శివనామాల్లో ముఖ్యమైనవి ‘రుద్ర, శివ’ నామాలు
రుద్ర’ అంటే రోదనం పోగొట్టేవాడు. ‘శివ’ అంటే మంగళకరమైనవాడు.జీవులకు రోదనము పోగొట్టి మోక్షము కలిగించేవాడు శివుడు భోళాశంకరుడు. భక్తవత్సలుడు. ‘మహదేవ’ అని ముమ్మారు భగవన్నామాన్ని భక్తిశ్రద్ధలతో ఉచ్ఛరిస్తే వారికి ఒక్క నామస్మరణకి ముక్తిని ప్రసాదించి, మిగిలిన రెండు నామాలకీ ఋణపడి ఉంటాడు..., అంతేకాదు,మాని యే మహేశస్య ధ్రువమ ప్రజ్ఞానతోపి వా తేషాం కరతలే ముక్తిః’’
ఎవరైతే పరమేశ్వరుని యొక్క నామాలు జ్ఞానంచేత కాని, అజ్ఞానం చేతకాని స్తుతిస్తూ వున్నారో వారికి ముక్తి చేతిలోనే వుంది అని వేదంలో పేర్కొనబడింది. వేదాలలో యుజుర్వేదం గొప్పది. దానిలో నాలుగవ కాండలో ఉన్న రుద్రం ఇంకా గొప్పది. రుద్రం మధ్యంలోని ‘పంచాక్షరి’ అంతకంటే ఇంకా గొప్పది. పంచాక్షరిలోని ‘శివ’ అనే రెండు అక్షరాలు మరీ గొప్పవి.'శివ’ నామోచ్చారణ మహాత్మ్యమునకు సంబంధించిన ఇతివృత్తం పద్మపురాణంలో పాతాళ ఖండంలో వుంది.అటువంటి మహాశివుడిని కార్తీకమాసంలో పున్నమి తిథినాడు కులమతభేదాలు వయస్సు తారతమ్యాలు లేకుండా శివభక్తులంతా పూజిస్తారు. కార్తీకంలో ఏరోజు శివపూజ చేయక పోయనాకార్తీక పున్నమి నాడు మూడువందల అరవై వత్తుల గుత్తిని స్వామి ఎదురుగా కానీ తులసి సన్నిథిలోకానీ, మారేడు, రావి చెట్ల దగ్గర కానీ వెలిగిస్తే ఆ సంవత్సరం దీపం వెలిగించని పాపమేదైనా ఉంటే అది దూరం అవుతుంది. కార్తీక పున్నమినాడు దేవాలయాల్లో శివుని ప్రత్యేక పూజలు నిర్వర్తిస్తారు.
"ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథంజగన్నాథ నాథం సదానందభాజాంభవద్భవ్య భూతేశ్వరం భూతనాథంశివం శంకరం శంభు మీశానమీడే"
అని కార్త్తీకంలో ఈశ్వరుణ్ణి ప్రతివారు కొలుస్తుంటారు.
ఉసిరి మూలమున శ్రీహరి, స్కందమున శివుడు, ఊర్థ్వమున బ్రహ్మ, సూర్యుడు, శాఖలయందు, సమస్త దేవతలు కూడి కార్త్తిక మాసంలో ఉసిరి చెట్టును ఆశ్రయించి ఉంటారు. కనుక కార్తికమాసంలో ధాత్రీపూజవలన అశ్వమేధ ఫలం లభించి, ఉసిరి ఫలదానమువల్ల ముక్తి కలుగుతుంది.ఉసిరిక దీపదానం కూడా ఈ మాసం లో విశేషంగా చేస్తారు.ఓం నమః శివాయ నమః అంటూ ఉసిరిక కాయమీదనో, పిండి ప్రమిదతోనో, మట్టి ప్రమిదతోనో దీపం వెలిగిస్తే అనంత కోటి పుణ్యరాశి లభిస్తుందంటారు. శివుని పేరిట ఉపవాసం చేసినా, ఏకభుక్తం చేసినా, నక్తంచేసినా, ఆయాచిత వ్రతం చేసినా, ఆఖరికి శివనామంతో సూర్యోదయానికి పూర్వం స్నానం చేసినా సరే అనంతకోటి పుణ్యఫలాలను పరమశివుడు అనుగ్రహిస్తాడు.
ఓం నమః శివాయ.
No comments:
Post a Comment