కర్మ - ఖర్మ
తలరాతని తప్పించుకోలేమా?
అసలు తలరాత అంటే ఏమిటీ?
ఆయుష్షు తీరో, జవసత్వాలుడిగో నశించిపోయిన భౌతిక శరీరాలు వారసత్వం భరించలేక మరోశరీరానికి కర్మల్ని బదిలీచేస్తాయి. శరీరాలు నశించిన కర్మశేషాలు నశించవు. వెన్నంటే వస్తాయి, వెంటాడుతునే ఉంటాయి. ఆ కర్మశేషాలనుభవించడానికి మరల మరల జన్మించడం.
మనకి ఆ కర్మశేషాలు గుర్తుండక పోవచ్చు కానీ, మరిచిపోయినంత మాత్రాన మనవి కాకుండా పోవు. ఇదే విధి లేదా తలరాత లేదా లలాటలిఖితం.
కర్మలకు మరణం లేదు. మనిషి మరణించినా కర్మలు మరోజన్మకు పయనిస్తాయి. గతజన్మ కర్మలు కంటికి కనిపించవు. కానీ, ఈ జన్మలో అనుభూతమౌతాయి. పూర్వజన్మల కర్మబీజ ఫలాలే విధిరాతలు. గతజన్మల కర్మలశేషఫలంకు అంటే విధికి , నేటి కర్మల ఫలితంకు అనుసంధానింపబడి సాగుతుంది ఈజన్మ జీవనయానం.
సాధారణంగా కష్టకాలంలో లేదా దుఃఖ సమయంలో గాని, అనుకునేరీతిలో జీవనం సాగనప్పుడు, అనుకోని అవాంతరాలప్పుడు అనిపిస్తుంటుంది - ఇదంతా మన తలరాత అని. మనచేతిలో ఏదీలేదు, తలరాత ఎలా వుందో అలా జరుగుతుంది, తప్పించుకోలేమని భావిస్తాం. ఇదో నిరాశావాదం. ప్రారబ్ధమే మనిషిని నడిపిస్తే, అంతా విధిరాత ప్రకారమే జరిగితే ఇక మనిషి చేయాల్సింది ఏమీ లేదా? విధి చేతిలో మనం కీలుబొమ్మలమైతే ఇక మనం చేయగలిగింది ఏముందీ? ఇది నా తలరాత అని అనుకున్నంతకాలం ఆవేదన తప్పదు, నిరాశ వీడదు.
జన్మించిన ప్రతీజీవి విధికి తలవొగ్గక తప్పదు. కానీ, ప్రతిఒక్కరికి విధిని ఎదిరించేశక్తి వుంది. విధి బలీయమైనదే కావొచ్చు... కానీ, దానిని మార్చుకోవచ్చు... వజ్ర సంకల్పంతో, నిరంతర సాధనతో, అకుంఠిత భక్తితో. ఇందుకు ఉదాహరణంగా కొన్ని గాధలు గుర్తుచేసుకుందాం -
విధిరీత్యా అల్పాయుష్కుడైన సత్యవంతుని వివాహమాడి, తన ఆత్మ విశ్వాసంతో, వజ్ర సంకల్పంతో యముణ్ణి ఎదిరించి తన భర్తను బ్రతికించుకున్న సావిత్రి - సత్యవంతుల కధ మనందరికీ విధితమే.
పదహారు ఏళ్ళు మాత్రమే ఆయుష్షు ఉన్న మార్కండేయుడు తన అకుంఠితభక్తితో యముణ్ణి జయించి, శివుని ఆశిస్సులతో చిరంజీవత్వాన్ని పొందలేదా?
