Wednesday, March 8, 2023

గృహస్థు.. సన్యాసి..

 గృహస్థు.. సన్యాసి..

మలయాళ సద్గురు స్వామి ఏది చెప్పినా సరళంగా ఉండేది. ఒకసారి ఆయన్ను చూడవచ్చిన ఓ వ్యక్తి 'స్వామీ! గృహస్థుకి ఇల్లు, సంసారం, బంధుగణం ఉంటే సన్యాసికి ఆశ్రమం, శిష్యగణం ఉన్నాయి.

ఇద్దరికీ ఆస్తులుంటున్నాయి. మరి ఏ భేదముందని సంఘం వీరిని గౌరవిస్తోంది?' అనడిగాడు. దానికాయన 'సన్యాసి అహంకారమనే సంతానాన్ని, సంపదలనే అన్నదమ్ములను, మోహమనే ఇంటిని, ఆశ అనే భార్యని విడిచి పెడతారు. ఇవేవీ గృహస్థులు చేయరు. తమరంటున్న ఆస్తిపాస్తులు శిష్యుల కోసమే తప్ప సాధువు అనుభవించడానికి కాదు. ఇల్లు భోగవాంఛలను ప్రేరేపిస్తే మఠం వాటిని విడిచిపెట్టే సాధనమౌతుంది. గృహం అనురాగాన్ని పెంచితే మఠం వైరాగ్యాన్ని నేర్పుతుంది. ఇల్లు ఆశాజీవులను పోషిస్తే, మఠం వాటిని వదిలేసిన వారిని పోషిస్తుంది. ఇల్లు బతుకుతెరువును నేర్పితే, మఠం మోక్షమార్గాన్ని బోధిస్తుంది. ఇంటిమీద హక్కు సొంతవారికే పరిమితం. మఠం అందరిదీ. ఇల్లు బంధనాలను ఏర్పరిస్తే మఠం వాటిని తొలగిస్తుంది. ఇల్లు దేహాన్ని సర్వమంటే మఠం దేవుణ్ణి సత్యమంటుంది. విషయవాంఛలుంటే వనంలో ఉన్నా గృహస్థులే. ఇంద్రియ నిగ్రహమున్నప్పుడు భోగభాగ్యాల ఇళ్లల్లో నివసిస్తున్నా సన్యాసులే. అలాంటి సాధువులున్న ఇల్లు తపోవనమవుతుంది. ముక్తికి వర్ణాశ్రమాలు కారణమే కాదు. జ్ఞానులే ముక్తిని పొందుతారు. అన్న, ఆరోగ్య, విద్యాదాతలు గృహస్థులైనా సన్యాసుల కిందే లెక్క' అంటూ వివరించారు. 

ఓం నమః శివాయ

No comments:

Post a Comment