పరిపూర్ణంగా అనుభవించండి
ఆలోచన ఉంటుంది.
అది లేకుండా పోవడం అంటూ ఏమీ ఉండదు.
నీవే ఆలోచన...
ఆలోచన లేకుంటే నీవే ఉండవు.
"ఆలోచనారాహిత్యస్థితి"ని కోరడం అంటే,
తన మరణాన్ని తాను కోరి తెచ్చుకోవడమే.
ఆత్మానందాన్ని రుచి చూడడం..
సైనేడ్ రుచి చూడడం...
రెండూ ఒకటే.
అక్కడ ఆలోచన పోతుంది...
ఇక్కడ శరీరం పోతుంది.
రెండింటిలోనూ నీవుండవు...
నీవే లేకుండా పోయినప్పుడు...
ఆత్మానందం ఎంత గొప్పదైతే ఏమి?
దాని కోసం జీవితాన్ని త్యాగం చేయడమేమి?
నీవు పోయాక కోటిరూపాయిలు ఇస్తాం...
అన్న insurance Policy లాంటిది...
ఇదంతా సిల్లీ...
"నేను లేని" అనుభవం కాకుండా...
"నేను ఉండి" అనుభవించాలి అనుకుంటే,
ఆ ఏర్పాటే "ఆలోచన".
ఆలోచనే ప్రపంచం.
ప్రపంచం అనేది పోపులపెట్టె....
ప్రతి గిన్నెలోని పదార్థాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగిస్తాం...
అలాగే ఇక్కడున్న అనుభవాలన్నింటినీ...
అందరూ...అంటే సాధారణవ్యక్తి నుంచి...
మహనీయుడు అనబడే వాని వరకు...
ప్రతి ఒక్కడూ ప్రతి ఒక్కటీ అనుభవించి తీరవలసిందే...
ఈ విషయంలో ఎవడూ అతీతుడు కాడు...
వేంకటరామను మరణభయంలో నుంచే కదా
భయరాహిత్యస్థితికి చేరుకుని ఋషి అయ్యారు...
ఆ ఋషిత్వాన్ని పొందటానికి భయం అనేది బీజం అయ్యింది కదా...
భయంలో నుంచే భయరాహిత్యస్థితి కలుగుతుంది.
పిరికితనంలోనుంచే ధైర్యం కలుగుతుంది.
స్వర్గానికి దారి నరకం నుంచే...
మోక్షానికి దారి బంధం నుంచే...
పిరికితనమో, భయమో...
ఏ అనుభవం కలిగినా దాన్ని భగవత్ ప్రసాదంగా స్వీకరించండి...
పరిపూర్ణంగా అనుభవించండి...
అదే "పరిపూర్ణత"కు దారి అవుతుంది...
* * *
రామకృష్ణులు అన్నట్లు...
ప్రపంచంలో గడపడమంటే...
పనసపండును వలవడమే...
"భగవద్విశ్వాసము" అనే నూనెను చేతులకు రాసుకుంటే...
ప్రపంచవిషయాలను అంటకుండా...
ఈ జీవితాన్ని దాటగలం...
అంతేగానీ...
దేన్నీ లేకుండా చేయలేం...
నీ ఇష్టదైవంతో నిరంతరం సహవాసం చేయి...
తప్పొప్పులు నీ నెత్తిన వేసుకోవద్దు...
ప్రతీది భగవదిచ్ఛను అనుసరించే జరుగుతోంది...
అన్న ధీమాతో జీవించు...
* * *
పరమాత్మ ఒడిలో నిర్భయంగా ఉంటూ...
కేరింతలు కొట్టండి...
No comments:
Post a Comment