ఈ రోజు మంచి మాట .
ప్రతి ఒక్కరూ సిరిసంపదలు కావాలని కోరుకుంటారు. లేమిని ,కష్టాలను కావాలని ఎవరూ ఆశించరు. సిరిసంపదల వల్ల పొందే ఫలితాలు, సుఖాలు, కోరదగినవి. ఆనందించదగినవి. కానీ, కష్టాలకు ఎదురీది పొందే ఫలితాలు అద్భుతమైనవి. అభినందించ దగినవి. అర్ధం చేసుకుంటే సిరిసంపదలతో తులతూగుతున్నంత మాత్రాన భయాలు, బాదలు, చీకూ చింతలు లేకుండా ఉండవు, లేమితో కష్టాలు అనుభవిస్తున్నంత మాత్రాన ఓదార్పు, ఆశలు, అవకాశాలు, ఆనందాలు ఉండకుండా పోవు.
నిజానికి కష్టకాలంలోనే వ్యక్తి పట్టుదల, ప్రతిభా పాటవాలు పరిపూర్ణంగా బహిర్గతమవుతాయి. ప్రపంచంలో అద్భుతాలు సాధించినవారు కష్టనష్టాలకు ఎదురీదినవారే .గాలిపటం ఎదురు గాలిలోనే పైపైకి ఎగురుతుంది. కేవలం సుఖాలు మాత్రమే కావాలనుకోవడం అవివేకం. కష్టాలు లేకపోతే సుఖాల విలువ తెలియదు. కష్టానికి అలవాటు పడినవాడు సుఖాన్ని ఆనందంగా స్వీకరించగలడు. కానీ సుఖానికి అలవాటు పడ్డవాడు కష్టాన్ని ధైర్యంగా సహనంతో ఎదుర్కోలేడు . నేటి తరానికి సుఖాలు అనుభవించడమేగానీ కష్టాలను తట్టుకునే మానసిక ధైర్యం తగ్గిపోతోంది. చిన్నపాటి కష్టాలకే కుంగుబాటుకు, ఆత్మహత్యే శరణ్యం' అనే దౌర్బల్యానికి గురవుతున్నారు. కష్టాలను తట్టుకునే స్థైర్యం చిన్నప్పటి నుంచి అలవాటు కావాలి. నీకు నిజమైన మిత్రులు ఎవరో తెలిసేది నీ కష్టాల్లోనే.
సుదాముడు శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడు. అధిక సంసారంతో దరిద్రం అనుభవిస్తూ మంచి వస్త్రానికి కూడా నోచుకోక కుచేలుడయ్యాడు. సుదాముడు శ్రీకృష్ణుడి వద్దకు చాలా కాలం తరువాత భార్య ప్రోద్బలంతో తన స్థితిగతులను చెప్పుకొందామని వెళ్ళాడు. కృష్ణుడు అత్యంత ఆదరంగా చూసి రాజమర్యాదలు చేశాడు. కానీ సుదాముడు నోరు తెరిచి ఏమీ అడగలేదు. అయినా, కృష్ణుడు ఆషైశ్వర్యాలు ప్రసాదించాడు.
కష్టాలు వ్యక్తిత్వానికి గీటురాళ్లు, సీతమ్మ లంకలో ఆశోకవనంలో రావణుడి | చెరలో ఉన్నప్పుడు హనుమ 'తల్లీ నిన్ను నా భుజాలపై ఉంచుకొని క్షణాల్లో స్వామి సన్నిధిలో ఉంచుతా అంటాడు. 'అది నాకు నా స్వామికి కూడా మర్యాద కాదు. శ్రీరాముడు రావణుణ్ని వథించి నన్ను స్వీకరించినప్పుడే మా ఇరువురికీ ''గౌరవం' అని బదులిస్తుంది.
కష్టాలు మనుషుల్ని కలుపుతాయి. స్వాతంత్య్ర సంగ్రామంలో భారతీయులందరినీ జాగృతపరచి ఒకటి చేసి జాతి, కుల, మత భేదాలకు అతీతంగా ఒక్క తాటిపై నడిపించి, స్వాతంత్ర్యాన్ని సాదింపజేసింది.. నాటి పాలకులు పెట్టిన కష్టాలే. కష్టాలు మనిషిని దృఢంగా చేస్తాయి. దృఢంగా ఉండే వ్యక్తులు మాత్రమే పరిస్థితులను పరిసరాలను సుఖమయం చేస్తారు. చుట్టూ ఉండే నలుగురూ నాలుగు కాలాల పాటు సుఖసంతోషాలతో ఆనందంగా ఉండేటట్టు చేస్తారు.
అబ్దుల్ కలాం భారతదేశ ప్రథమ పౌరుడిగా ఉన్నత స్థానంలో ఉన్నా, ఆయన వ్యక్తిత్వంలో అదే సీదాసాదాతనం ప్రస్ఫుటమయ్యేది. పదవికి తగిన హుందాతనం ప్రతిబింబించేది. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు కలిమిలోను సర్వం దేశ సేవకు ఆర్పించిన తరవాత లేమిలోను, పదవిలో ఉన్నా లేకున్నా అదే ఆత్మగౌరవాన్ని ప్రదర్శించారు.
కష్టాలు, సుఖాలు కూడా వ్యక్తిత్వానికి గీటురాళ్లు. కష్టాలు నీ దృఢత్వాన్ని
పరీక్షిస్తాయి. సుఖాలు నీలోని బలహీనతలను పరీక్షిస్తాయి. వాటిని
'సద్వినియోగం చేసుకోవడంలోనే మనిషి వ్యక్తిత్వం, విజ్ఞత తెలుస్తాయి.
సేకరణ. రామిరెడ్డి మానస సరోవరం 👏
No comments:
Post a Comment