*బతుకమ్మ పండుగ:*
బతుకమ్మ పండుగ అంటే బతుకును ప్రేమించడం. జీవితాన్ని ఆరాధించడం. బతుకును పండుగలా గడపడానికి ప్రతీక. లోకంలో మనిషి జీవితానికి పువ్వు కంటే గొప్ప పోలిక కనిపించదు. పువ్వు చెట్టుకొమ్మపై మొగ్గలాగా పుడుతుంది. ఆకుల చాటున పెరుగుతుంది. యవ్వనంలో రంగులు సంతరించుకుంటుంది. వికసించి పరిమళాలను వెదజల్లుతుంది. చుట్టుపక్కన ఉన్న నలుగురికి ఆహ్లాదాన్ని పంచుతుంది. చిరుగాలులు వీస్తే అందరితో పాటు ఆనందంగా తలవూపుతుంది. తన ఉచ్ఛదశ అంతా సంతోషమే. కాదు సంతోషమే పువ్వు ఉన్నత దశ. ఇతరులను సంతోషింప చేసి తాను సంతోషించడం పువ్వు జీవితం. కాలక్రమేణా ముడుచుకు పోతుంది. జవసత్వాలు ఉడిగి క్షీణిస్తుంది. సంతోషంతో కూడిన జ్ఞాపకాలతో. ఆఖరికి నేలరాలుతుంది. తన జీవితం సాఫల్యత పొందిన ఆనందంతో. సంతృప్తితో.
చెట్టు మోడువోదు. మళ్ళీ పూలను కంటుంది. పూలు చెట్టు కలలట. Leaves are eyes of the tree, flowers its dreams అంటారు గుంటూరు శేషేంద్ర శర్మ గారు. పువ్వులు ప్రకృతి మాత కనే తీయని కలలు. అందుకనే అంత ఆనందాన్నిస్తాయి లోకానికి.
మనిషి జీవితం కూడా అంతే కదా. ఈ విశాల విశ్వంలో ఒకానొక వంశమనే శాఖోపశాఖలుగా విస్తరించిన వృక్షంపై, మన కుటుంబమనే కొమ్మపై పుట్టి, తోబుట్టువులనే రెమ్మలచాటున పెరిగి పెద్దయ్యి, మన వ్యక్తిత్వం, మన శక్తిసామార్థ్యాలనే రంగులు సంతరించుకుని వికసించి, మనం బతుకుతు, నలుగురి బతుకులకు ఊతమై, మనం చేసే సమాజ హితకారములైన పనులనే పరిమళాలను వెదజల్లి, చుట్టూఉన్న లోకాన్ని ఆహ్లాదపరిచి, మనం నిజమైన ఆనందాన్ని అనుభవించి, జవసత్వాలు ఉడుగిన తర్వాత కూడా, అదే కొమ్మపై, ఆ రెమ్మల మధ్య, కొత్తగా ఆ కొమ్నకు వచ్చిన చిగుర్లను చూపులతో ఆస్వాదిస్తూ, అందమైన జ్ఞాపకాల నీడలో చరమాంకాన్ని సంతృప్తిగా గడుపుతూ, ఒకానొక శుభముహూర్తాన నేల రాలడమే కదా మన జీవితం. మానవ జీవితం. దానిలోనే జీవన సాఫల్యం.
బతుకమ్మ పండుగ పూలపండుగ. మన బతుకు పండుగ. పువ్వు జీవితం కొన్ని గంటలు. మహా అయితే ఒక రోజు. అ ఒక్క రోజు జీవితంలోనే అది ఎన్ని దశలు చూసింది. ఎన్ని రూపాంతరాలు చెందింది. ఎన్ని కష్టసుఖాలు చూసింది. ఎన్ని ఎదురు గాల్పులు ఎదురుకున్నది. అక్కడే, అదే కొమ్మపై కూర్చుని ఎన్ని అనుభవాలు చవి చూసింది. అయినా తన రంగురంగుల అందాలను కోల్పోలేదు. సువాసనలు వెదజల్లడం మానలేదు. లోకం పట్ల, జీవితం పట్ల తన నమ్మకం కోల్పోలేదు. చివరికి మురికి కాలువలో పడిపోతానో, పరమాత్మ పాదారవిందాలలో చేరుతానో అనే ఆలోచనా లేదు. విశాల విశ్వవేదికపై ఒక చిన్న పాత్ర, ఒకే ఒక్క రోజు పాత్ర, పువ్వు అందంగా, ఆనందంగా, సంతృప్తిగా నిర్వహించి నిష్క్రమిస్తుంది. మన బతుకుకు పువ్వు ఒక ఆదర్శం.
బతుకమ్మ పూల పండుగ. మన బతుకుల పండుగ. మనం బతుకాల్సిన తీరు చెప్పే పండుగ. రోజంతా రెక్కలుముక్కలు చేసుకొని, ఏరోజుకారోజు జీవవనభృతిని సంపాదించి, ఆ కష్టమంతా మరిచి సాయంత్రం తీరైన రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, మన పల్లెలలో ఆడబిడ్డలు ఆడే బతుకమ్మ ఏం చెబుతుంది? జీవితమొక పండుగగా జీవించమని. రోజంతా కష్టసుఖాలు, ఈతి బాధలు అందరికి ఉంటాయి. వాటిని అదిగమించడానికి కృషి చెయ్యు. కష్టపడు. కాని జీవితం కష్టంగా భావించకు. సాయంకాలం అన్నీ మరిచి ఆనందించడమే. అదే తృప్తి. అదే సాఫల్యం.
ఎంత గొప్ప పండుగ ఈ బతుకమ్మ పండుగ! గ్రామీణ వ్యవసాయ జీవనవిధానంలో రూపుదిద్దుకున్న బతుకమ్మ ఎంత గొప్ప జీవన సందేశాన్ని ఇస్తుంది మనకు. గ్రామాలు దాటి, పట్టణాలు దాటి, నగరాల్లో ప్రవేశించి, ఇప్పుడు దేశవిదేశాలను జయిస్తున్నది ఈ అచ్చ తెలంగాణా పల్లెపండుగ.
ఇది ఒక సామాజికవర్గానికి సంపందించినది కాదు. దీనికి గొప్పచిన్న తారతమ్యాలు లేవు. ఇది ఒక కులానికి, మతానికి సంబంధించిన వ్యవహారంకాదు. ఇది సంప్రదాయం కాదు. దయ చేసి దీనిని ఫ్యాశన్ గా మార్చకండి. జీవితాన్ని సంతోషంగా గడపాలనే ఒక మహాసంకల్పం. ఈ తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగలో ఆనందిద్దాం. జీవితమంతా అలా జీవించడానికి ప్రయత్నిస్దాం. నిరాశా నిస్పృహలను దరిచేయనివ్వొద్దు. ఇది బతుకు సంబరం. Celebration of lifel!
*మీకు, మీ కుటుంబాలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు* 🙏🏼
🌷🌷🌷🌷🌹🌹🌹🌹🪷🪷🪷🪷🪷🪷🌺🌺🌺🌺🌸🌸🌸🌸🌸🌼🌼🌼🌼🌼🌻🌻🌻🌻🌻🌾🌾🌾🌾☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️🌱🌱🌱🌱🌱🌱🌱
No comments:
Post a Comment