సద్గురు: మనం పాశ్చాత్య దేశాల నుండి గ్రహించిన ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే, "relationship" అనగానే, ప్రజలు సాధారణంగా అది శారీరక సంబంధం గురించి అనుకుంటారు. కానీ సంబంధాలు రకరకాలుగా ఉండొచ్చు. మీకూ మీ తల్లిదండ్రులకు మధ్య, మీకూ మీ స్నేహితులకు మధ్య, అలాగే మీకూ ఇంకా అనేక ఇతర వ్యక్తులకు మధ్య, ఇలా రకరకాల సంబంధాలు ఉంటాయి.
శారీరక సంబంధాల విషయంలో, కొంత కాలం తర్వాత, సహజంగానే ఒకరి శరీరం గురించి మరొకరికి ఉన్న ఆసక్తి తగ్గిపోతుంది. అలా జరిగినప్పుడు, వారిని దగ్గరకు చేర్చిన ఈ ప్రధాన అంశం కరిగిపోతున్నప్పుడు, ఎందుకో తెలియకుండానే, ఒకరి విషయంలో మరొకరు అప్రియంగా ప్రవర్తించడం ప్రారంభిస్తారు, ఎందుకంటే ఈ సంబంధం ప్రాధమికంగా, అవతలి వ్యక్తి నుండి మాధుర్యాన్ని ఇంకా ఆనందాన్ని పొందడం గురించి అయి ఉంటుంది!
వారి నుంచి సంతోషాన్ని పిండాలని ప్రయత్నిస్తే, అది మునుపటిలా అదే ఫలితాలను ఇవ్వనప్పుడు, అప్రియ భావన రావడం ప్రారంభమవుతుంది. సంబంధాల స్వభావం ఎలా ఉంటుందంటే, వ్యక్తులు ఒకసారి కలిసి ఉంటే, వారు చాలా విషయాలు పంచుకోవాల్సి ఉంటుంది. సహజంగా ఒకరివల్ల మరొకరు అసౌకర్యానికి గురై గొడవలు జరిగే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఉత్తమమైన పని ఏంటంటే - మిమ్మల్ని మీరు స్వతహానే ఆనందంగా ఇంకా ఉల్లాసంగా ఉండేలా మానేజ్ చేసుకోవడమే! అలాగే ఈ సంబంధాలు కేవలం వీటిని పంచుకోవటానికి మాత్రమే అయి ఉండాలి. అప్పుడు చూడండి, సంబంధాల విషయంలో ప్రజలు పడే పాట్లు మీరు పడాల్సిన అవసరం ఉండదు. మీరు అందరితోనూ అత్యుత్తమ సంబంధాలు కలిగి ఉండొచ్చు. మీరు జీవితంలో చక్కని సంబంధాలు కలిగి ఉండాలి!
No comments:
Post a Comment