*వరల్డ్ స్టోరీ టెల్లింగ్ డే సందర్భంగా..*
*తల్లీ, కూతురు-మధ్యలో ఆమె*
*దేశరాజు*
‘‘మిమ్మీ..’’ అంటూ టీ షర్ట్ లాగుతున్న కూతురువైపు ‘ఏమిటన్నట్టు’ ముద్దుగా చూసిందామె.
ఆ పిల్ల చేయిజాపి గేటు పక్కన వంగుని సరుకులు సర్దుకుంటున్న డెలివరీ బాయ్‌ని చూపించింది. అతడి ప్యాంట్ కిందకు జారిపోయి అండర్వేర్ బయటకు కనిపిస్తోంది.
వెంటనే ‘‘ష్’’ అంటూ గబుక్కున ఆ పిల్ల చెయ్యిని వెనక్కు లాగేసింది.
తల్లి ఏదో చెప్పబోయే లోపే, ‘‘వై’’ అంటూ కళ్లు తిప్పుతూ ప్రశ్నించింది.
‘‘నో.. డోంట్ షో లైక్ దట్’’ అందామె.
‘‘అదే ‘వయ్యీ’’ అంది ఆ పిల్ల పిలకలు ఊపుకుంటూ కుడి చేయి బిగించి బొటనవేలు చూపిస్తూ.
పిల్ల వ్యంగ్యానికి నవ్వుకుంటూ, నోటి మీద చూపుడు వేలు వేసుకుని తల అడ్డంగా ఊపింది.
‘‘మరి నా ఇన్నర్ కనిపిస్తే, తప్పన్నావే’’ అంది పిల్ల, వాదనకు దిగుతూ.
పిల్ల మారం చేయడం గమనించిన ఒకళ్లిద్దరు తలతిప్పి తల్లీకూతుళ్ల వైపు నవ్వుతూ మురిపెంగా చూశారు.
పిల్లను కోపంగా చూసి, వెంటనే తలెత్తి ముఖంపై నవ్వు తెచ్చుకుని చుట్టూ వున్న వాళ్లతో చూపులు కలిపింది.
అప్పుడే తెల్లవారి ఏడున్నరవుతోంది. నాలుగైదు టవర్లు వున్న పెద్ద గేటెడ్ కమ్యూనిటీ కావడంతో గేటు బైటొక రెండు, లోపల మరో రెండు స్కూలు బస్సులు వచ్చి నిలుచున్నాయి. ఇక ఆటోలు, వ్యాన్‌లకైతే కొదవే లేదు. అందరూ తలో పక్కా ఆపుకుని పిల్లల కోసం ఎదురుచూస్తున్నారు. వీరు కాకుండా, భార్యలను పికప్ పాయింట్ల దగ్గర డ్రాప్ చేయడానికి టూవీలర్లపై బయలుదేరుతున్న భర్తలు కూడా నెమ్మదిగా హారన్ కొడుతూ.. వాళ్లనీ, వీళ్లనీ తప్పించుకుంటూ వెళ్తున్నారు.
మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం కాదని ఎవరైనా అనుకుంటే.. వారిని ఇక్కడకు తీసుకొస్తే అర క్షణంలో ‘అవున’ని తలూపెస్తారు. కులాలు, మతాలే కాదు; వేష, భాషలు, అలంకరణలు కూడా ఏ ఫ్యాషన్ డిజైనరూ పట్టుకోలేనంత వైవిధ్యంగా వుంటాయి. లెగ్గిన్‌లూ, పలూజాలు, త్రీఫోర్త్‌లు, ఫ్రాక్‌లు, గౌన్‌లు.. అబ్బో ఒక్కటేమిటి? ఏవి ఏమిటో, వాటిని ఎలా పిలవాలో తెలుసుకోవడానికి డిక్షనరీ వెతకాల్సిందే. పాపం, మగవాళ్లలో మాత్రం వైవిధ్యం కరువే. పైన బట్ట, మధ్యలో గుప్పెడో, బానెడో పొట్ట, కిందనో జానెడు బట్ట-దాన్నే నిక్కరు-లేదంటే స్టయిల్‌గా షార్ట్స్ అంటారు కదా, అందరూ వాటితోనే కాలక్షేపం చేసేస్తున్నారు. ఇలా షార్ట్స్ వేసుకునే మమ్మీలు కూడా తక్కువేమీ కాదు. కాకపోతే, వాళ్లేసుకునే షార్ట్ లెంగ్త్‌ని బట్టి కాస్త చాటుగా, దూరంగా నిలబడి వుంటారు వాళ్లు. వీళ్లల్లోని దాదాపు అందరికీ-ఆడా, మగా తేడా లేకుండా- సంవత్సరానికి కాదు, నెలకే లక్షల్లో వస్తాయి జీతాలు. అంత ఘనం సంపాదనకు కారణం తెలీదుగానీ, బుద్ధులే పిట్ట కొంచెం అన్నట్టు ఉంటాయి. కాకపోతే, ఒక్కొక్కరివీ ఒక్కో పిట్ట సైజులో వుంటాయి. అంతే తేడా.
