Thursday, August 18, 2022

ప్రేమకు ప్రతిరూపాలు రాధాకృష్ణులు

 ప్రేమకు ప్రతిరూపాలు

చరిత్రలో రాధాకృష్ణులను  ప్రేమకు ప్రతిరూపంగా చెబుతారు. వారి ప్రేమకు పవిత్రమైన గౌరవం దక్కుతుంది. చిన్నతనంలో అంటే, ఎనిమిదేళ్ల వయసులో ఉండగానే కృష్ణుడు , రాధ ప్రేమలో పడతాడు. అప్పటి నుండీ, ఆమెను అమితంగా ఆరాధిస్తాడు కృష్ణుడు.  అయితే, వీరి ప్రేమ గురించి ఎన్నో గాధలు విన్న మనం, ఎక్కడా మనం రాధా కృష్ణుల పెళ్లి ప్రస్థావన మాత్రం వినలేదు, అసలు కృష్ణుడి జీవితంలో రాధ ఏమైంది అనే విషయం చాలామందికి తెలియదు, రేపల్లెలో ఉన్నంతవరకూ కృష్ణుడు – రాధను ప్రేమించాడు కదా, ఆ తర్వాత రాధ ఏమైంది. రుక్మిణీ, సత్యభామలతో పాటు, 16 వేల మంది గోపికలను సైతం కృష్ణుడు పెళ్లి చేసుకున్నాడంటారే. అందులో రాధ ప్రస్థావన ఎక్కడా లేదు. కృష్ణుడి భార్యల్లో రాధది ఎన్నో స్థానం అనేది  అసలు రాధా కృష్ణుల ప్రేమ వ్యవహారం ఏమైందో అనేది తెలుసుకుందాం...

చిన్నతనం నుండీ రాధా కృష్ణులు కలిసి పెరిగారు. బృందావనం మొత్తం వీరి ప్రేమ పలుకులు పలుకుతూనే ఉంటుంది. అక్కడి గాలిలో వీరి ప్రేమ గీతాలు తీయని సంగీతంలా వినిపిస్తుంటాయి. అక్కడ పారే ఏరులు రాధాకృష్ణుల రాగాలే పల్లవులుగా పాడుతూ పారాడుతుంటాయి. మనుషులు వేరైనా ఆత్మ ఒక్కటే అనేంతలా వీరిద్దరూ కలిసిపోయారు.  బృందావనంలోని గోపికలందరూ కృష్ణుడిని అమితంగా ఇష్టపడతారు. కానీ, వారందరిలో ప్రేమ కన్నా, రాధ ప్రేమ భిన్నమైనది. అందుకే ఆమె ప్రేమ పట్ల అంతగా ఆకర్షితుడయ్యాడు కృష్ణుడు. మరి అలాంటి రాధా కృష్ణులు, ఎందుకు విడిపోవాల్సి వచ్చిందంటే
యుక్త వయసు రాగానే, మేనమామ కంసుడిని వధించే క్రమంలో తన విధి విధానాలను అమలు చేసేందుకు ద్వారకకు బయలుదేరతాడు  కృష్ణుడు. ఆ సమయంలో తనను కూడా పెళ్లి చేసుకుని వెంట తీసుకెళ్లమని ప్రార్ధిస్తుంది రాధ. కానీ, కృష్ణుడు అలా చేయలేదు. ద్వారకకు వెళ్లిన కృష్ణుడు తన మేనమామను సంహరించడం, రుక్మిణీ సత్యభామలను వివాహం చేసుకుని, అక్కడే రాజ్యానికి రాజుగా స్థిరపడిపోయాడు. ఆ క్రమంలో రాధను మరచిపోయాడంటారు. కానీ, రాధ మాత్రం అక్కడే బృందావనంలో ఒంటరిగా  కృష్ణుడిని తలచుకుంటూ ఉండిపోయింది. అసలు రాధను కృష్ణుడు ఎందుకు విడిచిపెట్టేశాడంటే, అందుకు కారణం లేకపోలేదు. రాధను  విడిచి వస్తున్నప్పుడే కృష్ణుడు చెప్పాడు.. ఇద్దరు వేర్వేరు ఆత్మలకు బంధం కావాలి. ప్రేమతో కలిసిన  రెండు మనసులు కలసే ఉండాలంటే, వారు పెళ్లి చేసుకోవాలి.  కానీ, రెండు వేర్వేరు శరీరాలు.. ఒకే ఆత్మగా ఉన్న మనం ఎలా పెళ్లి చేసుకోవాలి అని ప్రశ్నించాడు. అప్పుడు అర్ధమైంది రాధకు. తాను ఎప్పుడో కృష్ణుడిలో ఐక్యమైందని. తనను కృష్ణుడి నుండి వేరు చేయడం, వేరు కావడం అనే ప్రశ్నే లేదని.  అందుకే రాధా కృష్ణుల ప్రేమ పూర్తిగా భిన్నమైనది. వారు ఒకరి కోసం ఒకరు కాదు. ఇద్దరూ ఒక్కటే. అందుకే వారి ప్రేమకు చరిత్రలో అంత గొప్ప స్థానం ఉంది. అదీ రాధా కృష్ణుల అపూర్వ ప్రేమ గాధ.

ఓం నమో నారాయణాయ

No comments:

Post a Comment