*బభ్రువాహన -10*
🏹
"బావా ! మహానుభావా!! ఇంత వరకూ ఎన్నడూ ఏర్పడని దుశ్శకునాలు క్షణ క్షణాన ఎదురవతున్నాయి. యాగదీక్షలో ఉన్న నా మనస్సులో ఓ భయంకర సంఘటన నా గుండెలు పిండివేస్తూ మెదిలింది. అదీగాక, ఎన్నడూ ఎవరినీ తూలనాడి ఎరుగని మహాసౌజన్య మూర్తి యైన మన అర్జునుడు, ధర్మావతారుడు- నిరపరాధి అయిన ఒక రాచ యువకుణ్ణి నోటికి వచ్చినట్లు తిట్టి, అతణ్ణి అవమా నించినట్లు కూడా నాకు గోచరించింది. ఇప్పటికి అర్జునుడు యజ్ఞాశ్వం వెంట వెళ్ళి మూడు మాసాలు కావస్తోంది. ఎప్పటికప్పుడు క్షేమ సమాచారాలు తెలియపర్చుతూ ఉంటాడేమోననుకు న్నానుగాని, ఇంతవరకు అటువంటిదేమీ జరగలేదు. ఇప్పుడు ఈ పుత్పాతాలు కలగటానికి కారణమేమిటి? అర్జునుడికి ఏదైన ఆపద ఏర్పడి ఉండదు కదా?" అని ఆందోళనతో అడిగాడు ధర్మరాజు.
అప్పుడు కృష్ణుడు కొంత తడవు ఆలోచించి ధర్మరాజుతో, “యుధిష్ఠిర మహారాజా! నీ మనస్సు నిర్మలమైంది కాబట్టి, నువ్వు గొప్ప ఆత్మజ్ఞానం కలిగిన వాడివి కనుక నీకు ఇలా భవిష్యత్తు గోచరించింది. అర్జునుడికి ప్రస్తుతం అతని కుమారుడైన బభ్రువాహనుడితో చాలా భయంకరమైన యుద్ధం జరుగుతూంది." అన్నాడు.
ఆ మాటలకు ధర్మరాజు విస్మయిస్తూ, "బావా! నాకు తెలియకుండా నా తమ్ముడి కి ఎక్కడో పరాయి దేశంలో కుమారుడా?" అని అడిగాడు. కృష్ణుడు ధర్మరాజుకు బభ్రువాహనుడి జన్మవృత్తాతం వివరించి, అర్జునుడికి మణిపురంలో యజ్ఞాశ్వానికి సంబంధించి జరిగిన అనుభవాలను చెప్పాడు.
ఆ తర్వాత కృష్ణుడు ఖాండవ దహన కాలంలో జరిగిన ఒక వింత సంఘటనను ధర్మరాజుకు విశదీకరిస్తూ, "ఖాండవ వనంలోని జీవరాసులతో బాటు ఆ వనం లోని వృక్ష విశేషాలన్నిటినీ భక్షిస్తేనే అగ్ని వ్యాధి నయం అవుతుంది కాబట్టి, అర్జునుడు, నేను, ఆ వనంలోంచి చిన్న పురుగు కూడా తప్పించుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. అప్పుడు అశ్వ సేనుడనే నాగుడు తన తల్లిని వీపున ఎక్కించుకుని అర్జునుడి బాణ పంజరం నుండి తప్పించుకుంటూండగా, వారిని చూసి అర్జునుడు బాణంతో వారిద్దరినీ కొట్టాడు. అశ్వసేనుడి తల తప్పించు కుంది గాని, తక్కిన శరీరం తల్లితోబాటు అగ్నిలో పడిపోయింది.
ఆ అశ్వసేనుడి శిరస్సే నాగ్రాస్త్రంగా మార్పుచెంది, కర్ణుడి దగ్గర ఉండిపోయింది.
అగ్నిలో దగ్ధమవుతూ నాగమాత 'తల్లీ కొడుకుల ప్రాణాలు హరించినందుకు అర్జునుడు తన కుమారుడి చేత మృతి చెందుగాక!' అని శపించింది. ఇప్పుడు ఆ శాప ఫలితం అర్జునుణ్ణి...." అని కృషుడు ఇంకా ఏదో చెప్ప బోతుండగానే ధర్మ రాజు భయాందోళనలతో “బావా!" అన్నాడు.
కృష్ణుడు అతనికి ధైర్యం చెబుతూ, “ధర్మ నందనా! ఎవరికైనా వారికి ఉన్న శాప ఫలితం అనుభవించక తప్పదు. బభ్రు వాహనుడు యోగబలం కూడా కలిగిన ప్రతిభావంతుడు. తండ్రిని చేతులారా చంపుకుని అతడు ఊరికే ఉండడు. నా మాటలు విశ్వసించి నువ్వు నిశ్చింతగా ఉండు. నేను ఈ విషయంలో జోక్యం కలుగజేసుకోకపోవటానికి కూడా కారణం ఇదే" అన్నాడు.