కాసేపటికి సందడి తగ్గింది. పిల్లల్ని హత్తుకోవడాలు, ముద్దులు పెట్టుకోవడాలు, బుజ్జగించడాలు, బాక్సులో పెట్టిందంతా స్కూల్లో తినెస్తే, ఇంటికి రాగానే వారికి ఇష్టమైనవి ఏవో ఇస్తామని ఆశలు పెట్టడాలు పూర్తయి, బస్సులు, ఆటోలు కదిలి వెళ్లిపోయేసరికి-అందరికీ ఏదో పెద్ద భారం దిగిపోయినట్టు అనిపించింది. కొందరు విశాలమైన కలుగుల్లాంటి ఫ్లాట్లలో దూరిపోతే, మరికొందరు వాకింగ్ మొదలు పెట్టారు. ఒకే టవరూ, ఫ్లోర్‌కు చెందినవారు మాత్రం చిన్నచిన్న గుంపులుగా కబుర్లలో పడ్డారు.
అప్పటి వరకు విజిల్స్ వేస్తూ, చేతులు ఊపుతూ తెగ హడావిడి చేసేన సెక్యూరిటీ వాళ్లు ‘హమ్మయ్యా’ అనుకుంటూ టోపీలు తీసేసి, నిదానంగా ఓ పక్కకు వెళ్లి ఫోన్లు చూసుకుంటున్నారు. అక్కడక్కడా వున్న కొద్దిమందీ కూడా వెళ్లిపోతే, ఇళ్ల నుంచి తెచ్చుకున్న సద్దన్నాలు తినాలని చూస్తున్నారు వాళ్లు.
తెలిసిన ఒకళ్లిద్దరిని పొడి, పొడిగా పలకరించేసి లిఫ్ట్ ఎక్కిందామె. లిఫ్ట్ పైకి వెళ్తుంటే, కూతురు గురించిన ఆమె ఆలోచనలు కూడా ఎక్కడికోవెళ్తున్నాయి. చివరకు ‘హీ పేంపర్డ్ టూమచ్. అందుకే అసలు ఆడపిల్ల లక్షణాలే లేకుండా పోయాయి దీనికి’ అని తప్పంతటినీ భర్త మీదకు తోసేసి ఓ నిట్టూర్పు విడిచింది.
ఆఫీసుకు తయారై కళ్లజోడు, కీ చైన్ తీసుకుంటూ భర్త వైపు చూసింది. సీరియస్‌గా ఆఫీస్ కాల్‌లో వున్న అతడు, ‘బాయ్’ అన్నట్టు చెయ్యి ఊపాడు రొటీన్‌గా. ఆమె కూడా రొటీన్‌గా ఓ ఫ్లయింగ్ కిస్ విసిరి బయటపడింది.
కారులో కూర్చుని కళ్లజోడు, ఇయర్ పాడ్స్ పెట్టుకుని కారును పార్కింగ్‌లోంచి బయటకు తీసుకొచ్చింది. అంతలోనే వాళ్ల అమ్మ నుంచి ఫోన్. పక్క సీటులోని మొబైల్ వైపు నవ్వుతూ చూసి గ్రీన్ బటన్ పైకి స్వైప్ చేసింది.
‘‘ఏమే బయల్దేరావా?’’ అంది అట్నించి ఆవిడ.
‘‘ఆఁ..’’ అని ‘‘నీకెలా తెలిసిపోతుందమ్మా, నేను బయల్దేరా అని. కరెక్ట్ టైంకి ఫోన్ చేస్తావ్?’’ అని అడిగింది.
‘‘జస్ట్ కోఇన్సిడెన్స్ లేవే. ఇంతకీ అది స్కూలుకు పోయిందా?’’ అని అడిగింది.
