*జగమే మాయ...*
'మాయ' అంటే సత్యాన్ని తెలుసుకోలేకపోవడం. అనిత్యాన్ని అర్థం చేసుకోలేకపోవడం. ఈ లోకంలో నిత్యాలు- అనిత్యాలు, సత్యాలు- అసత్యాలు, స్థిరాలు- అస్థిరాలు అని ఉంటాయి. వాటి మధ్య తేడా తెలుసుకొని, అస్థిరమైనవాటి ప్రలోభాలకు లోనుగాకుండా, అవన్నీ మాయ అనీ, మాయ కానివన్నీ మాధవుడికి చెందినవనీ గమనించి, జీవనయానం చెయ్యడమే మన పరమావధి అని గ్రహిస్తే చాలు- ముముక్షతకు సుముఖులమైనట్లే.
సృష్టికర్త మాయాతీతుడు, ఆయన లీలలు ఎవరికీ తెలియతరం కావు. సృష్టి మొదలైనప్పటినుంచే 'మాయ' పుట్టింది. నేను 'దేహాన్ని' అని భావించడమే మాయ. ఎందుకంటే ఆ దేహం ఎప్పుడు పుడుతుందో, ఎలా పుడుతుందో, ఎప్పుడు అంతమవుతుందో తెలీదు. ఇదే అజ్ఞానం. ఈ అజ్ఞానం మనలో ఉన్నంతవరకు మాయఉండే తీరుతుంది. ఈ అజ్ఞానపు తెరనే అన్యాపదేశంగా నాదబ్రహ్మ త్యాగరాజు తిరుపతి సందర్శించినప్పుడు స్వామివారి దర్శనం లభించక ఆవేదన చెందుతూ, ఆర్తితో 'తెరతీయగ రాదా' అంటూ గానం చేశారు. ఈ అజ్ఞానమనే తెర తొలగినప్పుడు ఆత్మ దర్శనమవుతుంది. ఆత్మతత్వం బోధపడుతుంది. అదే పరమాత్మ సందర్శనానికి సులభతర సాధనమవుతుంది. ఈ మాయను వదిలించుకోవాలన్నా, దైవానుగ్రహం కావలసిందే. సత్సంగం చేయవలసిందే. నామస్మరణ చేయవలసిందే. శాస్త్ర-వేద-పురాణాల అధ్యయనం చేయవలసిందే! ఈ మాయ అన్ని యుగాల్లోనివారినీ వలలో పడేసింది. వ్యామోహితుల్ని చేసింది. అపకీర్తి పాలు చేసింది. అనేక విధాల అష్టకష్టాలపాలు చేసింది.
శుక్రాచార్యులు హెచ్చరించినా వినని బలిచక్రవర్తి విష్ణువంతటివాడే (వామనావతారంలో) తనను దానమడిగాడని, యశోపలోభితుడై మూడడుగుల దానం ఇవ్వబోయి అధఃపాతాళానికి పోయాడు. ఇది మాయా ప్రభావమే. వనవాసంలో సీతాదేవి బంగారులేడిని చూసి, దాని వ్యామోహంలో పడి శ్రీరామచంద్రుడికి దూరం కావడం మాయవల్లనే కదా! ద్యూతమాయకు వశుడై ధర్మరాజు అడవులపాలు కావడం మనకు తెలిసిందే. విశ్వామిత్రుడు మోహమాయలో పడిపోయి మేనకను చేపట్టి వేల సంవత్సరాల తపోఫలాన్ని నష్టపోయాడు. ఇలా ఎందరెందరినో మాయ కష్టపెట్టింది.
సంసారం మాయ అంటాడో విరాగి. దేవుడే మాయ అంటాడో నాస్తికుడు. మనకు తెలీకుండా మన కళ్లెదుటే జరుగుతున్నది మాయంటాడో మేధావి. భగవంతుడు కల్పించే పరీక్షాకాలమే 'మాయ' కనుక దాన్ని జయిస్తే మాయను జయించినట్లే అంటారు సాధకులు, భక్తులు. సర్వ కర్మలు భగవదర్పితం చేస్తున్నప్పుడు మాయను గురించి ఆందోళన ఉండదు. భగవంతుడి శరణు కోరినవాడిని ఏ మాయా అంటదు. గీతాతాత్పర్యమూ ఇదే చెబుతున్నది.
