✍..... *నేటి చిట్టికథ*
*సర్వవ్యాపినమీశ్వరం** ..
“ *స ఈశః అనిర్వచనీయ* *ప్రేమ* *స్వరూపః*
*స ప్రత్యక్ష సర్వేషాం* *ప్రేమరూపః* “
ఈశ్వరుడు అంటే భగవంతుడు అనిర్వచనీయమైన ప్రేమయే స్వరూపముగా కలవాడు. అందరిలోనూ ప్రత్యక్షంగా ప్రేమరూపం లో ఉంటాడు.
ఒక ఊరిలో ఒక భక్తుడుండేవాడు.అతడు ప్రతిరోజూ నిత్య,నైమిత్తిక పూజలు చేస్తుండేవాడు.భగవదారాధనలోనే సమయాన్ని గడిపేవాడు.
ఒకరోజు అతనికి కలలో తను కొలిచే రూపంతో భగవంతుడు కనబడ్డాడు.
భక్తుడు ఉబ్బితబ్బిబ్బయి తేరుకునేలోపు “ భక్తా! నీ భక్తికి మెచ్చి రేపు నేను నీ యింటికి భోజనానికి వస్తున్నాను.సిద్ధంగా ఉండు” అని చెప్పడం, భక్తుడు ఇది కలా,నిజమా అని తెలుసుకునేసరికి భగవంతుడు అంతర్దానమవడం జరిగిపోయేయి.
తెల్లవారుజామున వచ్చింది కాబట్టి ఈ కల నిజమవుతుందనీ,అవాలనీ ఆశిస్తూ వెంటనే లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానసంధ్యాదులు చేసి శుచిగా భగవంతుడి కోసం పంచభక్ష్య పరమాన్నాలూ సిద్ధం చేయ సాగేడు.
ఈ వంటకాల వాసనలకు ఓ బాలుడు వంటగది కిటికీలోంచి తొంగి చూస్తూ “నాక్కొంచెం పెట్టరా?” అని అడిగేడు.
“ ఎంత ధైర్యంరా నీకు? భగవంతుడి కోసం నైవేద్యం తయారుచేస్తుంటే అలా తొంగి చూస్తావా?ముందు ఇక్కడినుండి పో!” అని తగిలేసేడు భక్తుడు ఆ కుర్రాణ్ణి.ఆ అర్భకుడు వెళ్లిపోయేడు.
మధ్యాహ్నం .అయింది.
భక్తుడికి భగవంతుడి జాడ లేదు.ఇంతలో వీధి గుమ్మం నుండి మరో పిలుపు వినబడింది.”అయ్యా! చాలా ఆకలిగా ఉంది.కాస్త ఏమైనా ఉంటే పెట్టండి.”అని. వెంటనే భక్తుడు బయటకు వెళ్లి చూసేడు. ఓ వృద్ధుడు ఆశగా చూస్తున్నాడు. వాడిని చూసి భక్తుడు “ నేను భగవంతుడి రాకకోసం ఎదురుచూస్తున్నాను. ఆయన ఆరగింపు అవగానే నీకు పెడతాను.కొంచెం సేపు పోయేక రా!”అని చెప్పి పంపించేసేడు.”పిచ్చివాడు” అనుకుని ఆ వృద్ధుడు వెళ్లిపోయేడు.
సాయంకాలం అయిపొయింది. భగవంతుడికోసం భక్తుడు ఓపికగా నిరీక్షిస్తున్నాడు. చివరగా ఓ సాధువు “ భవతి భిక్షాం దేహి” అంటూ వచ్చేడు.”అతిథిగా వస్తానన్న భగవంతుడికి నివేదించకుండా ఈ సాధువుకు భిక్ష ఎలా వేస్తాను?” అనుకుని మళ్ళీ రమ్మని చెప్పి పంపించేసేడు భక్తుడు ఆ సాధువును కూడా.
రాత్రయిపోయింది.వస్తానన్న భగవంతుడు రాలేదు.అదే ధ్యాసతో నిద్రకూడా సరిగా పట్టలేదు ఆ భక్తునికి.ఆ కలత నిద్రలో మళ్ళీ అతనికి భగవంతుడు కనిపించేడు.వెంటనే “ స్వామీ! నువ్వు ఈ రోజు నా యింటికి భోజనానికి వస్తానని నిన్న నాకు చెప్పేవు కాని రాలేదు. ఈ రోజంతా ఎదురుచూసేను నీ కోసం.నా వల్ల ఏమైనా అపరాధం జరిగిందా?” అని అడిగేడు.
“ అదేంటి భక్తా? నేను ఈ రోజు నీ యింటికి మూడు సార్లు వచ్చేను. కాని నువ్వే ప్రతిసారీ ఏమీ పెట్టకుండా ఏదో ఒకటి చెప్పి పంపించేసేవు.” అన్నాడు భగవంతుడు.
“ స్వామీ! నువ్వు నా యింటికి మూడు సార్లు వచ్చేవా?నేను నీకు ఏమీ పెట్టకుండా పంపించేసేనా?”ఆశ్చర్యంగా అడిగేడు భక్తుడు.
“ అవును భక్తా! ఓ సారి బాలుడిగా,మరో సారి వృద్ధుడిగా,ఇంకో సారి సాధువుగా వచ్చేను.”
“ఆ! ఆ ముగ్గురిగా వచ్చింది నువ్వేనా స్వామీ? ఎంత పొరపాటు చేసేను. ఎంత అపచారం చేసేను. నన్ను క్షమించు స్వామీ!” అని వేడుకున్నాడు భక్తుడు.
నువ్వు మాత్రం ఏం చేస్తావ్? నువ్వేమో నేను నీకు కలలో కనబడ్డ రూపంలో వస్తాననుకుని చూసేవు.కాని ఏ రూపంలో వచ్చినా అది నా స్వరూపమే అని తెలుసుకోలేకపోయేవు.” అని సత్య దర్శనం చేయించేడు భగవంతుడు భక్తుడికి.
🔹🔸🔹🔸🔹🔸🔹
No comments:
Post a Comment