🔔 *సామాజికం..* 🔔
ఆ సైనికుడు మంచం మీద పడి ఉన్నాడు. కాలు నుజ్జునుజ్జైపోయింది. ఎముకలు పొడి పొడి అయిపోయింది. రక్తం ధారాప్రవాహంగా కారిపోతోంది.
సైనికుడు స్పృహలోనే ఉన్నాడు. “నాకు మత్తు మందు ఇవ్వండి!” అన్నాడతను.
’యుధ్దం భయంకరంగా జరుగుతోంది. మత్తు మందు స్టాక్ లేదు.’
“పోనీ పెథిడిన్ ఇవ్వండి.”
’కానీ అదీ లేదు.’
తన తోటి గూర్ఖా సైనికుడిని పిలిచాడు. “ఈ నుజ్జు నుజ్జయిపోయిన కాలును నరికెయ్” అని ఆజ్ఞాపించాడు.
సైనికుడు తెల్లబోయాడు. తన పై అధికారి కాలు నరకడానికి అతనికి చేతులు రాలేదు. “నా దగ్గర కత్తి లేదు” అన్నాడు. అతని గొంతులో వణుకు స్పష్టంగా తెలుస్తోంది.
“నా ఖుక్రీ ఇవ్వు.” ఖుక్రీ అంటే గూర్ఖా సైనికుడి కత్తి.
సైనికుడు ఆయనకు ఖుక్రీ చేతికి ఇచ్చాడు.
“దీనితో ఈ కాలును నరికేయ్”
“మై నహీ కర్ సక్తా సాహెబ్” అన్నాడు సైనికుడు. అతని ఒళ్లంతా కంపించిపోతోంది.
“సరే” అన్నాడు ఆ అధికారి. తన ఖుక్రీతో తన కాలుపై ఒక్క వేటు వేశాడు. నుజ్జు నుజ్జయిన కాలు శరీరంనుంచి వేరైపోయింది.
“దీన్ని తీసుకెళ్లు. ఖననం చేయి” అని ఆదేశించాడు ఆ అధికారి.
తన కాలును తానే తెగనరుక్కున్న ఆ వీర సైనికుడి పేరు మేజర్ ఇయాన్ కార్డోజో. అది 1971 భారత పాక్ యుద్ధం.
యుద్ధ భూమిలో పొరబాటున శత్రువు పెట్టిన ఒక మందుపాతరపై కాలు వేశాడు. అది పేలింది. అతని కాలు పూర్తిగా ముక్కముక్కలైపోయింది. దాని నుంచి మిగతా శరీరమంతా సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే తన కాలును తానే నరుక్కున్నాడు.
అయితే గాయానికి చికిత్స తక్షణం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే కార్డొజో ప్రాణం పోవడం ఖాయం. కార్డొజోను పెద్ద ఆస్పత్రికి తరలించడానికి హెలికాప్టర్ అందుబాటులో లేదు. మృత్యువు ముంచుకొస్తోంది.
అదృష్టవశాత్తూ మన సైన్యాలకు చిక్కిన పాక్ యుద్ధ బందీల్లో ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయన శస్త్ర చికిత్స చేసేందుకు ముందుకు వచ్చాడు. కార్డొజో తన కమాండింగ్ ఆఫీసర్ తో ‘నాకు పాకిస్తానీ చేతుల్లో చికిత్స చేయొద్దు!’ అన్నాడు.
“నువ్వు మూర్ఖుడివా?” కమాండింగ్ ఆఫీసర్ అడిగాడు. “నీ ప్రాణం పోతుంది. నువ్వేం మాట్లాడకు. శస్త్ర చికిత్స జరుగుతుంది.”
“అయితే నావి రెండు షరతులు!” దృఢంగా అన్నాడు కార్డొజో.
“షటప్… నువ్వు షరతులు విధించడానికి వీల్లేదు.”
“పోనీ… రెండు అభ్యర్థనలున్నాయి. మొదటిది – నాకు పాకిస్తానీ రక్తం ఎక్కించవద్దు.”
“నీకు పిచ్చా వెర్రా”?
“నేను చావడానికిసిద్ధం. కానీ నాకు పాకిస్తానీ రక్తం వద్దు.
రెండో షరతు. నాకు సర్జరీ చేసేటప్పుడు మీరు నా పక్కన ఉండాలి.”