కృష్ణుడి మాటలకు ధైర్యం వహించి, ధర్మ రాజు మనస్సును శాసించుకుంటూ యజ్ఞ నిర్వహణలో విలీనుడైపోయాడు.
🏹
11
అర్జునుని సైన్యాలకు, బభ్రువాహనుని సైన్యాలకు మణిపురం ముందు భీకరమైన పోరాటం జరుగుతూంది. మణిపుర యోధులు చిచ్చరపిడుగుల్లా చెలరేగి, అర్జునుడి సైన్యాలను చీకాకు పరుస్తున్నారు, ఆ మహాయుద్ధంలో పాండవ సేనాధిపతులను మణిపుర సేనాధిపతులు ఎదిరించారు! మహా బలవంతుడైన వృషసేనుణ్ణి వీరాధివీరు డైన నాగార్జునుడు నిలువరించాడు. బభ్రువాహనుడు తన తండ్రియైన అర్జునుడినే ఎదుర్కొని యుద్ధం చేయసాగాడు.
అంతవరకూ ఎక్కడా తమకు ప్రతిఘటనే ఎదురుకాకుండా, చివరకు అర్జునుడి కుమారుని సైన్యాల తోనే పోరాటం చేయవలసివచ్చినందుకు విచారిస్తూనే పాండవ సైన్యాలు యుద్ధం చేస్తున్నాయి.
భూనభోంతరాళాలు దద్దరిల్లేటట్లు ఆ విధంగా అర్జునుడు, బభ్రువాహనుడు తలపడి, ఒకరిపై మరొకరు దివ్యాస్త్రాలు ప్రయోగిస్తూ పోరాటం ప్రారంభించారు.
తండ్రికి ఏ మాత్రం తీసిపోని పరాక్రమ శాలి, దివ్యాస్త్ర కోవిదుడు అయిన బభ్రు వాహనుణ్ణి చూడటానికి ఆకాశంలో దేవతలు తమ తమ వాహనాల మీద బారులు తీరి ఉన్నారు.
అంతకు ముందు కూడా అర్జునుడు ఎన్నో పర్యాయాలు రకరకాల శతృవీరులను ఎదుర్కొని యుద్ధం చేయటం చూశారు గాని, బాల వీరుడైన బభ్రువాహనుడితో పోరాటం అంత దుర్భరంగా అతడు కొనసాగించటం దేవతలకు అదే ప్రథమ దృశ్యం!
“ఆహా! తండ్రికి తగిన తనయుడే కాదు, మించిన తనయుడుగా కూడా బభ్రు వాహనుణ్ణి మనం పేర్కొనవచ్చు. తన బాణాన్ని అమ్ముల పొది నుండి ఎప్పుడు బైటికి లాగుతున్నాడో, ఎప్పుడు వింటిని సంధించి చెవిదాకా లాగి వదులుతున్నా డో ఎప్పుడు ఆ బాణం రివ్వున ముందుకి దూసుకువెళ్ళి అర్జునుడి బాణాలను నుగ్గునూచం చేస్తూందో, ఊహకే అందరాని విషయంగా ఉందే? భళీ! రెండవ అర్జునుడిలా యుద్ధ రంగంలో ప్రకాశిస్తున్న బభ్రువాహనుడి శస్త్ర విద్యా పాండిత్యం చూడటానికి మాకు రెండు కన్నులు చాలడం లేదు. వెయ్యి కళ్ళు ఉన్న నీ ఆనందం ఎలా ఉందో మేం ఊహించలేకుండా ఉన్నాం మహేంద్రా!" అన్నాడు అష్టదిక్పాలకుల మధ్యలో ఉన్న ఇంద్రుణ్ణి చూస్తూ బృహస్పతి.
ఇంద్రుడు చిన్నగా నవ్వి, “ఇలా చూడటం ఆనందమనిపించుకుంటుందా గురుదేవా! ఏ తండ్రి అయినా తన పుత్రుడి దైన్యాన్ని చూసి హర్షిస్తాడా? మా అర్జునుడి ముఖం లో అలుముకుంటున్న విచార రేఖలను చూడండి. పాపం! పందికై ఫాలాక్షుడితో పోరాడుతున్నప్పుడు గాని, ఆ తర్వాత మన ఆహ్వానం మీద స్వర్గానికి వచ్చి నివాత కవచాది ఘోర రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడుగాని, ప్రచండ పరాక్రముడై ఒక్కడూ-వీరాధి వీరులైన భీష్మ, ద్రోణ, కృపాశ్వత్థామ, కర్ణాదులను ఎదిర్చి పోరు కొనసాగించేటప్పుడుగాని, మనం ఎన్నడైనా ఆ ముఖంలో ఒక్క వీర లక్షణం తప్ప మరో అవలక్షణం చూడ లేదు. ఇప్పుడు చూడండి- అతడి చేతి లోని గాండీవం వణుకుతోంది. అస్త్ర ప్రయోగ విషయాల్లో తొట్రుపడుతున్నా డు. నిష్కారణంగా సారధిని కసురుకుం టున్నాడు. ఒక్కొక్కసారి బభ్రువాహనుడి బాణాల నుంచి తప్పించుకోవటానికి యమ యాతన పడుతున్నాడు. నా కుమారుడి దురవస్థ నాకు ఆనందంగా లేదు గురుదేవా!" అన్నాడు.
