Sunday, October 16, 2022

ఆధ్యాత్మిక జీవనము

 *ఆధ్యాత్మిక జీవనము*

ఆధ్యాత్మిక సాధన ద్వారా మనలో కొందరికి ఆధిదైవికానుభూతి ఈషణ్మాత్రం కలుగుతుంది. దీనితో తృప్తి పడని వారు, తమ అంతరాళాలలోకి లోతుగా మునిగి అంతరాత్మను కనుగొంటారు. 

ప్రతి శరీరంలోనూ ఆత్మ ఉన్నట్లే, ప్రతి ఆత్మలోనూ భగవంతుడు నెలకొని ఉంటాడు. ఆయన ఆత్మలతో ఏ అనుబంధమూ లేకుండా వాటిని నియంత్రిస్తుంటాడు. భగవంతుడు ప్రతిచోటా అంతర్యామిగా ఉంటూనే, అన్నింటికీ అతీతంగా కూడా ఉంటాడు. 

భక్తుడు ఆయనతో రకరకాల సంబంధ బాంధవ్యాలను కల్పించుకొని, ఆయన సాన్నిధ్యం యొక్క పరమానందాన్ని పొందుతూ ఉంటాడు. ఒక భక్తుడు భగవంతుణ్ణి తన స్వామిగా, స్నేహితునిగా, తల్లిగా, ప్రియతమునిగా భావిస్తూన్నప్పుడు, మనం దీనిని పైపైన అర్థం చేసుకోగూడదు.

ఇటువంటి ఉన్నతమైన భావాన్ని సాధారణస్థాయికి తెచ్చేందుకు మానవసంబంధాల సహాయాన్ని కూడా వినియోగించు కోవచ్చు. భగవంతునితో అనుబంధాన్ని పెంపొందించుకోవడమే అటువంటి బంధుత్వాలను ఏర్పరచు కోవడంలోని ముఖ్యోద్దేశ్యం.

*శుభంభూయాత్*

No comments:

Post a Comment