"అవసరాలు, కోరికలను ఎలా సమన్వయం చేసుకోవాలి ?"
*"నీరు పల్లానికి వెళ్ళటానికి ఏ శ్రమ అక్కర్లేదు. అదే ఎత్తుకు పంపాలంటే శ్రమ ఉంటుంది. మన అవసరానికి, కోరికకు కూడా అదే తేడా ఉంది. అవసరాలు తీర్చుకోవటం పల్లానికి ప్రవహించే నీరైతే, కోరిక ఎత్తుకు పంపే నీరు లాంటిది. మనకు వచ్చే ఆలోచనలన్నీ మనం అవసరం అనుకుంటున్నవే. ఏరోజు పూజలో ఆరోజు మనం కావాలనుకుంటున్న అవసరాలే ఆలోచనలుగా వస్తాయి. మనకు అవసరం లేనిది ఆలోచనగా రాదు. అవసరంగా మనం భావించింది ఆలోచన నుండి పోదు. నిజమైన అవసరాలేమిటో తెలుసుకొని పరిమితం చేసుకుంటే జ్ఞాపకాలు, ఆలోచనలు వాటంతట అవే తగ్గుతాయి. నాలుగు రోజులు అభ్యాసం చేస్తే ఏ విషయమైనా మనకు అలవాటుగా మారుతుంది. అలవాటుగా మారిన విషయం మనకు సహజంగా అనిపిస్తుంది. అందుకే కోరికలు, అవసరాలను గుర్తించటం అభ్యాసం చేస్తే మనసు బాధపెట్టని అలవాట్లతో హాయిగా జీవనం సాగించవచ్చు !"*
*"జగత్తులోని భేదాలు సృష్టికి సమకాలీనాలా ? కాక ఆ పిమ్మటివా ? స్రష్ట నిష్పక్షపాతియేనా ? అయిన ఒకడు కుంటి, గ్రుడ్డి, వేరొకడు ఇంకొకటిగా జన్మించుటేల ? అష్టదిక్పాలురు, ముక్కోటి దేవతలు, సప్తర్షులు నేటికినీ ఉన్నారా !?"*
*"అట్లు నిన్నే ప్రశ్నించుకో.. సమాధానం దొరుకుతుంది. మొదట తానెవరో తెలిస్తే ఇతర విషయలన్నీ విశదమవుతాయి. తన్నెరిగిన పిదప సృష్టి, స్రష్టల విషయం విచారించవచ్చు. తన్ను తానెరుగకే దైవాన్ని ఎరుగ యత్నించడం అజ్ఞానం. కామెర్ల వానికంతా పచ్చగానే కనిపిస్తుంది. అంతా పచ్చగనే ఉందని వాడంటే ఒరులు ఏమని అంగీకరిస్తారు. సృష్టికి ఒక ఆది ఉందంటారు. చెట్టు-విత్తనం లాగా విత్తనం ఎలా పుట్టింది ? సాటి చెట్టు నుండి.. ఈ ప్రశ్నల పరంపరకు అంతేమిటి ? అందుచేత మొదట తన్నుతాను ఎరిగితే తర్వాత ప్రపంచం తెలియవచ్చు !"*
"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}".
No comments:
Post a Comment