ప్రారంభంలో ఉన్న నవ్వు క్రమక్రమంగా ఇంద్రుడి ముఖంలో కనిపించకపోవటం చూసి బృహస్పతి, “అమరేంద్రా! నీ కుమారుణ్ణి అటువంటి దురవస్థకు గురి చేస్తున్నది ఎవరో కాదు కదయ్యా? సాక్షాత్తూ నీ మనమడే! అయినా, అర్జునుడి మనస్సు ప్రస్తుతం ధర్మపథంలో లేదు" అన్నాడు.
ఆ మాటలకు ఇంద్రుడు ఉలిక్కిపడి, “గురుదేవా! ఏమన్నారు? మా అర్జునుడి మనస్సు ధర్మపథంలో లేదా? అసలు పంచపాండవులలోనే కాదు, మానవుల లోనే ఉత్తమ ధర్మవేత్త అని అందరిచేత ప్రశంసలు పొందిన అర్జునుడు ఏ కారణం వల్ల ధర్మపథం నుండి దూరమయ్యాడు?" అని అడిగాడు.
"ప్రియ కుమారుడు ప్రేమగా స్వాగతం ఇవ్వటానికి రాగా అతడ్ని నీచాతినీచంగా దూషించాడు. మహా సాధ్వీ శిరోమణియై న బభ్రువాహనుడి తల్లి చిత్రాంగదాదేవిని హీనాతిహీనంగా తిట్టి, అవమానించాడు. అతడు ధర్మపథం తప్పటానికి ఇవి రెండు కారణాలు చాలవా?" అన్నాడు బృహస్పతి.
"ఓహో! అలా జరిగిందా? అందువల్లనే బభ్రువాహనుడు రెచ్చిపోయి తండ్రితో అలా యుద్ధం చేస్తున్నాడన్న మాట. అయినా గురుదేవా! ఇంతకాలం తర్వాత భార్యా పుత్రుల సందర్శన భాగ్యం కలిగించుకున్న మా అర్జునుడు వారినిద్ద రినీ ఆదరించటానికి బదులు ఇలా అవమానించటానికి కారణమేమిటి? విధి ప్రేరేపణా? లేక...." అంటూ ఇంద్రుడు సాలోచనగా బృహస్పతి ముఖంలోకి చూశాడు.
“అర్జునుడికి సంక్రమించిన శాపమే అతణ్ణి ఇప్పట్లో అధర్మపరుణ్ణి చేసింది. ఆ శాపం పండటానికి ఇది నాంది మాత్రమే. పర్యవసానం బభ్రువాహనుడి యుద్ధం నిర్ణయిస్తుంది" అన్నాడు బృహస్పతి.
"అంటే ఇంకా....? ఏమిటో వివరంగా చెప్పండి" అన్నాడు మహేంద్రుడు.
"నేను చెప్పటమెందుకు ఇంద్రా? ఆ రహస్యం దివ్యదృష్టితో నువ్వే తెలుసుకో. పూర్వాపరాలు నీకు స్పష్టంగా అర్థమైన తర్వాత ఆ విషయమై ఆందోళన కలిగినా, మనం చెయ్యగలిగిందేమీ లేదు” అన్నాడు బృహస్పతి.
వెంటనే ఇంద్రుడు కళ్ళు మూసుకుని దివ్య దృష్టిని తాను ఊహించుకున్న విషయం మీదికి ప్రేరేపించాడు.
గతంలో, ఖాండవవనాన్ని అగ్ని దహిస్తూ ఉండగా తాను తక్షకుడి ప్రార్థనను అంగీకరించి, ఆ వనాన్ని అర్జునుడు దహించకుండా రకరకాల ప్రయత్నాలు చేయటం, ఆ ప్రయత్నాలలో ఒక భాగంగా ప్రళయ మేఘాలను ఉసికొల్పి భీకరంగా, జగద్భయంకరంగా వర్షం కురిపించటం, అర్జునుడు ఆ వానను అరికట్టి, అగ్ని దేవుడి చేత ఖాండవ వనం దహించబడే టందుకు వీలుగా ఆ వనం పైన బాణాల తో పందిరి నిర్మించటం, అంతేకాక ఆ వనం చుట్టూ దడిని కూడా ఏర్పరచడం.. మొదలైన విశేషాలన్నీ మనోనేత్రం ముందు గోచరించాయి.
🏹
*సశేషం*
꧁☆
No comments:
Post a Comment