చదువునందు రాణించలేక, తను చెప్పింది అవగాహన చేసుకోలేకపోతున్న శిష్యుని హస్త సాముద్రికాన్ని పరిశీలించి, నాయనా! నీకు విద్యారేఖ లేదు, చదువుకునే యోగం లేదు, కాబట్టి నీవు తిరిగి నీ ఇంటికి వెళ్లి, తగిన వృత్తిని స్వీకరించడం మంచిదని చెప్పిన గురువుగారి మాటలకు మనస్సు భారమై, ఇంటికి బయలుదేరి, మార్గమధ్యంలో దప్పికై, ఓ రాతిగిలక బావి దగ్గర ఆగి, దాహం తీర్చుకుంటూ, తాడు ఒరిపిడికి అరిగిన ఆ రాతిగిలకను చూసి, బలహీనమైన తాడువల్ల రాయే అరగగా, నేను సాధనతో విద్యను ఆర్జించలేనా అన్న దృఢ నిశ్చయంకు వచ్చి, పదునైన రాతిముక్కతో చేతిపై విద్యారేఖను గీరుకోని, తిరిగి గురువు చెంతకు వెళ్ళి, నిరంతర సాధనతో అనతికాలంలోనే విద్యను అభ్యసించి, సంస్కృత వ్యాకరణం వ్రాసిన పాణిని దృఢ సంకల్పం తన రాతను మార్చలేదా?
చిన్నప్పుడు మా అమ్మమ్మగారింటికి వెళ్ళినప్పుడు, అమ్మ, మా మేనమామగారు కష్టసుఖాలు చెప్పుకునేవారు. ఒకోసారి అమ్మ - మన తలరాతలిలా ఏడ్చయిరా అన్నప్పుడు, చేసుకునేవారికి చేసుకున్నంత అక్కాయ్ ... అయినా కష్టాలు మంచికే, అన్నీ తెలుసుకోవచ్చు, అయినవారు ఎవరో, కానివారు ఎవరో తెలుసుకోగలుగుతాం. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అనుభవించక తప్పదని తెలిసి మంచిగా బ్రతకాలని చూస్తాం. ఎప్పుడు కంటే దేవుణ్ణి ఎక్కువ తలుస్తాం, కష్టం గట్టెక్కాక దేవునిదయవలన బయటపడ్డామని తెలుసుకొని, ఎల్లవేళలా దేవుణ్ణి నమ్మండని పిల్లలకు మంచి చెడు చెపుతాం. అన్నీ మన మంచికేనే ... అనేవారు.
అందరం ఒకటి గుర్తుంచుకోవాలి - మనం ఏ కర్మ చేసినా దాని ఫలం అనుభవించటం నిశ్చయం. విధిరాతలు స్వయంకృతం. స్వీయకర్మలే మన విధిరాతలు. అంటే మన విధిరాత విధాతలం మనమే. గతజన్మల కర్మశేషాలే నేటి విధిరాతలయినట్లు, నేటి కర్మలే మరుజన్మ విధిరాతలు. కర్మలు చేయడం అనివార్యం. ఆ కర్మలలో కొన్ని ప్రారబ్దాలుగా మూటకట్టుకోవడం నిజం. అవి అనుభవించడానికి జన్మించడం తప్పదు. ఇలా పుట్టడం ... గిట్టడం ... తప్పదా ఈ చక్రపరిభ్రమణం ... రాదా ముక్తి?
వస్తుంది ... ఎప్పుడు? గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్లు... 'స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విన్దతి మానవః'
ఈశ్వరార్పణ బుద్ధితో, భగవత్ కైంకర్యబుద్ధితో కర్మలు చేస్తే జ్ఞాన మోక్ష సిద్ధులు ప్రాప్తమౌతాయి.
బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః
లిప్యతే న స పాపేన పద్మపత్ర మివామ్బసా
ఎవరు కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి, ఆసక్తి లేకుండా తన కర్మలు ఆచరిస్తారో, అటువంటి వారు నీటిచే అంటబడని తామరాకు వలె పాప ఫలితంచే ప్రభావితులు కారు.
ప్రతీ ఒకరు చింత చింతన వీడి సానుకూల దృక్పధం ఏర్పరుచుకోవాలి.
ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసం కలిగి ఉండాలి.
సానుకూల భావం సాధనా సోపానం.
సంకల్పం దృఢమైతే సాఫల్యం సమక్షంలోనే.
No comments:
Post a Comment