‘‘ఎప్పుడూ నీ మనవరాలి గురించేగాని.. నా గురించి అడగవా? దాన్ని స్కూలుకు పంపకుండానే వుంటానా?..’’ అని ఇంకా ఏదో అనబోతుండగానే,
‘‘నీ గురించి ఏమడగాలి. యు ఆర్ ఆల్రెడీ గ్రోనప్’’ అందావిడ.
‘‘అంతేలే, నేనెలా పోయినా మీకెవరికీ అక్కర్లేదు’’ అని గారంగా నిష్టూరమాడింది.
ట్రాఫిక్‌తో పాటు మాటలూ నిదానంగా సాగుతున్నాయి. కారులో ఏసీ, కళ్లకున్న గ్లాసెస్‌తో పాటు చెవిలో అమ్మ మాటలు కూడా ఆమెకు హాయినిస్తున్నాయి.
‘‘అసలు, అదింత లేదుగానీ మాటే వినడంలేదమ్మా. ప్రతిదానికి ఎదురు ప్రశ్నలు. మరీ ఎక్కువ పేంపర్ చేస్తున్నామేమో అనిపిస్తోంది’’ అంది.
‘‘ఎదిగే వయసు కదే. ఈ కాలం పిల్లలు అంతే. అందులోనూ మనది హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కదా. ఆ మాత్రం ప్రశ్నించే తత్వం వుంటుందిలే’’ అందావిడ.
వెంటనే ఏదో గుర్తుకు వచ్చినదానిలా ‘‘ఏంటి, నువ్వింకా ఆఫీసుకు రెడీ కాలేదా?’’ అని తల్లిని అడిగింది.
‘‘అవుతున్నా. అవుతూనే.. మాట్లాడుతున్నా. మాదీ సిటీయేగానీ.. మీ అంత పెద్ద సిటీ కాదు కదా. అందుకని మీలా గంటల గంటలు ముందుగా బయల్దేరక్కర్లే’’ అందావిడ.
‘‘మొన్న స్కూల్లో గర్ల్స్ అందరినీ ఓ హాలులోకి తీసుకెళ్లి, ఫ్రాక్స్ లోపల షార్ట్స్ వేసుకు రావాలని చెప్పారటమ్మా. ఇదేమందో తెలుసా, ఇంటికొచ్చి? ఓన్లీ గర్ల్స్ కే ఎందుకు చెబుతారు? బాయ్స్ ని కూడా వేసుకోమనాలి కదా. ఇటీజ్ నాట్ ఫెయిర్ అంది. నాకైతే ఏం చెప్పాలో తోచలేదు’’ అంది మనవరాలి మీద అమ్మమ్మకు కంప్లయింట్ చేస్తూ.
‘‘ఏంటే.. నాట్ ఫెయిర్ అందా? నిజంగానే.. దానికి అంత పెద్ద మాట ఎలా తెలిసిందే? ఎక్కడ వింది?’’ అని బోలెడంత సంతోషం, ఆశ్చర్యం మిళితమైన గొంతుతో అడిగింది అమ్మమ్మ.
‘‘అది నన్ను తిట్టిందంటే నీకు ఆనందం కదూ?’’ అని మళ్లీ ‘‘ఏమో.. నాకు మాత్రమేం తెలుసు. ఎంతసేపూ ఇంటర్నెట్‌లోనే పడుంటారుగా.. దే హియర్ సమ్ వేర్’’ అంది.
‘‘నువ్వూరికే దాని మీద విరుచుకుపడకు. అది ఇప్పటికే కరాటే, స్విమ్మింగ్ నేర్చుకుంటోందిగా, కొంచెం శ్రద్ధ పెడితే ఆ అగ్రెసివ్‌నెస్‌కి అది ఏ ఐయ్యేఎస్సో, ఐపీఎస్సో అయిపోతుందేమోనే’’ అందావిడ, మనవరాలిని గర్వంగా ఊహించుకుంటూ.
‘‘ఐయ్యేఎస్సూ, ఐపీఎస్స్ సంగతి అలా వుంచు. రేపిది మెచ్యూర్ అయితే ఎలా భరించాలా అని ఆలోచిస్తున్నా. ప్రతిదానికీ బాయ్స్ తో కంపేర్ చేసుకుంటుంది. అప్పుడైనా మాట వింటుందో లేదో?’’ అంది దిగులుగా.