పరమాత్మ ఒక్కడేననీ, అతడి వినోదమే మాయ అనీ, ఆ మాయ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు, ఓషధుల నుంచి ఆహారం ఉద్భవించినట్లు 'తైత్తరీయోపనిషత్' చెబుతోంది. ఈ మాయ తాలూకు దుష్ప్రభావాన్ని ప్రధానంగా కలియుగ మానవుడు గ్రహించి తీరాలి. ధర్మాన్ని, నీతిని, న్యాయాన్ని, గాలికి వదిలేసి అక్రమంగా, అత్యాశాపరుడై పరుల్ని దోచుకుని కూడబెట్టే సంపదనంతా రేపు తాను అనుభవించగలడా? పోనీ, తనవాళ్లయినా శాశ్వతంగా అనుభవించి సుఖశాంతులు పొందగలరని కచ్చి తంగా చెప్పగలడా? అందుకు హామీ ఇవ్వగలడా? లేదు. పోయేనాడు తనవెంట ఏదీ రాదనీ తెలుసు. మరి, ఎందుకీ అధర్మ మార్గానుసరణ? ఈ అశాశ్వతమైన మాయాజాలంలో చిక్కుకుపోవడం దేనికి? కారణం అజ్ఞానం, అహంకారం. వీటన్నింటికీ జన్మస్థలం మనసు. దాన్ని నియంత్రించుకోగలిగితే చాలు, సకలం కరతలామలకమైనట్లే! బుద్ధిని సద్వినియోగపరచుకోగలిగితే చాలు, సిద్ధి పొందినట్లే!
గర్విష్ఠుడైన ఒకరాజు కళ్లు తెరిపించేందుకు ఓ సన్యాసి, రాజాస్థానానికొచ్చాడు. సన్యాసి జ్ఞానబోధల్ని ఏమీ వినిపించుకోకుండా, తనకంతా తెలుసునన్న నిర్లక్ష్యంతో, తన గొప్పతనం చెప్పుకోవడం కోసం- స్వామీ! మీకేం కావాలో కోరుకోండి, ఇస్తాను' అన్నాడు దర్పంగా రాజు. 'నీ సొంతమైనదేదైనా ఉంటే అదివ్వు' అన్నాడు సన్యాసి. 'ఈ కోశాగారం, అశ్వశాల, గోశాల, ఈ రాజ్యం, అన్నీ నా సొంతమే. ఏదైనా అడగండి ఇస్తా'నన్నాడు మళ్ళీ రాజు. సన్యాసి అన్నాడు- 'ఇదంతా ప్రజలు నీకిచ్చినదే. నీ శరీరం భగవంతుడిచ్చిందే. నీ మనసు, బుద్ధీ అన్నీ దైవదత్తాలే. ఈ జన్మ నీ స్వార్జితం కాదు. ఇక నీ సొంతమనేది ఏదీ లేకపోతే- నువ్వు నాకేమివ్వగలవు?' రాజుకు తల తిరిగిపోయింది. తన అజ్ఞానమనే మాయను తెలుసుకున్నాడు. లజ్జతో తలవంచుకుని సన్యాసిని క్షమాపణ కోరుకున్నాడు. అహంకార రహితుడై జ్ఞానసముపార్జన చేసి, నిరాడంబర జీవనం కొనసాగిస్తూ ప్రజలకు శ్రేష్ఠమైన పాలన అందించి కీర్తి పొందాడు. ఈ 'మాయ' అనే ఊబిలో పడకుండా ఉండాలంటే నిర్మల చిత్తంతో నిరీశ్వరుణ్ని ధ్యానించాలి. సకల ప్రాణికోటినీ ప్రేమించాలి. సదాచరణతో, త్రికరణశుద్ధిగా పరోపకార సంలగ్నులం కావాలి. నిరంతరం జ్ఞాన సముపార్జనారతులమై ఉండాలి. ధర్మకార్యవ్రతులం కావాలి. మాయలో పడేసే మనోవికారాలన్నింటినీ 'సంయమన పాశుపతాస్త్రం'తో దగ్ధం చేసెయ్యాలి. అప్పుడే మానవ జన్మకు సార్థకత!🙏
No comments:
Post a Comment