Monday, October 10, 2022

🌹🌷 కౌసల్యా సుప్రజా రామా!

 🌹🌷  కౌసల్యా సుప్రజా రామా!
                   

మన తెలుగు లోగిళ్లు...
 "కౌసల్యా సుప్రజా రామా.." అను... సుప్రభాతంతో  మేల్కొంటాయి.

విశ్వామిత్రుడు శ్రీ రాముడిని నిద్ర లేపుతూ...

”కౌసల్యా  సుప్రజా  రామా!
పూర్వాసంధ్యా ప్రవర్తతే !”
”ఉత్తిష్ఠ నరశార్దూల!
కర్తవ్యం దైవమాహ్నికం!”

...అంటాడు.

అసలు సుప్రభాతం...
ఈ శ్లోకంతోనే ఎందుకు మొదలైంది?  అని ఆలోచిస్తే...

ఇందులో మనకు ఒకటి అర్థమవుతుంది.

 "కౌసల్యా సుప్రజా రామా!"...
అంటే ఇక్కడ రాముడు... అనగా మేలుకోబోయే వ్యక్తి... అతడిని మేలుకొలపాలి.
 
గాఢముగా నిద్ర పోతున్న వ్యక్తిని... ఉన్నట్టుండి మేల్కొలపడం ప్రమాదకరం.
 
ఎటువంటి వ్యక్తి అయినా తన తల్లి పేరు విన్నంతనే... తన దృష్టిని అటువైపు త్రిప్పుతాడు. అందువల్ల మొదట తల్లి పేరు పలికినారు.

అంతే కాక  ప్రత్యక్ష దైవమైన  తల్లిని మొదట అతడికి గుర్తు చేస్తూ... తర్వాత ఆ మేల్కోబోయే వ్యక్తి  పేరు ("రామా!") అని పిలుస్తున్నాము.

"సుప్రజా" అంటే... మంచి బిడ్డవు అని అర్థము.

తర్వాత మాత్రమే...

        "పూర్వాసంధ్యా ప్రవర్తతే"...

అంటే…
తెల్లవారుతోంది నాయనా అంటున్నారు.

అంటే ఇంకా సూర్యుడు ఉదయించలేదు... ఉదయించడానికి తయారుగా ఉన్నాడు.

తెల్లవారు ఝామునే లేవడం ఎంతో మంచిది అని మన అందరికీ తెలుసు. అందుకే ఆ సమయానికే ఇక్కడ మేల్కొల్పడం జరుగుతోంది.

"ఉత్తిష్ఠ నరశార్దూలా"...

అంటే "ఓ మనుషులలో పులి లాంటి వాడా….  లెమ్ము!" అంటున్నారు.

మనము చూస్తూనే ఉంటాము పిల్లలను లేపేటప్పుడు...!.

“లేవరా బారెడు పొద్దెక్కినా ఇంకా పడుకొనే ఉన్నావు...!”
”పక్కింటి అబ్బాయి చూడు! మంచి ర్యాంకు తెచ్చుకొన్నాడు... నువ్వూ ఉన్నావు ఎందుకు... 
”తినడానికి..  నిద్రపోయేదానికి ఎప్పుడూ తయారుగా ఉంటావు!" అంటూ తిడుతూ... లేపుతుంటారు.

అందువలన లేచేటప్పుడే పిల్లలు ఒక విధమైన బాధతో  లేస్తుంటారు.

అలాకాకుండా తన శక్తి సామర్థ్యాలను గుర్తు చేస్తూ... ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ... మేల్కొల్పితే ఎంతో ఆనందంగా, ఉత్సాహము తో మేల్కొంటారు

తర్వాత ఆ రోజు ఎంత ఉత్సాహంగా తమ పనులను చేసుకొంటారు.

అందుకే ఈ విధంగా మేల్కొల్పాలని మనకు నేర్పుతున్నారు…

"కర్తవ్యం దైవమాహ్నికం"...

అంటే ‘నీకు దైవంచే విధించబడిన... అంటే.. నీవు చేయవలసిన పనులు... (చదువుకోవడం కావచ్చు లేక ఉద్యోగం కావచ్చు లేక మరో వ్యాపారమో, సేద్యమో ఏదైనా కావచ్చు) చేయవలసి ఉంది!’ అని గుర్తుచేస్తున్నారు.

అందుకని ‘తెల్లవారుఝామునే లెమ్ము నాయనా!’ అంటూ ఒక పాజిటివ్ దృక్పథాన్ని   కలిగిస్తూ మేల్కొల్పడం చేయాలి.

రాముడిని నిమిత్తముగా చేసుకుని...  సకల జీవరాశులను ఇలా మేల్కొలుపు తున్నారు అన్నమాట…!
              సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏

No comments:

Post a Comment