పాకిస్తానీ సర్జన్ మేజర్ మహ్మద్ బషీర్ ఆయనకు శస్త్ర చికిత్స చేశాడు. కాలు మెరుగుపడింది.
కానీ కార్డొజో కథ అయిపోలేదు. కార్డోజో తాను సైన్యంలోనే పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. కృత్రిమ కాలును అమర్చుకున్నాడు.
ఆ కాలితో నడక మొదలుపెట్టాడు. క్రమేపీ అది పరుగుగా మారింది. ఆ తరువాత కొండలు ఎక్కడం నేర్చుకున్నాడు. ఎత్తుల మీద నుంచి దూకడం నేర్చుకున్నాడు. రెండు కాళ్లు ఉన్న సైనికులు చేసే ప్రతి పనినీ చేయడం మొదలుపెట్టాడు. యుద్ధంలో చేసే పనులను చేయడం ప్రారంభించాడు.
కానీ పై అధికారులు ఒంటికాలు సైనికుడు యుద్ధానికి పనికిరాడని అన్నారు. కావాలంటే పోటీ పడతానని చెప్పాడు.
పై అధికారికి కోపం వచ్చింది. “ప్రాణాల మీదకు తెచ్చుకుంటావా? శత్రువుకి దొరికిపోతే ఏం చేస్తావు?” అన్నాడు అధికారి.
“నేను శత్రువుకి దొరకను.” అన్నాడు కార్డొజో.
“పోటీలో పాల్గొంటే నేను నిన్ను అరెస్టు చేస్తాను జాగ్రత్త” అన్నాడు అధికారి.
“సర్… మీరు నేను పాల్గొన్న తరువాతే అరెస్టు చేయగలుగుతారు. కాబట్టి ముందు నన్ను పోటీ పడనీయండి. ఆ తరువాత అరెస్ట్ చేయండి.” అన్నాడు కార్డొజో ధీమాగా.
చివరికి అధికారి ఒప్పుకున్నాడు. పరుగు పందెం మొదలైంది. అందులో రెండు కాళ్లున్న ఏడుగురు ఆఫీసర్లను దాటి ముందుకు దూసుకెళ్లాడు కార్డోజో.
అధికారి కార్డొజో భుజం పై ఆప్యాయంగా చెయ్యి వేశాడు. “వెల్ డన్ సర్…” అన్నాడు అమిత గౌరవంతో.
ఆ తరువాత ఆ అధికారి సైన్యంలో ఉన్నతాధికారులు కార్డోజో పేరును అప్పటి సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ రైనాకి సిఫార్సు చేశాడు.
అతని పట్టుదలను చూసిన జనరల్ ఆయనకు ఒక బెటాలియన్ కమాండర్ గా నియమించాడు.
రక్షణ శాఖ అధికారులు అడ్డం పడ్డారు. “కుంటివాడు బెటాలియన్ ను కమాండ్ చేయడం ఏమిటి” అని కొర్రీలు పెట్టారు.
కానీ కార్డోజో పట్టుదల ముందు అభ్యంతరాలు ఆవిరైపోయాయి. కార్డోజో యుద్ధ భూమిలో, శత్రువు స్థావరాలకు ఛాతీ ఎదురొడ్డి కశ్మీర్ లోయలో పనిచేశారు. మేజర్ జనరల్ గా రిటైరయ్యారు. భారత సైన్యంలో వైకల్యాన్ని జయించి అత్యున్నత స్థాయికెదిగిన మొట్టమొదటి మేజర్ జనరల్ ఆయనే.
ఆయన తరువాత మరో ముగ్గురు యుద్ధంలో కాళ్లు పోయిన అధికారులు అత్యున్నత స్థాయికి ఎదిగారు. అందులో ఒకరికి రెండు కాళ్లూ లేవు.
రిటైర్ అయిన తరువాత కార్డోజో సైన్య చరిత్ర పై పరిశోధనలు చేశారు. పుస్తకాలు వ్రాశారు.
ఆయన ఎప్పుడూ నాలుగు మాటలు చెప్పేవారు. అవి...
”ఉన్నది ఒకటే జీవితం. పూర్తిగా జీవించు! ఉన్నది ఇరవై నాలుగు గంటలు... క్షణం తీరిక లేకుండా గడుపు!! ఎప్పటికీ పట్టు సడలించకు!!!”
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
No comments:
Post a Comment