Sunday, October 15, 2023

మూడు బొమ్మల రహస్యం

 *మూడు బొమ్మల రహస్యం* 

ఒక వ్యక్తి అన్నిచోట్లా తిరుగుతూ బొమ్మలు అమ్ముకునేవాడు. 
ఒక రోజు, అతను ఒక రాజ్యానికి చేరుకున్నాడు, అక్కడ రాజుకు కొత్తవి, ప్రత్యేకమైన బొమ్మలంటే చాలా ఇష్టం అని తెలుసుకున్నాడు.

రాజభవనంకు వెళ్లి, ఆస్థానంలో ఉన్న రాజు వద్దకు వెళ్లి, "మహానుభావా, మీరు ఇంతకు ముందెన్నడూ చూడని బొమ్మలను ఈ రోజు నేను మీకు చూపిస్తాను" అని చెప్పాడు.

రాజు అతని బొమ్మలను ఆస్థానంలో  ప్రదర్శించడానికి అనుమతించాడు.

బొమ్మలు అమ్మేవాడు తన పెట్టెలోంచి మూడు బొమ్మలు తీశాడు. 

రాజుగారి ముందు వాటిని ప్రదర్శిస్తూ, "ఈ బొమ్మలు తమలో తాము చాలా ప్రత్యేకమైనవి. చూడడానికి ఒకేలా కనిపించినప్పటికీ, వాస్తవానికి అవి చాలా భిన్నంగా ఉంటాయి" అని చెప్పాడు.

 బొమ్మలను ఒక్కొక్కటిగా చూపిస్తూ, "మొదటి బొమ్మ వెయ్యి బంగారు నాణేలు, రెండవది వంద బంగారు నాణేలు, మూడవది ఒక్క బంగారు నాణెం మాత్రమే" అన్నాడు.

రాజు ఆ మూడు బొమ్మలను చాలా జాగ్రత్తగా చూసాడు, కానీ వాటిలో ఏ తేడా కనిపించలేదు, మరి ధరలో అంత వ్యత్యాసం ఎందుకు ఉందని ఆశ్చర్యపోయాడు!

తానేమీ కనుగొనలేక, రాజు తన మంత్రులను ఆ తేడాను కనుక్కోమన్నాడు. 
మంత్రులు అన్ని వైపుల నుండి ఆ బొమ్మలను చూశారు కాని వాటిలో రహస్యాన్ని ఛేదించలేకపోయారు.

రాజు అప్పుడు రాజ పురోహితుడిని { రాజగురువుని} చూడమని అడిగాడు. 
ఆయన చాలా జాగ్రత్తగా ఆ బొమ్మలను పరిశీలించి మూడు గడ్డి పరకలను తీసుకురమ్మని ఆదేశించాడు.

గడ్డి పరకలు తీసుకురాగానే, రాజపురోహితుడు మొదటి బొమ్మ చెవిలో ఒక గడ్డిపరకని దూర్చాడు.
 అందరూ చూస్తూండగా ఆ పరక నేరుగా కడుపులోకి వెళ్లి, కొద్దిసేపటి తర్వాత, ఆ బొమ్మ పెదవులు కదిలి, ఆపై మూసుకుపోయాయి.

తరువాత, ఆయన పక్కన ఉన్న బొమ్మ చెవిలో ఒక గడ్డిపరకని దూర్చాడు, ఈసారి మరొక చెవి నుండి గడ్డిపరక బయటకు వచ్చింది తప్ప మరే కదలిక లేదు. 

ఇది చూసిన ప్రతి ఒక్కరిలో తరవాత ఏం జరుగుతుందోనన్న ఆసక్తి మరింత పెరిగింది.

ఇప్పుడు ఆయన మూడవ బొమ్మ చెవిలో గడ్డిపరకని దూర్చాడు, దాని నోరు ఒక్కసారిగా తెరుచుకుని  ఏదో చెప్పాలనుకుంటున్నట్లుగా కదులుతూ ఉంది.
ఇది చూసిన రాజు, "ఇదంతా ఏమిటి? ఈ బొమ్మల ధరలో ఎందుకు అంత తేడా ఉంది?" అని రాజ పురోహితుడిని అడిగాడు.
పురోహితుడు ఇలా సమాధానమిచ్చాడు, "సద్గుణవంతుడు ఎప్పుడూ తాను విన్నదాన్ని తనలోనే ఉంచుకుంటాడు, దానిని ధృవీకరించుకున్న తర్వాత మాత్రమే నోరు తెరుస్తాడు. అదే అతని గొప్పతనం.

ఇది మొదటి బొమ్మ నుండి మనకు లభించే జ్ఞానం. ఆ కారణం చేతనే దాని విలువ వెయ్యి బంగారు నాణేలు.

కొంతమంది ఎప్పుడూ తమలో తాము నిమగ్నమై ఉండి, మిగిలినవేవీ పట్టించుకోరు. వారు ఇతరుల నుండి ఎటువంటి ఆసక్తి లేదా ప్రశంసలను కోరుకోరు. అలాంటి వ్యక్తులు ఎవరికీ హాని చేయరు. 

రెండవ బొమ్మ నుండి మనం నేర్చుకునేది ఇదే, దాని విలువ వంద బంగారు నాణేలు అవడానికి కారణం ఇదే.

కొంతమందికి చెవులు బలహీనంగా ఉండి, నోరు వదులుగా ఉంటుంది. 
ఏదైనా విన్న వెంటనే, అది నిజమో కాదో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించకుండా చుట్టుపక్కల వారికి చెప్పి, సమాజంలో తప్పుడు జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తారు. 
అందుకే దాని విలువ ఒక్క బంగారు నాణెం మాత్రమే."

స్పృహలో ఉండి చేసే పనులలో,  మనం వల్ల జరిగే అన్ని తప్పులు* *ఎక్కువగా మనం ఏమి మాట్లాడతాం, ఎలా మాట్లాడతాం అన్నదాని మీదే ఆధారపడి ఉంటాయి.

No comments:

Post a Comment