Thursday, March 23, 2023

శ్రీ కావ్యకంఠ గణపతి ముని

 *శ్రీ కావ్యకంఠ గణపతి ముని

*ఈశ్వారానుగ్రహం పొందడానికని 16వ ఏట నుండి తపస్సు చేయనారంభించారు. అచిరకాలంలోనే భువనేశ్వరీ మాత అనుగ్రహాన్నీ, ఈశ్వరానుగ్రహంతో నిర్విషయ ధ్యానయోగాన్నీ పొందారు.*


 *అయినా తృప్తి చెందక నిజ తపస్స్వరూపాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని సుమారు 12 ఏళ్లు తపస్సు చేసినా అది సిద్ధించలేదు. కానీ భగవత్ప్రేరణ పొంది అరుణాచలానికి వెళ్లారు. అక్కడ 1907లో కృత్తికోత్సవాలలో ధ్యానదీక్షను చేపట్టారు. ఈశ్వరానుగ్రహం కలిగింది. అది గణపతిపైనే కాదు. అక్కడే 12 ఏళ్లుగా తపస్సులో ఉన్న ఒక బ్రాహ్మణస్వామిపై కూడా పడింది.*


 *ఆ బ్రాహ్మణస్వామినే తన ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించి, ఆయనకు ‘‘భగవాన్ రమణ మహర్షి’’ అనే పేరు పెట్టారు. అంతేకాదు. ఆ పేరును అంగీకరించమని ప్రార్థించారు. దాంతో ఆ బ్రాహ్మణస్వామి ‘‘అలాగే నాయనా’’ అనడంతో గణపతికి నాయనగా పేరు స్థిరపడింది.*


*గణపతి ముని తనకు రమణ మహర్షిని గురువుగా ప్రసాదించిన పార్వతీదేవి (ఉమాదేవి)కి కృతజ్ఞతా సూచకంగా ఒక కావ్యాన్ని రచించి సమర్పించదలిచారు. అదే ఉమాసహస్రం. దీనిని 20 రోజుల్లోగా రచించి పూర్తిచేస్తానని ప్రతిజ్ఞ చేశారు. కార్తీక బహుళ షష్ఠి, మంగళవారం (20.11.1907)నాడు రచనకు శ్రీకారం చుట్టారు. ఈ స్తోత్ర కర్మఫలంగా నాయన రమణుల సుబ్రహ్మణ్యతత్వాన్ని దర్శించాలని ఆశించారు.*


*ఒకరోజు నాయన భారతదేశంలో నాటి క్షుద్భాదను తలుచుకుని (ఇప్పటికీ ఈ సమస్య సజీవంగానే ఉంది) ఆ బాధను నివారించమని దేవిని అర్థిస్తూ, ‘‘ఛిన్నాం భిన్నాం సుతరాం సన్నా మిన్నా భావతచితః ఖిన్నాం’’ (ఇదే ఇంద్రాణీ సప్తశతిలో-4వ శతకం, 4వ స్తబకం, 24వ శ్లోకం) అని ఒక పాదం వ్రాసేసరికి దేశంలోని ఆకలంతా తనకే వచ్చినట్లు నాయనకు అనుభవమైంది. అపుడు సమయం సరిగ్గా 7 గంటలు. నాయన రచనను ఆపి ఆ పరదేవతా స్మరణలో మునిగిపోయారు.*


*అదే సమయంలో రమణ భక్తురాలైన ఎచ్చమ్మాల్ ఇంటి దగ్గర ఒక విచిత్రం జరిగింది. ఆమె పొయ్యి మీద వేర్వేరు గినె్నల్లో పప్పు, బియ్యం వేసిందిట. ఇంతలో ఒక స్ర్తి ప్రత్యక్షమై, ‘‘ఓ భక్తురాలా, గుహలో స్తపబంధ దీక్షాపరుడైన ముని ఆకలితో బాధపడుతున్నాడు. అన్నం కోసం ఎదురుచూస్తూన్నాడు. వెంటనే పంపు. ఐతే, ‘ఈ దినం విశేషమేమి’ అని ఈ అన్నం తీసుకుని వెళ్లేవారిని అతనిని అడగమను’’ అని చెప్పి అదృశ్యమైపోయిందిట. ఎచ్చెమ్మాళ్ తిరిగి చూసేసరికి అన్నం, పప్పు ఉడికి సిద్ధంగా ఉండటంతో ఆమెకు ఆశ్చర్యం కలిగింది. ఇంతలో ఒక విద్యార్థితో అన్నాన్ని, పప్పునీ పంపి నాయనను అడగాల్సిన ప్రశ్న కూడా చెప్పి పంపింది.*


