Tuesday, October 11, 2022

శూర్పనఖ ...ముక్కు చెవులు కోయడానికి కారణం...!!

 🌹🙏 శూర్పనఖ ...ముక్కు చెవులు కోయడానికి కారణం...!!🙏🌹

🌿శూర్ప అంటే, వాడి, చేట, మూడుముంతల కొలమానమనే అర్థాలున్నాయి.

🌸నఖ మంటే గోరు , శూర్పనఖంటే వాడైన గోర్లు కలదని అర్ధం.

🌿శూర్పనఖ గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏమిలేకపోయినా లక్ష్మణుడు, శూర్పనఖ ముక్కుచెవులు కోయటానికి మాత్రం ఒక విశేషముంది.

🌸 అందరు అనుకొన్నట్టుగా శూర్పనఖ శ్రీరాముని మోహించి అక్కడికి వెళ్ళలేదు, మాతృహృదయవేదనతో ప్రతీకారం తీర్చుకోటానికే శ్రీరామచంద్రుని కుటీరానికి వెళ్లింది.

🌿ఎందుకు ఆ రాక్షసస్త్రీ  ప్రతికార వాంఛతో వెళ్లిందో తెలుసుకొనేముందు శూర్పనఖ  భర్త, కుమారుని గురించి తెలుసుకోవాలి.

🌸శూర్పనఖ రావణబ్రహ్మ సోదరి. ఈమె భర్త విద్యుజ్జిహ్వుడు. ఇతను కాలకేయ వంశానికి చెందినవాడు.

🌿రావణబ్రహ్మ లోకాలను జయించాలనే తృష్ణతో కాలకేయుల మీద దాడిచేశాడు. ఆ పోరులో విద్యుజ్జిహ్వుడుకూడా వున్నాడని తెలుసుకోలేక  బావమరిదిని పొరబాటున రావణుడు చంపేస్తాడు.

🌸విషయం తెలుసుకొన్న శూర్పనఖ అన్న వద్దకు చేరి విలపిస్తుంది. రావణుడు పొరబాటు జరిగిపోయింది. అందుకే నేను చేసేదేమి లేదు, కనుక ఓ చెల్లి! చచ్చిననీ  భర్తను ఎటూ నేను తేలేను,

🌿 కాకపోతే ఇకనుండి స్వేచ్ఛగా ఎక్కడికైనా పోవచ్చు, అని చెప్పి ఖర, దూషణ, త్రిశిర తోడుగా ఇచ్చి దండకారణ్యంలోని జనస్థానానికి ఆమెను పంపేశాడు.

🌸అప్పటికే శూర్పనఖ ఆరు నెలల గర్భిణి. శూర్పనఖ కడుపున పుత్రోదయమైంది. వాడికి జంబూకుమారుడనే పేరు పెట్టి పెంచసాగింది.

🌿జంబూకుమారునకు యుక్తవయస్సు రాగానే తన తండ్రి మరణానికి తన మేనమామే కారణమని తెలుసుకొని, ప్రతీకారేచ్ఛతో రగిలిపోయాడు.

🌸 అందుకై గోదావరి నదితీరంలోని పంచవటి చేరి సూర్యభగవానిని నుండి వరం పొందగోరి,  ఘోరతపస్సు మొదలుపెట్టాడు.

🌿 ఎంత ఘోరమైన తపమంటే అతని శరీరం చుట్టూ గుబురు దర్భలు, దట్టమైన వెదురు పొదలు పెరిగాయి.

🌸ఈ పంచవటి సమీపంలోనే శ్రీరామచంద్రమూర్తి సీత, లక్ష్మణ సమేతంగా పర్ణశాలలో నివసిస్తున్నాడు.

🌿 ఒకరోజు లక్ష్మణుడు దర్భలు, యాగసమిధలు తేవాలని బయలుదేరాడు. ఒకచోట వెదురుపొదలలో దట్టమైన దర్భలను చూచి,

🌸దర్భలు కోయాలనే ఉద్దేశ్యంతో అడ్డుగావున్న వెదురుపొదలను బలంగా నరికాడు. ఆ దెబ్బకు వెదురుపొదల్లో తపసులో వున్న జంబూకుమారుడి తల తెగింది.

🌿జంబూకుమారుడు అక్కడికక్కడే మరణించాడు. చచ్చింది మునికుమారుడేమోనని లక్ష్మణుడు చింతించి, చుట్టుపట్ల గల మునిజనుల విచారించాడు.

🌸చచ్చినవాడు మునికుమారుడు కాదని, వీడో రాక్షసుడని వీడి మరణానికి చింతించనవసరం లేదని తాపసులు తెలియచేశారు.

🌿కొడుకు మరణాన్ని తట్టుకోలేక శూర్పనఖ కొడుకును చంపిన లక్ష్మణుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని కోపంతో పంచవటిలోని రామాశ్రమ చెంతకు వెళ్లింది.

🌸రాక్షసులది చపలచిత్తం, పైగా అరిషడ్వర్గాలైన కామ, క్రోధ మోహ,లోభ మద,మత్యార్యాలు వీరికెక్కువ.

🌿 శ్రీరామచంద్రుడి సుందర దివ్యమంగళ విగ్రహం చూడగానే శూర్పనఖ వచ్చినపని మరచిపోయింది.

🌸 ప్రతీకారేచ్ఛను పక్కకుపెట్టేసింది. ఆమె కామదాహంతో రెచ్చిపోయి శ్రీరాముడి పొందుకోరింది. శూర్పనఖకు బుద్ధి చెప్పాలని లక్ష్మణుడు ఆమెను చంపకుండా ముక్కుచెవులు కోసిపంపేశాడు.

🌿స్త్రీ యొక్క ముక్కుచెవులు చెక్కడం, కొప్పు తరగడం, వక్షస్థలాన్ని కోయడం లాంటివి హత్యాసదృశంతో సమానం, అంటే చంపడంతో సమానం.

🌸వీటిలో ఏ ఒక్కదానికి చేధం జరిగినా అంతకంటే మరే ఆవమానం గొప్పదికాదని స్త్రీలు భావిస్తారు.. అందుకే లక్ష్మణుడు శూర్పనఖ ముక్కుచెవులు కోసి పంపేశాడు.

🌿శూర్పనఖకు భర్త కొడుకులు చనిపోయారు. కోరిన శ్రీరాముడు దక్కలేదు, పైగా ఘోరావమానం జరిగింది.

🌸ప్రతీకారం స్వంతంగా తీసుకొనేశక్తి లేదు. అందుకే శోకిస్తూ లంకను చేరి అన్న రావణుడి వద్ద వాపోయింది.
ఆ తరువాత జరిగిన శ్రీరామ కథ మనకు తెలుసు...🚩🌞🙏🌹🎻

        🌹🙏జైశ్రీరాం!..🙏🌹 

No comments:

Post a Comment