Monday, October 16, 2023

ఉపాయం

 2808s12908t1-5.0806u2-6. 091023-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

                  *ఉపాయం*
                 ➖➖➖✍️

*ముగ్గురు మిత్రులు ఓసారి అమ్మవారి గుడికి వెళ్లారు. ప్రసాదంగా చక్కెర పొంగలి ఇచ్చారు. అది ఒకరు తినడానికే సరిపోతుంది. నేను తింటానంటే నేను తింటానని ముగ్గురూ వాదులాడుకున్నారు. తగాదా తేలలేదు. వారిలో చిన్నవాడు ఒక ఉపాయం చెప్పాడు.*

*‘ఇప్పుడు ఎలాగూ మధ్యాహ్నమైపోయింది. కాబట్టి హాయిగా పడుకుని నిద్రపోదాం. ముగ్గురిలో ఎవరికి అద్భుతమైన కల వస్తే వారు సాయంత్రం దాన్ని తినొచ్చు’ అన్నాడు. సరేననుకుని ముగ్గురూ చక్కెర పొంగలి పొట్లాన్ని చిటారు కొమ్మకి కట్టి చెట్టు కిందనే పడుకున్నారు.*

*సాయంత్రం అయ్యేసరికి ముగ్గురికీ మెలకువ వచ్చింది. మొదటి వాడు ‘నాకు భలే కల వచ్చింది’ అంటూ ఇలా చెప్పాడు.*

*‘నేను ఒక అడవిలో వెళుతుంటే కుబేరుడు పుష్పక విమానం మీద వచ్చి నా ముందు దిగాడు. నన్ను సాదరంగా యక్షలోకానికి తీసుకుపోయాడు. అక్కడ నేను పన్నీటితో జలకాలాడాను. పట్టు వస్త్రాలు కట్టుకున్నాను. బంగారు పళ్లెంలో కుబేరుడు స్వయంగా నాకు విందుభోజనం వడ్డించాడు. తర్వాత అప్సరసలతో నాట్యం చేశాను. కుబేరుడు నేను మోయగలిగినంత బంగారాన్ని ఇచ్చి కిందకి పంపాడు’.*

*రెండోవాడు ‘నాకల అంతకంటే అద్భుతమైంది’ అంటూ ఇలా చెప్పసాగాడు.*

*‘నేను ఓ మైదానంలో పడుకుని ఆకాశంలోకి చూస్తుంటే ఐరావతం కనిపించింది. ఆశ్చర్యంగా చూస్తుంటే అది నా దగ్గరే దిగింది. దాని మీద ఇంద్రుడు ఉన్నాడు. నన్ను కౌగిలించుకుని స్వర్గానికి తీసుకుపోయాడు. తాగినంత అమృతం పట్టించాడు. వజ్రాలు పొదిగిన బంగారు కంచంలో పంచభక్ష్యపరమాన్నాలు వడ్డించాడు. రంభ, ఊర్వశి, మేనకల నాట్యం ఏర్పాటు చేశాడు. నేను మోయలేనన్ని రత్నాలు ఇచ్చాడు. తిరిగి ఐరావతం ఇక్కడ దింపిందో లేదో మెలకువ వచ్చింది.’*

*ఇద్దరి కలలూ విని మూడోవాడు చప్పట్లు కొట్టాడు. ‘మరి నీకేం కల వచ్చింది?’ అని ఇద్దరూ వాడిని అడిగారు. మూడో వాడు ఇలా చెప్పాడు.*

*‘నాకేమీ అద్భుతమైన కల రాలేదు. నేను అడవిలో వెళుతుంటే పులి వెంట పడింది. పరిగెట్టుకునిపోతూ ఓ లోయలో పడ్డాను. ఒళ్లంతా దెబ్బలు. డేక్కుంటూ వెళుతుంటే అమ్మవారి గుడి కనిపించింది. ఈ కష్టాలేంటి తల్లీ అని అడిగేసరికి అమ్మవారు ‘నీ స్నేహితుల్లో ఒకడు కుబేరుడి విందు ఆరగిస్తున్నాడు. మరొకడు ఇంద్రుడిచ్చిన అమృతం తింటున్నాడు. కాబట్టి నువ్వు చక్కెర పొంగలి తిను’ అని మనం చెట్టు కొమ్మకు కట్టిన పొట్లం చూపించింది. ఏం చేయను? అమ్మవారి ఆజ్ఞ. మెలకువ రాగానే తినేశాను’ అన్నాడు.*

*మిగతా ఇద్దరూ నోరు వెళ్లబెట్టారు.*✍️
           *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment