🥀గురువుగారు పెట్టిన పరీక్ష🥀
అంగీరస అనే ఒక ఋషి అడవిలో ఉండేవారు. ఆయనకి చాలా మంది శిష్యులు.
శిష్యులు అందరూ గురువుగారి జ్ఞానం వల్ల, ప్రయోజనం పొందారు. వారిలో కొంత మంది శిష్యులు, గురువుగారు చెప్పిన మాట పాటిస్తూ , అన్ని విషయాలు తొందరగా నేర్చుకునే వాళ్లు. వీళ్లు మిగతా శిష్యుల దగ్గర నుంచి ఆదరణ పొందేవాళ్ళు.
కొంత మందబుద్ధి గల శిష్యులకి, ఈ భక్తి గల శిష్యులని చూసి అసూయ కలిగింది.
వారి జాడ్యానికి కేవలం వాళ్లే కారణమూ అని, మందబుద్ధి గల శిష్యులకి తెలియలేదు. గురువుగారు, ఈ భక్తి గల వాళ్ళకి ప్రత్యేకంగా జ్ఞానము బోధిస్తున్నారా అని సందేహ పడ్డారు.
ఒక రోజు మందబుద్ధి గల శిష్యులు ఇలా అన్నారు “గురువుగారు, మీరు మాకు అన్యాయము చేస్తున్నారు అని అనిపిస్తోంది. మీ జ్ఞానము అంతా భక్తి గల శిష్యులకి ఇస్తున్నారు. అదే జ్ఞానము మాకు కూడా బోధించ వచ్చు కదా “,అని ప్రశ్నించారు!
దానికి గురువుగారు నిదానంగా సమాధానం ఇచ్చారు “నేను అందరినీ సమానంగానే చూస్తాను. నాకు ఎవ్వరి మీద ప్రత్యేక అభిప్రాయము లేదు. మీలో ఎవరైనా తొందరగా నేర్చుకున్నారు అంటే, అది కేవలం, నా మాట మీద నమ్మకము, మీ యొక్క సొంత ప్రయత్నమూ ” అని స్పష్టంగా తెలియ పరచారు.
కానీ మందబుద్ధి గల శిష్యులకి, నమ్మకము కలగలేదు.
అప్పుడు గురువుగారు ఇలా అన్నారు ” మీకు ఒక చిన్న పరీక్ష పెడతాను. మీరు తరుచు వెళ్లే గ్రామానికి వెళ్లి ఒక మంచి వాడిని తీసుకుని రండి “.
మందబుద్ధి గల శిష్యులు ఆనందంతో, ‘ ఇంత సులభమైన పరీక్షకి, జ్ఞానము బహుమామా !” అని ఆనందించారు. వాళ్లలో ఒకడు ఉషారుగా బయలుదేరాడు, కానీ అతనికి మంచి వాడు ఎవ్వరు దొరకలేదు. ఎంతో వెతికాక, నిరుత్సాహంతో గురువుగారి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, “ఈ ఉరిలో మంచి వాడు ఒక్కడు లేడని చాలా బాధగా ఉంది. అందరూ ఏదో ఒక పాపం చేసిన వాళ్లే. ఈ ఊరిలో అందరూ తప్పు చేసిన వాళ్లే” అని చెప్పాడు.
దానికి గురువుగారు “ఓ అలాగా !!” మీకు ఎవరి పట్ల అయితే అసూయ కలిగిందో వాళ్ళని పంపిద్దాము. అని అన్నారు.
భక్తి గల శిష్యులలో ఒక్కడిని పిలిచారు. ఈ గ్రామంలోకి వెళ్లి ఒక్క చెడ్డ వాడిని తీసుకుని రమ్మన్నారు. మీ అశీస్సులతో ప్రయత్నిస్తాను అన్నాడు.
శిష్యుడు తిరిగి వచ్చి “గురువుగారు నాకు ఎవ్వరూ చెడ్డ వాడు దొరకలేదు, నన్ను క్షమించండి ” అన్నాడు. గురువుగారి అనుమతి తీసుకుని అతను అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
అప్పుడు గురువుగారు “శిష్యులారా, ఎప్పుడైతే మీరు అన్నిటిలోను మంచి చూస్తారో , అప్పుడు మీలో జ్ఞానము వికసిస్తుంది” ఎప్పుడైతే అన్నిటిలోను తప్పు చూస్తామో మనలో ఉన్న జ్ఞానము క్షీణించుకు పోతుంది”
నీతి: ప్రపంచంలో మంచి,చెడు రెండూ ఉంటాయి.
ఏ విషయమైనా మంచి అభిప్రాయము తో చూస్తే, మనిషి బాగా ఎదుగుతాడు.
తప్పు అభిప్రాయము తో చూస్తే, మనిషి ఎదుగుదల తగ్గిపోతుంది.
గురువుగారికి అందరూ సమానమే .
నిజ జీవితం లో కష్టాలని ఎలా ఎదురుకోవాలో ఈ కథ చెప్తోంది
No comments:
Post a Comment