Friday, April 12, 2024

దేవర న్యాయం

 *📖 మన ఇతిహాసాలు 📓*

*దేవర న్యాయం*

ఒక రోజు సత్యవతి భీష్ముని పిలిపించి రాజ్యానికి రాజు లేకపోవడం హానికరం కనుక పట్టాభిషిక్తుడై వివాహం చేసుకుని వంశోద్దరణ చేయమని కోరింది. భీష్ముడు తాను ఆడిన మాట తప్పనని చెప్పి వంశోద్దరణ కోసం దేవరన్యాయం పాటించమని తల్లికి నచ్చ చెప్పాడు. ఉదాహరణగా పూర్వం పరశురాముని దండయాత్రలో రాజులందరూ మరణించగా వారి పత్నులు ఉత్తమ బ్రాహ్మణులందు సంతానం పొంది వంశాలను నిలిపారని చెప్పాడు. అలాగే బృహస్పతి ఒక రోజు తన తమ్ముడైన ఉతధ్యుని భార్య మమతపై మనసు పడగా అప్పుడు ఆమె గర్భస్థ శిశువు దానికి అభ్యంతరం చెప్పగా అతనిని పుట్టు గుడ్డివి కమ్మని బృహస్పతి శపించాడు. అతడే దీర్ఘతముడు. అతడు గుడ్డి వాడైనా వేదవేదాంగాలనూ అభ్యసించాడు. అతని భార్య ప్రద్వేషిణి. అతనికి చాలా మంది పుత్రులు కలిగినా భార్య అతనిని ద్వేషిస్తూ ఉంది. చివరికి ఆమె అతనిని ఇక భరించలేనని తనను విడిచి వెళ్ళమని చెప్పింది. దీర్గతముడు ఆమెపై కోపించి " స్త్రీలు ఎంతటి వారైనా భర్త లేని ఎడల అలంకార హీనులులై బ్రతుకుదురుకాక " అని శపించాడు. అందుకు కోపించిన ప్రద్వేషిణి తన కొడుకులతో చెప్పి వారితో దీర్గతముని తాళ్ళతో బంధించి నదిలోకి త్రోసి వేయించింది. అతడు వేదాలు వల్లెవేస్తూ నదిలో కొట్టుకు పోతున్నాడు .అది చూసిన బలి అనే రాజు అతనిని విడిపించి తనతో తీసుకు వెళ్ళాడు. బలి దీర్గతమునితో సంతాన హీనుడినైన తనకు ఉత్తమ బ్రాహ్మణుడివయిన నీవు సంతానం ప్రసాదించాలని వేడుకున్నాడు. దీర్గతముడు అందుకు అంగీకరించాడు. అతనిద్వారా సంతానము కని ఇవ్వమని భార్య అయిన సుదేష్ణను కోరాడు. సుదేష్ణ దీర్గతముని చూసి అసహ్యపడి అతని వద్దకు తన దాసీని పంపింది. దాసీకి అతని వలన పదకొండు మంది కుమారులు కలిగారు. దీర్గతముని వలన వారు దాసీ పుత్రులని తెలుసుకుని సుదేష్ణను తిరిగి అతని తగ్గరకు పంపాడు విధిలేక సుదేష్ణ అతని వలన ఒక కుమారుని కన్నది . అతడే అంగరాజు. కనుక విధిలేని పరిస్థితిలో క్షత్రియులు ఉత్తమ బ్రాహ్మణుల వలన సంతానం పొందడం ధర్మ విరుద్దం కాని అనాదిగా వస్తున్న ఆచారమని కనుక ఉత్తమమైన బ్రాహ్మణుని తీసుకు వచ్చి వంశోద్దరణ మార్గం చూడమని భీష్ముడు సత్యవతితో చెప్పాడు.

*దృతరాష్ట్రుడు పాండురాజు విదురుల జననం*


భీష్ముని సలహా విన్న తరవాత సత్యవతికి తనకు పరాశరుని వలన కలిగిన వ్యాసుడు గుర్తుకు వచ్చాడు. ఆవిషయం భీష్మునకు చెప్పింది. వ్యాసుడు సమస్త ధర్మాలూ తెలిసిన వాడు. మహాతపశ్శాలి వేదవేదాంగ పారంగతుడు అతడు నీ తమ్ముని భార్యలకు సంతానం ప్రసాదించగలడు అని చెప్పింది. ఆమె వెంటనే మనసారా వ్యాసుని ప్రార్ధించింది. వ్యాసుడు ప్రత్యక్షమై తల్లికి నమస్కరించాడు. సత్యవతి వ్యాసునకు పరిస్థితి వివరించి దేవర న్యాయం అనుసరించి తనకు మనుమలను ఇచ్చి వంశోద్దరణ చేయమని కోరింది. వ్యాసుడు తల్లి ఆజ్ఞను శిరసా వహిస్తానని మాటిచ్చాడు. ముందుగా పెద్దకోడలైన అంబికను వ్యాసుని వద్దకు పంపగా ఆమె సన్నని నల్లని జఠలతో భయంకరంగా ఉన్న వ్యాసుని చూసి కన్నులను మూసుకున్నందువలన ఆమెకు మహాబలవంతుడైన కుమారుడు గుడ్డిగా పుట్టాడు. అతడే ధృతరాష్ట్రుడు .రెండవ రోజు రెండవ కోడలయిన అంబాలికను పంపగా ఆమె వ్యాసుని తేజస్సుకు భయపడి పాలిపోయినందున ఆమెకు పాండు వర్ణంతో కుమారుడు కలిగాడు. అంబికకు గుడ్డి వాడు కలిగినందుకు దుఃఖించిన సత్యవతి తిరిగి అంబికను వ్యాసుని వద్దకు పంపింది. అంబిక అత్తగారి మాట కాదనలేక సమ్మతించినా అందుకు ఆమె మనసు సమ్మతించక తన దాసీని అలంకరించి వ్యాసుని వద్దకు పంపింది. ఆ దాసీకి మాండవ్య మహాముని శాపం అందుకున్న యమధర్మరాజు కుమారునిగా జన్మించాడు. అతడే విదురుడు.అది విన్న జనమేజయుడు మాండవ్య ముని యమధర్మ రాజుకు శాపం ఎందుకు ఇచ్చాడని వైశంపాయనుని అడిగాడు.

No comments:

Post a Comment