‘‘అప్పుడే ఏం కాదులే, ఇంకా టైముంది’’ అని ఆగి, ‘‘ఏమే.. ఏమైనా ఫంక్షన్ చేస్తారా?’’ అందావిడ, మెల్లగా.
వెంటనే బాణంలా దూసుకు వెళ్లింది ప్రశ్న ‘‘మాకు చేసావా అమ్మా, నువ్వు’’ అని.
‘‘మా అప్పటికే బాగా తగ్గిపోయాయి అలాంటి ఫంక్షన్లు. మీసరికి అసలు లేనట్టే అనుకోవాలి. కానీ, అదేంటో చిత్రంగా, ఇప్పుడు మళ్లీ మొదలెట్టారే. బహుశా దేశంలో సంస్కృతి, సంప్రదాయాల గోల ఒకటి ఎక్కువయ్యింది కదా. దాని వల్లనుకుంట చాలా గ్రాండ్‌గా, అంతెత్తున ఫ్లెక్సీలు కూడా పెట్టి చేస్తున్నారే’’ అంది తల్లి, కాస్త గొంతు తగ్గించి.
‘‘సిగ్గులేకపోతే సరి..’’ అంది విసురుగా ఆమె.
‘‘బాగా చెప్పావ్. సరేగానీ, ఆ సందర్భం వచ్చినప్పుడు పిల్లకు పెట్టడానికి వీలుగా ఓ మంచి నెక్లెస్ కొని వుంచు. ఏ పార్లర్ వాళ్లనో పిలిపించి, మేకప్ అదీ చేయించి.. ఇంట్లోనేలే-పిల్లదాన్ని రెడీ చేసి ఫొటోలు దిగుదాం’’ అని మనవరాలితో తాను తీర్చుకోవాల్సిన ముచ్చట్లు ఏకరవు పెట్టింది అమ్మమ్మ.
కన్నతల్లి ఓవైపు, కన్న బిడ్డ మరో వైపు.. కాదని ఎలా అనగలదు. ముసిముసిగా నవ్వుకుంటూ, తల్లి మాటలకు ‘ఊ..’ కొడుతూనే ఆఫీసుకు చేరుకుందామె.
***
ఆ సందర్భం రానే వచ్చింది. పిల్లను గదిలోకి పిలిచి, గుసగుసగా జాగ్రత్తలు చెప్పబోయింది వాళ్లమ్మ.
‘‘నువ్వు మరీ ఓవరేక్షన్ చేయొద్దు. ఐ నో. అయినా, ఏంటి? నేనేదో తప్పు చేసినట్టు అంత సీక్రేట్‌గా..’’ అని చిరాకుపడుతూ బయటకు వెళ్లబోయింది పిల్ల.
గబుక్కున లేచి దాని చేయి పట్టుకుని ఆపి ‘‘ప్లీజ్ హియర్ మీ డియర్, స్కూల్ బ్యాగులో కూడా ఒక ప్యాడ్ ఎస్ట్రా పెట్టుకో. అవసరమైతే..’’ అని ఆమె వీలైనంత సహనంగా చెప్పే ప్రయత్నం చేసింది.
‘‘మిమ్మీ..’’ అని గట్టిగా అరిచిందా పిల్ల.
మళ్లీ తనే ‘‘ఆటలాడుకుంటున్నప్పుడు దెబ్బలు తగలవా? అప్పుడు బ్లడ్ రాదా? అది రెడ్‌గా వుండదా? అది కూడా డ్రెస్‌కు అంటుకుంటుంది కదా? మరి దీనికెందుకు అంత ఓవర్ చేస్తున్నావ్?’’ అంటూ తల్లిపై టపటపా ప్రశ్నలు సంధించింది.
తల్లికి పిచ్చ కోపం వచ్చింది. దాన్ని బలవంతంగా అణచుకుంటూ ‘‘ప్లీజ్.. లిజెన్..’’ అని ఏదో చెప్పబోయింది.
‘‘ప్లీజ్ .. స్టాప్’’ అంటూ రెండు చేతులతో చెవులు మూసుకుని బయటకు వెళ్లిపోయింది ఆ పిల్ల.
‘‘హౌ కేర్లెస్ యూఆర్..’’ అని గట్టిగా అరవడం మినహా, ఆ తల్లి ఏమీ చేయలేకపోయింది.
