*అజ్ఞానదృష్టి*
✍️ శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి వారు.
🙏🌺🌺🌺🌺🌻🌻🌺🌺🌺🌺🙏
ఈ సృష్టిలో అందరూ సమానులే. కొందరు గొప్పవారనీ మరికొందరు అల్పులనే భావం అజ్ఞానం వలన మాత్రమే కలుగుతుంది.
ఆత్మజ్ఞానం గలవారికి భేద దృష్టి వుండదు. వారు భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడగలుగుతారు. అందరూ భగవత్ స్వరూపులుగానే కనిపిస్తారు.
భక్తతుకారాం ఊరూరా తిరుగుతూ భక్తికీర్తనలు పాడుతూ ఆధ్యాత్మిక ప్రచారం చేస్తుంటాడు. ఒక వూళ్ళో ఈ విధంగా ఒక రాత్రి భక్తి పారవశ్యంతో కీర్తనలు పాడుతూ సమయాన్ని మరచిపోతాడు. ప్రేక్షకులు ఒక్కొక్కరే లేచి వెళ్ళి పోతుంటారు. మరుసటి సూర్యోదయం వరకూ ఆయన భక్తి కీర్తనలలో లీనమైపోయాడు. ఆ పారవశ్యంలో ఆయనకు భగవత్ సాక్షాత్కారం కలిగింది.
ఉదయం కళ్ళు తెరచి చూసేటప్పటికే ప్రాంగణమంతా ఖాళీ అవ్వగా ఒకే ఒక వ్యక్తి కూర్చుని వున్నాడు. అతని భక్తి చింతనకు తుకారాం ఎంతగానో సంతో షించాడు. నీకుకూడా భగవత్ సాక్షాత్కారం కలిగిందా అని ప్రశ్నించాడు.
“లేదుస్వామీ! మీరు కూచున్న చాప నాది. తీసుకెళ్ళిపోదామని ఇప్పటిదాకా కూచున్నాను" అన్నాడు. అంటే ఇతగాడి దృష్టి ప్రాపంచిక విషయమైన చాపమీద వుంది తప్ప దేవుడిమీద లేదన్నమాట. జ్ఞానదృష్టి లేకపోవడమంటే అదే.
బుద్ధికి నిలకడ శక్తి వుంటుంది. మనసుకు లేదు. చంచల స్వభావం కలిగిన మనసును అదుపుచెయ్యాలి.
అందుకే రథసారథి బుద్ధి కాగా మనసు యజమాని. యజమాని రథంలో కూచుంటాడు. యజమానికన్న సారథి పాత్ర మిన్న. బండి గమ్యం చేరాలంటే సారథి చేతులలోనే వుంటుంది. ప్రయాణీకుడు నిమిత్తమాత్రుడు.
అందుకే గీతాచార్యుడైన శ్రీకృష్ణపరమాత్ముడు రథసారథ్యాన్ని చేపట్టి అర్జునుణ్ణి రథంలో కూచోమంటాడు.
ఈ బ్రహ్మాండంలో కోట్లాది జీవరాశులున్నాయి. మనమంతా రంగుల రాట్నంలోవున్నాం. మనం నిమిత్తమాత్రులం. చక్రం తిప్పే నాథుడు వేరెవరూలేడు. అతడే జగన్నాథుడు. జగన్నాటక సూత్రధారి. ఆయనపై సంపూర్ణ విశ్వాసము ఉంచి మన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించినట్లయితే ఈ జీవితమనే రంగుల రాట్నం సుఖమయంగా సాగిపోతుంది.
అలా కాకుండా చంచల మనస్సుతో వ్యవహరించినట్లయితే కళ్ళు తిరుగుతాయి. అప్పుడైనా చక్రపాణిని మనం ఆశ్రయించవలసిందే.
గతాన్ని గురించి చింతించవద్దు. అసలు ఆవేదన, ఆందోళనలను దరిజేరనీయవద్దు. జీవితాన్ని ఆనందమయంగా మలచుకోవడానికి ఆ శ్రీకృష్ణపరమాత్ముడి ఆశీస్సులు మనకు ఎప్పుడూ వుంటాయి. అర్జునుడి మాదిరిగా మనం ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో ధర్మాన్ని నిర్వర్తించవలసివుంది.
*లోకాస్సమస్తా సుఖినోభవంతు*
🙏🌺🌺🌺🌺🌻🌻🌺🌺🌺🌺🙏
No comments:
Post a Comment