Wednesday, October 5, 2022

మహిషాసురమర్ధినిగా.....

 సముహ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు

చెడుపై మంచి విజయం సాధించిన రోజు...
దుర్గామాత రాక్షుసుడిని మట్టుబెట్టిన రోజు
రావణుడిని రాముడు సంహరించిన రోజు...
అందుకే దసరా అంటే మనకు ప్రత్యేకమైన రోజు..

మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు...


మహిషాసురమర్ధినిగా

దైత్యవంశానికి ఆశాదీపంలా జన్మించిన ‘మహిషాసురుడు’ తన ఆంతరంగిక మిత్రులతో, సచివులతో సమాలోచన చేసి, మరణంలేని జీవనం కోసం మేరుపర్వతశిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోరతపస్సు ప్రారంభించాడు. కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్లిపోయాయి. మహిషాసురుని అచంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ‘మహిషాసురా.., ఇంక తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో’ అన్నాడు.‘పితామహా.,నేను అమరుణ్ణి కావాలి. నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు’ అని కోరాడు మహిషాసురుడు. అప్పుడు బ్రహ్మదేవుడు ‘మహిషాసురా..పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు.., గిట్టిన ప్రాణి మరల పుట్టక తప్పదు. జననమరణాలు సకలప్రాణికోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకూ, మహాపర్వతాలకూ కూడా ఏదో ఒక సమయంలో వినాశం తప్పదు. ప్రకృతివిరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం. కనుక,నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి, మరే వరమైనా కోరుకో’ అన్నాడు. అప్పుడు మహిషాసురుడు ‘విధాతా..అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే.. ఆడది నా దృష్టిలో అబల..ఆమెవల్ల నాకే ప్రమాదమూ రాదు. కనుక.,పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు’ అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్థానమయ్యాడు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతల్తో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది.
శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది. మహిషాసురుని తరఫున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. ఈ యుద్ధములో ఆదేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవరూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు.ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలచే కొనియబడింది.

No comments:

Post a Comment