విషయం తెలిసిన తర్వాత వీకెండ్‌కి అమ్మమ్మా, తాత వచ్చి వాలిపోయారు. ఆ రెండు రోజులూ పిల్లను అమ్మమ్మ మామూలుగా కంటే ఎక్కువ గారం చేసింది. తల్లి మీద అరిచినట్టు కాకుండా, అమ్మమ్మతో ప్రేమగానే అల్లుకుపోయింది పిల్ల. తను అనుకున్నట్టుగానే నగలూ, డ్రస్సులూ వేసి; మేకప్పులు చేయించి, ఫొటోలు తీయించి, సెల్ఫీలు తీసుకుని మనవరాలితో ఆ రెండు రోజులూ తెగ హడావిడి చేసింది అమ్మమ్మ.
‘పోనీలే, ఎవరో ఒకరి మాట వింటోంది. లేకపోతే ఎలాగో అనుకున్నా’ అని లోలోన మురిసిపోయింది తల్లి.
కానీ, ఆ సంతృప్తి ఎంతోకాలం నిలువదని వాళ్లెవరికీ అప్పటికి తెలీదు.
***
కూతురు స్కూల్లో చేసిన ఘనకార్యం, కాస్త ఆలస్యంగానే తెలిసింది తల్లికి. తన తల్లి తరంలో చెప్పుకోవడానికి ఇష్టపడని, తమ తరంలో గుసగుసగా మాట్లాడుకునే విషయంలో ఈ తరం ఇంత లౌడ్‌గా స్పందించడం ఆమెను ఆశ్చర్యచకితురాలను చేసింది.
ఆమె కూతురు చదివేది మామూలు దుంపలబడి కాదు. బాగా పేరున్న పెద్ద కార్పొరేట్ స్కూలు. అక్కడ సీటు దొరకాలంటే మెరిటే తప్ప, మినిస్టర్ రికమెండేషనైనా చెల్లదని చెప్పుకుంటారు. కానీ, ఈ మధ్య అక్కడి పరిస్థితులు మారిపోయాయి. అమ్మాయిల కట్టు, బొట్టు మీద ఆంక్షలు పెరిగిపోయాయి. బొట్టు పెట్టుకోవాలని, జడలు వేసుకోవాలని అనధికారికంగా చెప్పడం ప్రారంభించారు. అమ్మాయిల చదువుల మీద టీచర్లు శ్రద్ధ పెట్టడం మానేశారు. వాళ్లకి వుండే స్పోర్ట్స్ క్లాసులు కూడా తగ్గించేశారు. పిల్లల్నీ, వాళ్ల చదువుల్నీ పట్టించుకునే తీరుబాటు లేని తల్లిదండ్రులు-పెరుగుతున్న ఫీజుల్ని మాత్రం ఆన్‌లైన్‌లో సునాయసంగా కట్టెస్తూ.. పిల్లల్ని గొప్ప స్కూల్లో చదివించేస్తున్నామనే గర్వంలో వున్నారు.
లక్షలు వసూలు చేస్తూ, ప్రొజెక్టర్లు, డీజీ బోర్డులతో హైటెక్ సొగసులు ఒలకబోసే ఆ స్కూల్లో కూడా వాష్ రూమ్‌ల సమస్య మాత్రం మామూలే. ఇంక అమ్మాయిల విషయం అనేసరికి చెప్పనే అక్కర్లేదు. తక్కువ టాయిలెట్లు, అవి కూడా ఇరుగ్గా వుండటంతో ప్యాడ్స్ మార్చుకోవడానికి పెద్ద పిల్లలు చాలా ఇబ్బంది పడేవాళ్లు. దాంతో టాయిలెట్ల దగ్గర చాలాసేపు నిరీక్షించక తప్పని పరిస్థితి.
ఒకసారి వాష్ రూమ్ దగ్గర వెయిట్ చేస్తున్న గర్ల్స్ ని చూసి బాయ్స్ బాగా టీజ్ చేశారు. వెంటనే వీళ్లు క్లాస్ టీచర్‌కి కంప్లయింట్ చేశారు. ఆమె ఏమీ చేయలేకపోయింది. తర్వాత ప్రిన్సిపాల్‌కి కంప్లయింట్ చేశారు.
‘మేం చూస్తాం లెండి, ప్లీజ్ గో టు యువర్ క్లాసెస్’ అని వీళ్లని హడావిడిగా పంపేశారు. కానీ, వాళ్లేమీ యాక్షన్ తీసుకోలేదు. దాంతో అమ్మాయిలందరూ ఇరిటేటింగ్‌గా వున్నారు.