 *ఆ విద్యార్థి తెచ్చిన భోజనాన్ని చూడగానే నాయన ఆకలి మాయమైందిట. కానీ తెచ్చిన తిండి వ్యర్థం కాకూడదని కొద్దిగా తిని పంపేశారట. ఆ బాలుడు ఎచ్చెమ్మాళ్ అడగమన్న ప్రశ్నకు నాయన నవ్వి ‘‘క్షుత్తేశేషమ’’ని బదులు పంపారట. కొంతసేపటికి వచ్చిన ఎచ్చెమ్మాళ్ ద్వారా జరిగిన కథనంతా విని, దేశంలో శత్రువులవల్ల ఏర్పడిన క్షుద్భాదను తీర్చడానికి దేవత సిద్ధంగా ఉందని తెలుసుకుని నాయన సంతోషించారు.*


*ఉమాసహస్ర దీక్ష ఇక నాలుగే రోజులుందనగా నాయన కుడిచేతి బొటనవేలికి గోరుచుట్టులాటి పుండొకటి వచ్చి, రచన ఏమాత్రం ముందుకు సాగలేదు. 19వ రోజు సాయంత్రానికి ఇక నాలుగోవంతు గ్రంథం అలాగే మిగిలిపోయి ఉంది. అంటే 250 శ్లోకాలు ఇంకా పూర్తికావలసి ఉంది. 20వ రోజు వైద్యుడు వచ్చి నాయన వేలుకు శస్త్ర చికిత్స చేసి కట్టుకట్టాడు. ఐనా తగ్గలేదు.*


*అప్పటికే వేదాంత ఆగమ శాస్త్ర రహస్యాలతో, ఉమాసహస్రం 750 శ్లోకాలతో అద్భుతంగా రూపొందింది. కేవలం 250 శ్లోకాలు కాలేదని, తన ప్రతిజ్ఞకు బద్ధుడై అప్పటిదాకా వ్రాసిన వాటిని చించేయవద్దని నాయనను భక్తులంతా ప్రార్థించారు. అది విన్న నాయన మిగిలిన భాగాన్ని ఆశువుగా పూర్తిచేశారు. అదీ ఎంతో అద్భుతంగా. అది ఎలాగంటే, ఆ రోజు రాత్రి అప్పటికే 8 గంటలైంది. తాను చెప్పింది వ్రాయడానికి ఐదు మందిని రాత సామగ్రితో సిద్ధం అయ్యారు. ఇంతలో రమణమహర్షి వచ్చి నాయన వెనకగా కూర్చుని ధ్యానముద్రలో ఉండిపోయారు. 25 శ్లోకాల చొప్పున మొత్తం 10 స్తబకాలు (1000 పాదాలు) మిగిలి ఉన్నాయి. నాయన ఐదు మందికి ఐదు స్తబకాలు ఏకకాలంలో ఒక్కో పాదాన్ని వరసగా, ఆశువుగా చెబుతూ మొత్తం 200 నిమిషాల్లో పూర్తిచేసేశారు.*


*అంటే, 250 శ్లోకాలను ఆశువుగా 200 నిమిషాల్లో పూర్తిచేశారు. అందరూ సంతోషపడ్డారు. ఇంతలో, రమణ మహర్షి ధ్యానంలోంచి మేల్కొని ‘‘నేను చెప్పినవన్నీ సరిగ్గా వ్రాశారా?’’ అని అడిగారు. దాంతో నాయన తాను అనుకున్న సుబ్రహ్మణ్య తత్వం వెల్లడైందని తెలిసి సంతోషించారు. వెంటనే, రమణ మహర్షితో, ‘‘చిత్తం! మీరు నాకు చెప్పినదంతా శ్రద్ధగా గ్రహించి ఇపుడే రచన పూర్తిచేశాను!’’ అని సమాధానం ఇచ్చారు. దాంతో, సంతోషించి రమణులు మంచిది అని అక్కడినుంచి వెళ్లిపోయారు.*

No comments:

Post a Comment