే, నాలుగు అరలతో కూడిన రక్తప్రసరణ జరిగే మాంసకోశం కాదు. “నేను” అను స్ఫురణ ఎందుండి వెడలునో, అదే హృదయ స్థానమనీ, వేదాలు చెపుతున్నాయి. ఆ స్ఫురణ మాంస పేటిక నుంచి వస్తుందా?

హృదయం, దేహం కాదు. దేహం జడం. ఆత్మ, స్వయం ప్రకాశం, చైతన్యవంతం. అది చైతన్య స్థానమే కాదు, సాక్షాత్తూ చైతన్యం. అది శరీరమంతటా వ్యాపించి వుండటం చేత, అనుభవాలు కలుగుతున్నాయి. ఆ ఆత్మ చైతన్యంతో, జడదేహం కూడా కదులుతుంది. ఆ ఆత్మజ్యోతి వుండేచోట, హృదయస్థానం. పంచభూతాలతో నిర్మితమైన దేహాన్ని ఆశ్రయించిన ఆత్మస్థానం. హృదయ కుహరమధ్యం. ఆత్మ రూపమే, హృదయం.

మనలోనే ఎక్కడో హృదయస్థానం వుంది. కాని, అది రొమ్ముకు ఎడమవైపున వుండే రక్తప్రసరణ గుండె కాదని గుర్తించాలి. యోగశాస్త్రంలో చెప్పబడే చక్రాల్లో ఒకటి కాదు, హృదయం. కాని, ఆ హృదయమే కేంద్రం. అదే అన్నింటికీ మూలం. ఉపనిషత్తులు దాన్నే “బ్రహ్మం” అంటాయి. హృదయం కంటే, ఈశ్వరుడు వేరు కాదు. మన అవగాహనకు వీలుగా, హృత్పద్మంలో దైవం వుంటాడంటారు. అంటే, అర్థం “లోన చూడు” అని. ఆ హృదయంలో దేహం - లోకం. సమస్త విశ్వం వుంది. దాన్నించి ఏదీ భిన్నంగా లేదు. అందుచేత అదే కేంద్రం. అక్కడ నుంచే అన్ని వెలువడతాయి.

సకల వృత్తులూ, వ్యాపారాలు ఎచ్చట నుండి బయలుదేరునో, అదే హృదయం. దానికి ఆకార వర్ణన, కేవలం భావన. సకల వృత్తులకూ మూలం “నేను”. ఆ "నేను" ఎక్కడ నుండి బయలు దేరుతుందో, అదే హృదయం.

చంద్రునికి తేజస్సును, సూర్యుడు ఇచ్చునట్లు, మనసుకు హృదయం వెలుతురు ఇస్తుంది. అందుచేత హృదయం యొక్క పరోక్షంలో మనసును మాత్రం చూస్తున్నాడు మనిషి. '

వేదాల్లో హృదయాన్ని "అధోముఖ పద్మకోశ ప్రకాశం" అని వర్ణించారు. అంటే, క్రిందు ముఖమైన తామర మొగ్గవలె వుంటుందని అర్థం. అలాగే "కదళీ ముకుళం" అని` కూడా అంటారు. అంటే; అరటిపువ్వువలె క్రిందు ముఖమై వుంటుందని అర్థం.

ఒకసారి భగవాన్ ఒక భక్తునితో, “హృదయం, ఆది మునుల, యోగుల, ఋషుల అనుభవసారం. అది రొమ్ముకు కుడివైపున రెండు అంగుళాల దూరంలో వుంది. ఆ సంగతి మలయాళ ఆయుర్వేద గ్రంథంలో చూశాను. అక్కడే అహం కలిసేది. ఆ హృదయాన్నే ఆత్మ” అని కూడా అంటారు. రక్తప్రసరణ గుండెకీ, దానికి ఏమీ సంబంధం లేదు. అది వ్యక్తిత్వపుసారం. దానివల్లే మనిషి నిద్రపోతున్నాడో, మేల్కొన్నాడో, సమాధి స్థితిలో వున్నాడో “తెలుస్తుంది. ఈ సంగతి అంతరజ్ఞానం కలవారందరికీ తెలుస్తుంది. దాన్ని అందరూ తెలుసుకోవచ్చు. తెలుసుకోగలరు. దాని స్థానం తెలుస్తుంది గాని, దాని గురించి తెలిసేది జ్ఞాని ఒక్కరికే. ఆ హృదయ స్పందనమే, వారి చైతన్యం” అన్నారు. 

No comments:

Post a Comment