*🌹ఆయన మరణించాక ఎవరు వచ్చారు?*
*చాలా కాలం క్రితం ఉత్తరప్రదేశ్ లోని బృందావనానికి దగ్గర్లో ఒక చిన్న గ్రామంలోకి ఒక వ్యక్తి వచ్చి ఒక చిన్న గుడిసె కట్టుకొన్నాడు. గుడిసె మధ్యలో ఒక తెర ఆ గుడిసెను రెండు భాగాలుగా విడదీస్తుంది.*
*ఆయన ఎప్పుడూ శ్రీకృష్ణుడిని ధ్యానిస్తూ, పూజిస్తూ వుండేవాడు. మాట్లాడే ప్రతి మాటకు ముందు , వెనుక "శ్రీకృష్ణ" అని లేదా "రాధేశ్యాం" అని అనేవాడు. ఒక్కోసారి కళ్ళు మూసుకొని నవ్వుతూ ఉంటాడు, మరోసారి "అయ్యో, అంత ఇబ్బంది వచ్చిందా?" అని కళ్ళు తుడుచుకొనేవాడు. అతను ఎవరితో మాట్లాడుతున్నాడో ఇతరులకు అర్థం అయ్యేది కాదు. కొంత కాలానికి అతను ఒక పిచ్చివాడు అని ఆ గ్రామ ప్రజలు నిర్ణయించేసారు.*
*ఎవరైనా తినడానికి ఏదైనా ఇస్తే, "ఉండండి, మా అబ్బాయికి తినిపించివస్తాను" అని గుడిసెలోకి వెళ్ళేవాడు. ఎవరైనా ఏమైనా అడిగితే "ఉండండి, మా అబ్బాయి పిలుస్తున్నాడు" అంటూ లోపలికి వెళ్ళేవాడు.*
*ఇతను ఒక్కడే కదా, లోపల ఎవరు ఉంటారు? అబ్బాయి ఎవరు? ఎక్కడ ఉంటాడు? అని అందరూ ఆశ్చర్యపోయేవారు. కొందరు లోపలకి వెళ్లి చూద్దామంటే, వెళ్ళినప్పుడు లోపల గొళ్ళెం పెట్టుకొంటాడు. ఆకస్మాత్తుగా ఎవరైనా లోపలికి వెళ్లి "మీ అబ్బాయి లేడే?" అని అడిగితే "పక్క గ్రామానికి వెళ్ళాడు, పక్క ఊళ్ళోని దేవాలయం వెళ్ళాడు" అని అనేవాడు.*
*రోజంతా అతని పనులు వింతగా వుండేవి. ఆవులకు గడ్డి, పళ్ళు తెచ్చి పెడతాడు, చీమలకు బెల్లమో, గోధుమ పిండినో పెడతాడు, మధ్యాహ్నం గోధుమ రొట్టె ముక్కలను పెట్టి కాకులను పిలుస్తాడు. మొత్తం మీద ఆయన వ్యవహారం వింతగా ఉండేది.*
*కొంత కాలం తరువాత ఆయనకు ఆరోగ్యం దెబ్బతినింది. ఎవరో ఉండబట్టలేక అడిగేసారు "నీవు చనిపోతే నీ శవాన్ని ఎవరు దహనం చేస్తారు?" అందుకు ఆయన "ఇంకెవరు చేస్తారు? మా అబ్బాయి వస్తాడు, చేస్తాడు" అన్నాడు.*
*పది రోజుల తరువాత ఆయన మరణించాడు. ఆ ఊరి వాళ్ళు అతని శవాన్ని ఏమి చేయాలి? అని ఆలోచిస్తున్నారు. వాళ్ళకున్న భయాలు, అనుమానాల కారణంగా, అతని శవాన్ని తాకితే తమకేమైనా ప్రమాదం ఉంటుందేమోనని వాళ్ళు దగ్గరికి రాలేదు.*
*ఇంతలో ఎక్కడినుండో ఒక అబ్బాయి అక్కడికి నడుచుకుంటూ వచ్చాడు. ఆశ్చర్యం ఏమంటే ఆ అబ్బాయి రాగానే ఆ పల్లె లోని ఆవులన్నీ ఒక్క సారిగా అంబా అని అరిచాయి. అతను వచ్చాడు. ఆయన శవాన్ని చేతుల్లోకి తీసుకొని ముందుకు నడుస్తుంటే అతని పాదముద్రలు పడిన చోట పువ్వులు వచ్చి పడుతున్నాయి. అక్కడంతా సుగంధం వ్యాపిస్తోంది. అతను శవాన్ని దహనం చేసాడు. ఇంతలో ఆ పల్లె అంతా వినిపించేలాగా ఒక స్వరం ఇలా పలికింది ,*
*"మీరు ఈ వ్యక్తికి అప్పుడప్పుడైనా కాస్త తిండి పెట్టారు. ఇపుడు మీరు మీ ఇళ్లలోకి వెళ్లి చూసుకోండి"*
*వాళ్ళు వెళ్లి చూసుకొంటే వాళ్ళు గింజలు దాచుకోనే పాత్రలు, సంచులు, గాదెలు అన్నీ ధాన్యం తో నిండి ఉన్నాయి. ఆశ్చర్యం! ఆనందం ! ఎవరు అతను? ఇంకెవరు? శ్రీకృష్ణుడే !*
*శ్రీకృష్ణుడిని నిర్మలమైన మనసుతో, పూర్తిగా నమ్మి ధ్యానిస్తే మనకు ఏమి జరుగుతుందో తెలుసా?*
*ముందుగా ఇతరులు మన మీద నిందలు వేస్తారు, మన సంపద (డబ్బు ) తగ్గిపోవడం మొదలవుతుంది,*
*మనం ఎవరికి సహాయం చేస్తుంటామో, ఎవరిని సేవిస్తువుంటామో వాళ్ళు మనను నిందిస్తారు, బయటకు గెంటేస్తారు,*
*మనకు సహాయం చేయడానికి ఎవ్వరూ ముందుకురారు.*
*అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఎదుటివారిని ద్వేషించకుండా వుంటూ, మంచినే చేస్తూ, శ్రీ కృష్ణుడి మీద చెదరని విశ్వాసం, భక్తి కలిగివుంటే, అప్పటినుండి మన జీవితంలో నిజమైన ఆనందం అనేది అనుభవంలోకి రావడం ప్రారంభం అవుతుంది.*
*మనను చట్టుముట్టిన "మాయ" ను తొలగించడం కోసం భగవంతుడు జరిపే లీల అది. నాకున్న అనుభవంతో చెపుతున్నాను. ఆయన పెట్టే కష్టమైన పరీక్షలు నిజానికి మన మంచికోసమే అయ్యివుంటాయి. ఖచ్చితంగా. దీన్నే ఇంగ్లీష్ లో A blessing in disguise అంటారు.*
*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*
No comments:
Post a Comment