యాక్షన్ ఏమీ తీసుకోకపోవడంతో అలుసుగా తీసుకున్న బాయ్స్, మరోసారి వాష్ రూమ్ దగ్గర వేచి వున్న అమ్మాయిలను చూసి, ఒకబ్బాయి ‘‘ఏంటీ, అంతా బ్రెడ్స్ పట్టుకుని రెడీ అయిపోయారు. స్కూలుకెందుకొస్తారో’’ అని కామెంట్ చేశాడు. దానికి మిగిలిన బాయ్స్ పగలబడి నవ్వారు.
అసలే, పిచ్చ చికాకులో వుందేమో, ఆ పిల్ల ‘‘అవున్రా, బ్రెడ్డే. స్కూలు అయిపోయాక, రారా. జామ్ రాసి ఇస్తా’’ అని కోపంగా రిటార్ట్ ఇచ్చింది. తమను అణచివేస్తున్నారని, ఎవరికీ చెప్పినా పట్టించుకోవడం లేదని కోపంతో లోలోన రగిలిపోతున్న అమ్మాయిలకు ఆ రిటార్ట్ పెద్ద రిలీఫ్ ఇచ్చింది. అంతే, అందరి ముఖాల్లో ఆనందం పెల్లుబికింది. ‘ఓ’ అంటూ గట్టిగా అరుస్తూ అమ్మాయిలంతా బాయ్స్ ని వెక్కిరించారు.
అంతే, బాయ్స్ తమకు తీవ్ర అవమానం జరిగినట్టు రెచ్చిపోయారు. అసలు రూపం ప్రదర్శించారు. బూతులతో రెచ్చిపోయారు. టీచర్లకీ, ప్రిన్సిపాల్‌కీ ఫిర్యాదు చేశారు. అమ్మాయిలు ఫిర్యాదు చేసినప్పుడు స్పందించని టీచర్లు, ఇతర సిబ్బంది, ప్రిన్సిపాల్-అంతా ఈసారి తీవ్రంగా స్పందించారు. ‘ఆడ పిల్లలకు అంతచేటు బరితెగింపు పనికిరాదని, వారికి గట్టిగా బుద్ధి చెప్పకుండా ఇలాగే వదిలేస్తే మన సంప్రదాయం, సంస్కృతి నాశనం అయిపోతాయ’ని ముక్తకంఠంతో గగ్గోలు పెట్టారు. చివరికి ఆ పిల్లతోపాటు నలుగురు అమ్మాయిలను ఎంపిక చేసుకుని, ‘వాళ్ల ప్రవర్తన అభ్యంతరకరంగా ఉందం’టూ తల్లిదండ్రులకు మెయిల్స్ పెట్టారు. ఇలాగే కొనసాగితే టీసీ ఇచ్చి పంపించేయాల్సి వుంటుందని హెచ్చరించారు.
కూతురు స్కూలు నుంచి వచ్చిన మెయిల్ చూడగానే ఆమెలో ఆవేశం కట్టలు తెంచుకుంది. వెంటనే దాన్ని వాళ్లాయనకు ఫార్వర్డ్ చేసి, ‘‘నీ గారాలపట్టి ఏం చేసిందో చూడు, ఇప్పుడు ఏంటి పరిస్థితి?’’ అని వాట్సప్‌లో మెసేజ్ చేసింది.
‘‘కూల్.. దాంతో నేనే మాట్లాడతా. తరువాత ఆలోచిద్దాం. యు నీడ్ నాట్ వర్రీ అబౌట్ ఇట్’’ అన్నాడాయన.
‘కూల్.. ఏంట్రా? కూల్..మరో స్కూల్లో సీటు దొరకద్దా’ అని మనసులో అనుకుని, విషయం తల్లికి చేరేసింది.
‘‘పిల్లదాని ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోకుండా, ఎందుకు ఆవేశపడతావ్. వాళ్ల డాడీ మాట్లాడతానన్నాడుగా. వెయిట్.. అది మరీ చిన్నపిల్లేమీ కాదు. ఈ వయసులో మనం వాళ్లతో రూడ్‌గా బిహేవ్ చేస్తే ఫలితాలు వేరేలా వుంటాయి. కంగారు పడకు’’ అని సందేశమిస్తూ ఒక అరగంట నచ్చజెప్పి, ఆమె కూడా ‘కూల్..’ చేసే ప్రయత్నం చేసింది.
