Monday, October 16, 2023

 ఒకరోజు వివేకానందుడు తన నలుగురు శిష్యులతో కలకత్తాలో ఒక వీధిలో భిక్షకు బయలుదేరాడు .

మరీ పెద్ద చప్పుడు కాకుండా ఒక మోస్తరు ధ్వనితో గంట కొడుతూ -భవతి భిక్షామ్ దేహి - అని అడుగుతున్నారు . ఒక ఇంట్లో నుండి - చేయి ఖాళీ లేదు పొమ్మని సమాధానం వచ్చింది . ఒకామె సగం పాడయిపోయిన అరటిపండు వేసింది .
ఒకామె ఒంటికాలిమీద లేచి తిట్టింది . శాపనార్థాలు పెట్టింది . ఊగిపోయింది . ఒకరిద్దరు భిక్షాపాత్రల్లో బియ్యం పోశారు .

పాడయిపోయిన అరటిపండు భాగాన్ని తొలిగించి - బాగున్నంతవరకు దారిలో కనపడిన ఆవుకు పెట్టి మఠం చేరుకున్నారు . వారివారి పనుల్లో మునిగిపోయారు .

మధ్యాహ్నం భోజనానంతరం ఒక శిష్యుడు చాలా దిగాలుగా గుమ్మానికి ఆనుకుని కుమిలిపోతుండడాన్ని వివేకానందుడు గమనించాడు . నెమ్మదిగా అతడిదగ్గరికి వెళ్లి కారణం కోసం ఆరా తీశాడు .
పొద్దున్న భిక్షకు వెళ్ళినప్పుడు ఆమె తిట్టిన తిట్లు , శాపనార్థాలు , ప్రదర్శించిన కోపం చాలా బాధపెడుతోంది . వికారంగా ఉంది . తట్టుకోలేకపోతున్నాను - అన్నాడు .

వివేకానందుడు సమాధానం అతడిచేతే చెప్పించి ఓదార్చాడు .

ప్రశ్న - సమాధానం
----------------

ప్ర : మనకు భిక్షలో ఈ రోజు ఏమేమి వచ్చాయి ?

స : సగం పాడయిపోయిన అరటి పండు , కొద్దిగా బియ్యం .

ప్ర : మనం మఠానికి ఏమి తెచ్చుకున్నాం ?

స : కొంచెం అరటిపండు ఆవుకు పెట్టేసి , బియ్యాన్ని మాత్రం తెచ్చుకున్నాం .

"మరి తెచ్చుకున్నవాటిలో తిట్లే లేనప్పుడు , అవి నీవి కావు . నీతో రాలేదు . మనం తీసుకున్నది అరటిపండు , బియ్యమే కానీ , తిట్లను తీసుకోలేదు - ఇక్కడికి మోసుకురాలేదు . రానిదానికి - లేనిదానికి అకారణంగా బాధపడుతున్నావు." అని స్వామీజీ ఉపదేశించడంతో ఆ శిష్యుడు నిజమే కదా అని తన గురువు పాదాలకు నమస్కరించాడు.

నీతి:
మిత్రులారా ... ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తుకు తెచ్చుకొని బాధ పడిపోవద్దు. 
మీరు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు ఏవి శాశ్వతం కావని గుర్తుంచుకోండి ... ప్రశాంతమైన హృదయంతో జీవించండి. 👏👏👏

✍🏻 సర్వే జనాః సుఖినోభవంతు.

No comments:

Post a Comment