కానీ, ఈలోగానే మరో సంఘటన జరిగింది. తమ తల్లిదండ్రులకు స్కూల్ వాళ్లు మెయిల్స్ పంపారని తెలిసిన పిల్లల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. అందరూ వాట్సప్‌ల్లో మాట్లాడుకున్నారు. ఫోన్లు చేసుకున్నారు. చీకటిపడే సమయానికి వారి ఆలోచన్ల చిక్కుముడులు విడిపోయాయి. దాదాపు ఆ పిల్ల క్లాసులోని సెక్షన్ వాళ్లతోపాటు, మిగిలిన సెక్షన్ల నుంచి కూడా కొంతమంది ముందుకు వచ్చారు. వెంటనే ఇంటర్నెట్ నుంచి ‘హ్యాపీ టూ బ్లీడ్’ ఇమేజ్‌లు, కోట్స్ డౌన్‌లోడ్ చేశారు. వారివారి సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. తెల్లారేసరికి అవన్నీ వైరల్ అయిపోయాయి.
స్పూల్ యజమాన్యం దిగి వచ్చింది. తమకి ఏ పాపం తెలియనట్టు ప్రిన్సిపాల్, టీచర్లపై చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియాలోనే ప్రకటించింది. గర్ల్స్ కి అవసరమైన సౌకర్యాలన్నీ కల్పిస్తామని, కొత్త టాయిలెట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. మంచి పేరు తెచ్చుకోవడానికి ఏళ్ల తరబడి కష్టపడాలి. కానీ, చెడ్డ పేరు సెకన్లలో వస్తుందని యాజమాన్యానికి తెలుసు. ఆ చెడ్డ పేరు అడ్మిషన్లు, రాబడిపై ప్రభావం చూపుతుందని కూడా తెలుసు. అందుకే ఓ మెట్టు దిగింది. పిల్లల సంగతీ, వాళ్ల పొగరు సంగతీ తరువాత చూసుకోవచ్చని కూడా అనుకుని వుండవచ్చు.
పిల్లలు తమకు అన్నీ తెలుసనీ, ఏవైనా చెయ్యగలమనీ అనుకుంటారు. ఎప్పుడైనా అవి విజయవంతం అయితే, వారి ఆనందానికి పట్టపగ్గాలు వుంటాయా? ఆ గర్ల్స్ కూడా అంతే. కేరింతలతో కోలాహలం చేశారు.
కూతురు, స్నేహితురాళ్లతో కలిసి సంతోషంతో విక్టరీ సైన్ చూపుతూ తీసుకున్న ఫొటోలను తల్లికి వాట్సప్‌లో షేర్ చేసింది. ‘‘టెన్షన్ పెట్టిందిగానీ, నీ మనుమరాలు గట్టిదే. షి వాన్’’ అని సంతోషంతో ఆమె మెసేజ్ చేసింది.
‘‘పంజరంలో పక్షికి పుట్టిన పిల్లలు పంజరంలోనే పెరగడానికి ఇష్టపడచ్చేమోగానీ, ఎగిరే పక్షి పిల్లలు మాత్రం రెక్కలు రాగానే స్వేచ్ఛగా ఎగరడానికే ఇష్టపడతాయి. కూతురు పుట్టగానే నీతులు చెబుతున్నావుగానీ, నువ్వు ఆ వయసులో ఎంత అల్లరి చేశావో, నీకేం తెలుసు? నువ్వు ఊరికే, దాన్ని మరీ కంట్రోల్ చేయాలని చూడకు. అది నా మనవరాలే’’ అని గర్వంగా సమాధానం ఇచ్చింది తల్లి.
‘ఆ తల్లినీ, ఈ కూతురునీ భరించడం నా వల్ల కాదు’ అనుకుంటూ సగటు మాడ్రన్, ఎడ్యుకేటెడ్ మదర్‌లా ఓసారి భుజాలు ఎగరేసి-స్టయిల్‌గానే కాదు, కాస్త గర్వంగానూ నవ్వుకుందామె.
X X X
*నోట్: ఈ కథతోపాటు మరో పన్నెండు కథలు వున్న నా కొత్త కథా సంపుటి ‘ఆలీబాబా అనేక దొంగలు’ను రూ.150/- 9948680009కు జీ పే, ఫోన్ పే చేసి పొందవచ్చు.*
No comments:
Post a Comment